నటీనటులు: నందమూరి కల్యాణ్‌రామ్, మెహరీన్, శరత్‌బాబు, సుహాసిని, విజయ్‌కుమార్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, పవిత్ర లోకేష్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను తదితరులు నటించారు.
దర్శకత్వం: సతీష్ వేగేశ్న
నిర్మాతలు: శుభాష్ గుప్తా, ఉమేష్ గుప్తా
సంగీతం: గోపీసుందర్
ఫొటోగ్రఫీ: రాజ్ తోట
ఎడిటింగ్: తమ్మిరాజు
రిలీజ్ డేట్: 15-010-2020
రేటింగ్: 2.5
నందమూరి కల్యాణ్‌రామ్ `పటాస్` స్థాయి సక్సెస్‌ని అందుకుని చాలా కాలమే అవుతోంది. ఆ తరువాత షేర్, ఇజమ్, ఎమ్ ఎల్ ఏ వంటి చిత్రాల్లో నటించారు. ఇవేవీ కల్యాణ్‌రామ్‌కు సక్సెస్ ని కాదుకదా ఊరటనిచ్చే విజయాన్ని కూడా అందించలేకపోయాయి. కెమెరామెన్ కె.వి. గుహన్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ కల్యాణ్‌రామ్ చేసిన `118` యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం ఫరవాలేదనిపించింది. పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం కల్యాణ్‌రామ్ చేసిన చిత్రం `ఎంత మంచివాడవురా!`. కుటుంబ విలువలు, అనుబంధాల నేపథ్యంలో రూపొందిన `శతమానంభవతి` చిత్రంతో ప్రశంసలతో పాటు జాతీయ స్థాయిలో అవార్డుల్ని సొంతం చేసుకున్నారు వేగేశ్న సతీష్. కానీ `శ్రీనివాసకల్యాణం`తో నిరుత్సాహపరిచారు. దీంతో కల్మాణ్‌రామ్‌తో కలిసి చేస్తున్న సినిమాపై ప్రారంభం నుంచి ట్రేడ్ వర్గాల్లో కానీ ప్రేక్షకుల్లో కానీ ఎలాంటి అంచనాలు లేవు. సంక్రాంతి బరిలో సినిమా వస్తోందన్నమాటే కానీ ఆ కల, ఆ హంగామా ఈ సినిమాకు ఏ స్థాయిలోనూ కనిపించలేదు. సంక్రాంతి పండగ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన `ఎంత మంచి వాడవురా` ఎలా వుంది. ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచిందా? లేక వారి ఊహకు తగ్గట్టే వుందా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
బాలు (కల్యాణ్‌రామ్) లైఫ్‌లోని ప్రతి అంశాన్ని పాజిటివ్‌గా కొత్త కోణంలో ఆలోచిస్తుంటాడు. షార్ట్ ఫిల్మ్స్‌లో నటించడమే అతని సని. నందిని (మెహరీన్) నిర్మిస్తున్న షార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తూనే `ఆల్ ఈజ్ వెల్` పేరుతో ఓ సంస్థని నడుపుతుంటాడు. అందరికి బాలుగానే తెలిసినా ఊర్లో తనని ఇష్టపడే వారికి మాత్రం మూడు పేర్లతో దగ్గరవుతుంటాడు. వాళ్ల కుటుంబాలతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతూ వారి ఇంట్లో వ్యక్తిగా కలిసిపోతుంటాడు. ఇంతకీ బాలు ఎవరు?. మూడు పేర్లతో చలామణి కావడానికి గల కారణం ఏమిటీ? బఆలు నడుపుతున్న `ఆల్ ఈజ్ వెల్` వెనకున్న ముఖ్య ఉద్దేశం ఏమిటి?. నిజంగా బాలు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్తేనా?. అతనికి నందినికి వున్న అనుబంధం ఏంటి? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
నటీనటులు:
వరుస ఫ్లాపుల తరువాత కల్యాణ్‌రామ్ నుంచి వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో ఇందులో ఆయన పాత్ర కొత్తగా వుంటుందని ట్రైలర్‌ని చూసి అంతా అనుకున్నారు. కానీ ఆ స్థాయిలో ఏ మాత్రం లేదు. పాత సినిమాల్లోని హీరో పాత్రల్ని గుర్తుకు తెచ్చేలా వుంది. పైగా భావోద్వేగా సన్నివేశాల్లో కల్యాణ్‌రామ్ నటన అంతగా ఆకట్టుకోదు. కారణం దర్శకుడు రాపుకున్న సన్నివేశాల్లో బలం లేకపోవడమే. మెహరీన్ కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంది. గత చిత్రాలకు మించి అందంగా కనిపించింది కూడా. ఇక మిగతా కీలక పాత్రల్లో నటించిన శరత్‌బాబు, సుహాసినని, విజయ్‌కుమార్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, పవిత్ర లోకేష్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను తమ పాత్రల పరిధిమేరకు నటించారు. రాజీవ్ కనకాల విలనిజమ్ మెప్పిస్తుంది. వెన్నెల కిషోర్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను హాస్యాన్ని పండించాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు.
