కమల్‌కు లైకా ఆర్డర్ పాస్ చేస్తోందా?

`ఇండియ‌న్ 2` షూటింగ్ సంద‌ర్భంగా ఏర్ప‌డిన ప్ర‌మాదం చిలికి చిలికి క‌మ‌ల్ – లైకా మ‌ధ్య ఈగో వార్‌గా మారుతున్నట్టే క‌నిపిస్తోంది. ఈ సినిమా కోసం చెన్నైలోని ఓ స్టూడియో లో వేసిన బ్లూమాట్ సెట్‌లో క‌మ‌ల్‌, కాజ‌ల్ పాల్గొన‌గా శంక‌ర్ కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తుండగా క్రేన్ విరిగిప‌డి ముగ్గురు వ్య‌క్తులు మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ దుర్ఘ‌ట‌న త‌రువాత షాక్‌కు గురైన సెల‌బ్రిటీస్ దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. క‌మ‌ల్ మాత్రం చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు త‌న వంతుగా కోటి ఇస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు.

ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌ని ఆర్థ‌కంగా ఆదుకోవాల‌ని, షూటింగ్ స్పాట్‌లో భ‌ద్ర‌తాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈ కండీష‌న్స్‌కి ఒప్పుకుంటేనే తాను షూటింగ్‌లో పాల్గొంటాన‌ని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై సుతిమెత్తంగా స్పందిస్తూనే లైకా వ‌ర్గాలు జ‌రిగింది చాలు ఇక షూటింగ్ మొద‌లుపెడితే మంచిది అనే విధంగా క‌మ‌ల్‌కి ఆర్ద‌ర్ వేసినంత‌ప‌ని చేయ‌డం త‌మిళనాట చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల‌కు 2 కోట్లు ఆర్థిక స‌హాయాన్ని అందించామ‌ని, వ్య‌క్తిగ‌త బీమా, ప్రొడ‌క్ష‌న్ బీమా అందేలా చూస్తామ‌ని, లొకేష‌న్‌లో ఎలాంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా అన్ని ఏర్పాట్లు చేశామ‌ని. త‌మ‌రు వ‌స్తే ఒక షూటింగ్ మొద‌లుపెడ‌దామ‌ని చెప్ప‌డం క‌మ‌ల్‌కి లైకా వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్టుగా లేద‌ని, ఇది ఎలాంటి ట‌ర్న్ తీసుకుంటుందోన‌ని కోలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీనిపై క‌మ‌ల్ మ‌ళ్లీ కౌంట‌ర్ ఇస్తే `ఇండియ‌న్ 2` ముందుకు సాగ‌డం క‌ష్ట‌మే.