కరోనా దెబ్బ ప్రపంచానికి గట్టిగా తగిలింది. దీని ధాటికి కీలక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయి. పలు ఆర్థిక వ్యవస్థలన్నీ భారీ స్థాయిలో నష్టాలని చూస్తున్నాయి. ఇందుకు సినిమా ఇండస్ట్రీ కూడా మినహాయింపు కాదు. లాక్డౌన్ కి ముందు రిలీజ్‌కు సిద్ధమైన చిత్రాలన్నీ ఏం చేయాలో దిక్కుతోచని స్థితికి వెళ్లిపోయాయి. ఇక సగం షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్లది ఒక విధంగా చెప్పాలంటే అరణ్య రోదనే.
కరోనా దెబ్బకు దేశ వ్యాప్తంగా సినిమాల నిర్మాణం ఆగిపోయింది. భారీ చిత్రాలే అత్యధికంగా వున్నాయి. ఇందులో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న `గంగూ బాయి కతియావాడీ`. అలియాభట్ టైటిల్ పాత్ర పోషిస్తోంది. యదార్థ గాధ ఆధారంగా ఈ చిత్రాన్ని సంజయ్‌లీలా భన్సాలీ స్వయ నిర్మాణంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం కూడా మధ్యలోనే కరోనా కారణంగా ఆపేశారు. సంజయ్ లీలా భన్సాలీ చిత్రాలంటే భారీ సెట్స్‌కు పెట్టింది పేరు.
ఓ లేడీ గ్యాంగ్‌స్టర్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం భారీ సెట్లని ముంబైలోని ఫిల్మ్ సిటీలో నిర్మించారు. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబైలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పట్లో షూటింగ్‌లకు పర్మీషన్లు ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. మరో ఐదారు నెలలు పట్టే అవకాశం వుండటంతో సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రం కోసం వేసిన సెట్‌ని కూల్చాలని నిర్ణయించుకున్నారట. త్వరలోనే తొలిగించబోతున్నామని ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ సంజయ్ లీలా భన్సాలీ వెల్లడించడంతో బాలీవుడ్ వర్గాలు షాక్ కు గురవుతున్నాయట.