సాంకేతిక నిపుణులు:
టాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో దూసుకుపోతన్న గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పాటల్లో `ఏమో ఏమో… అవునో తెలియదు వంటి పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. సాంకేతికంగా సినిమా కొంత పరవాలేదు. `అర్జున్‌రెడ్డి` ఫేమ్ రాజ్ తోట ఈ చిత్రానికి ఫొటొగ్రఫీని అందించారు. ప్రతి ఫ్రేమ్ అందంగా చూపించడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నారని అనిపిస్తుంది. ఆడియో రంగంలో సుప్రీమ్ ఆడియో తరువాత అగ్రగామిగా నిలిచిన ఆదిత్య మ్యూజిక్ ఈ సినిమాతో తొలిసారి నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్‌తో కలిసి ఆదిత్య ఉమేష్ గుప్తా, శుభాష్ గుప్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. రచయితగా, దర్శకుడిగా `శతమానంభవతి` చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న వేగేశ్న సతీష్ ఈ సినిమాలో మాత్రం తన పనితనాన్న చూపించలేకపోయారు.
విశ్లేషణ:
ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకి ప్రధాన బలం కథ, కథనం, కథలోని ఎమోనల్ సీన్స్. అవి ఏ మాత్రం ఈ చిత్రంలో పండిన దాఖలాలు బూతద్దం పెట్టి వెతికినా కనిపించవు. టైటిల్‌ని బట్టి ఓ మంచి వాడి కథ అనుకున్నా సినిమాలోని సన్నివేశాల్లో మాత్రం ఆ ఫీల్ కనిపించదు. హీరోయిన్ ఫ్లాష్ బ్లాక్ చెప్పడంతో సినిమా కథ మొదలయ్యేలా చూపించారు. మన చుట్టూ వున్న వాళ్లలో ఆనందం చూడాలన్న ప్రాధాన పాయింట్ ని ఎంచుకుని ఓ మంచి వాడి పాత్రతో చెప్పాలనుకున్న దర్శకుడి ప్రయత్నం ఏ సన్నివేశంలోనూ ఆకట్టుకోదు. భావోద్వేగాలే ప్రధానంగా భావించాల్సిన ఈ కథకి అవే ప్రధాన మైనస్‌గా మారిన తీరు ప్రేక్షకుడిని కథ నుంచి డివేట్ అయ్యేలా చేస్తాయి. `శతమానంభవతి` చిత్రాన్ని భావోద్వేగాల ప్రధానంగా నడిపించి ఆకట్టుకున్న వేగేశ్న సతీష్ ఈ సినిమా విషయంలో మాత్రం తడబడ్డరు. కథలోని కోర్ పాయింట్ కొత్తగా వున్నా దాన్ని నడిపించిన తీరు, అల్లుకున్న సన్నివేశాలు చాలా పేలవంగా వుండటంతో `ఎంత మంచివాడవురా` సగటు ప్రేక్షకుడికి ఓ టార్చర్‌లా మారింది. కథ, కథనం, భావోద్వేగాలు ఏమాత్రం పండకపోవడం ఈ చిత్రానికి ప్రధాన మైనస్‌గా నిలిచి నిరాశ పరిచింది.