మాస్ మహరాజా సినిమా వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. నేలటిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని వరుసగా ఫ్లాప్ కావడంతో ఆలోచనలోపడ్డ రవితేజకొంత విరామం తీసుకుని ఒకే సారి రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రెండూ డిఫరెంట్ థీమ్‌తో భిన్నమైన నేపథ్యాలతో రూపొందుతున్నవే. మురుగదాస్ శిష్యుడు వి.ఐ. ఆనంద్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `డిస్కోరాజా` కంప్లీట్ డిఫరెంట్ జోనర్ ఫిల్మ్. రెట్రో లుక్‌లో రవితేజ్ డిఫరెంట్‌గా ట్రై చేస్తున్న సినిమా ఇది.
గోపీచంద్ మలినేని కొంత విరామం తరువాత చేస్తున్న సినిమా `క్రాక్`. బలుపు తరువాత రవితేజ, గోపీచంద్ మలినేని కలయికలో వస్తున్న చిత్రమిది. `డిస్కోరాజా` ఈ నెల 24న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా రవితేజ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. గతంతో పోలిస్తే ప్రేక్షకుల మైండ్ సెట్ మారిందని, కొత్తగా వుంటేనే సినిమా చూస్తున్నారని, న్యూఏజ్ డైరెక్టర్స్ కొత్త కథలతో వస్తున్నారని, కొత్తగా వుంటే విలన్ పాత్రల్లో నటించడానికైనా తాను సిద్ధమేనని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. బాబీ సింహా తరహా పాత్రల్లో నటించాలనుకుంటున్నానని రవితేజ చెబుతున్నారు. మరి అతని కోరికని ఏ దర్శకుడు తీరుస్తాడో చూడాలి.