Vimanam Movie Review – ‘విమానం’ మూవీ రివ్యూ & రేటింగ్

(చిత్రం : విమానం, విడుదల తేది : 9 జూన్, 2023, రేటింగ్ : 2.75/5, దర్శకత్వం : శివ ప్రసాద్ యానాల, నటీనటులు : స‌ముద్రఖ‌ని, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధనరాజ్, రాజేంద్ర‌న్ తదితరులు, మాటలు : హ‌ను రావూరి (తెలుగు), ప్ర‌భాక‌ర్ (త‌మిళం), ఛాయాగ్రహణం : వివేక్ కాలేపు, పాటలు, సంగీతం : చరణ్ అర్జున్, నిర్మాణం : జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌), పాటలు : స్నేహ‌న్‌(తమిళ్), చరణ్ అర్జున్ (తెలుగు), ఎడిట‌ర్‌: మార్తాండ్ కె.వెంక‌టేష్‌, ఆర్ట్‌: జె.జె.మూర్తి)

శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌) నిర్మించిన చిత్రం ‘విమానం’. ఈ సినిమా విడుదలకు ముందు వచ్చిన ప్రచార చిత్రాలు, ట్రైల‌ర్‌ ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షించాయి. ఇందులో సముద్రఖని వికలాంగునిగా, ఆయన కుమారుడిగా మాస్టర్ ధ్రువన్ నటించారు. అనసూయ వేశ్య పాత్రని పోషించారు. కొంత విరామం తర్వాత మీరా జాస్మిన్ ఈ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాహుల్ రామకృష్ణ, మొట్ట రాజేంద్రన్ ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం 9 జూన్, 2023న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం..

కథ: వీరయ్య (సముద్రఖని) వికలాంగుడు. కుమారుడు రాజు (‘మాస్టర్’ ధ్రువన్)కు జన్మనిచ్చిన తర్వాత భార్య మరణిస్తుంది. వారసత్వంగా వచ్చిన సులభ్ కాంప్లెక్స్ అతని జీవనాధారం. అబ్బాయే అతని జీవితం. రాజుకు విమానం ఎక్కాలని కోరిక. ఫ్లైట్ అంటే పిచ్చి. ఎప్పుడూ విమానం గోలే. అబ్బాయికి లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) ఉందని తెలియడంతో ఎలాగైనా విమానం ఎక్కించాలని వీరయ్య నిర్ణయించుకుంటాడు. వీర‌య్య అంగ వైక్య‌లంతో ఇబ్బంది ప‌డుతున్నా కొడుకుని మాత్రం ఎంతో ప్రేమ‌గా చూసుకుంటుంటాడు. వీర‌య్య కొడుక్కి మాత్రం ‘విమానం’ అంటే పిచ్చి. విమానం ఎక్కాల‌ని ఆలోచ‌న‌ల‌తో ఎప్పుడూ త‌న చుట్టూ ఉన్న‌వారిని ప్ర‌శ్నిస్తూనే ఉంటారు. తండ్రిని కూడా విమానం ఎక్కించ‌మ‌ని బ‌తిమాలాడుకుంటూ ఉంటాడు. బాగా చ‌దువుకుంటే నువ్వే విమానం ఎక్క‌వ‌చ్చునని కొడుకుతో అంటుంటాడు వీర‌య్య‌. తండ్రీ కొడుకుల మ‌ధ్య అస‌లు ఈ విమానం గోల ఏంటి? ఆ తర్వాత ఏమైంది? జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వీరయ్య జీవితంలో బస్తీలో వేశ్య సుమతి (అనసూయ), చెప్పులు కుట్టే కోటి (రాహుల్ రామకృష్ణ), ఆటో డ్రైవర్ డేనియల్ (ధనరాజ్) పాత్రలు ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ : ప్రతీ ఒక్క‌రి జీవితాల్లో బ‌ల‌మైన భావోద్వేగాలుంటాయి. అలాంటి ఎమోష‌న్స్‌ను బేస్ చేసుకునే ‘విమానం’ తెరకెక్కింది. బస్తీలో ఉండే తండ్రీ కొడుకులు.. పూట గ‌డిస్తే చాల‌నుకునే చాలీ చాల‌ని సంపాద‌న‌.. అలాంటి ఓ పేద కుటుంబంలోని ఉండే పిల్లాడుకి విమానం ఎక్కాల‌నే కోరిక పుడుతుంది. తండ్రి అవిటిత‌నంతో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ కొడుకు కోరిక‌ను తీర్చాల‌నుకుని రాత్రి ప‌గ‌లు క‌ష్ట‌ప‌డుతుంటాడు. విమానం ఎక్కాల‌నుకునే కొడుకు కోరిక‌ను తీర్చటానికి ఏం చేయాలా? అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. ఇది తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉండే ఎమోష‌న్‌. సుమ‌తీ అనే అమ్మాయిని ప్రేమించే కోటి.. లోక‌మంతా త‌న‌ను కామంతోనే చూస్తుంద‌ని భావించే ఆమెకు త‌నను మ‌న‌స్ఫూర్తిగా ప్రేమించే వాడున్నాడ‌ని తెలియ‌గానే ఆమె హృద‌యంలో నుంచి వచ్చే ఆవేద‌న‌.. ఇది రెండు హృద‌యాల మ‌ధ్య ఉండే ఎమోష‌న్‌.. హృద‌యాన్ని తాకే ఈ ఇలాంటి భావోద్వేగాల వ్య‌క్తుల ప్ర‌యాణాన్ని తెలియ‌జేసే చిత్ర‌మే ‘విమానం’. మాస్ట‌ర్ ధ్రువన్ కొడుకుగా న‌టిస్తే, తండ్రి పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు స‌ముద్ర ఖ‌ని న‌టించారు. వీరి మ‌ధ్య సాగే విమానం సంభాష‌ణ ఆస‌క్తిక‌రంగా, ఫ‌న్నీగా ఉంది. అలాగే సినిమాలో బ‌ల‌మైన ఎమోష‌న‌ల్ అంశాలు కూడా మిళిత‌మై ఉన్నాయి. ‘నాన్నా ఎప్పుడు దేవుడు క‌న‌ప‌డినా దండం పెట్టుకోమంటావు ఎందుకు’ అని అడిగిన కొడుకుతో ‘మనం అడిగినవన్నీ ఇస్తాడు’ కాబట్టి అని తండ్రి చెబుతాడు. దానికి ఆ పిల్లాడు ‘అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు.. నాన్నా అంటారు’ అనే ఓ డైలాగ్ చాలు.. తండ్రీ కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగ బంధాన్ని సినిమాలో ఎలా చూపించారో చెప్పటానికి. ఈ సినిమాలో మంచి కథ, అంతకు మించి కంటతడి పెట్టించే భావోద్వేగభరిత సన్నివేశాలు ఉన్నాయి.. సినిమాలో క్యారెక్టర్లు తక్కువ ఉన్నాయి. పరిమిత పాత్రలతో కథ ముందుకు నడిచేటప్పుడు సీన్లు ఎంత క్రిస్పీగా ఉంటే… స్క్రీన్ ప్లే ఎంత ఫాస్ట్‌గా ఉంటే… ప్రేక్షకుడు అంతలా కనెక్ట్ అవుతాడు. కథలో లీనం అవుతాడు. లీనమయ్యేలా చక్కని కథనంతో సినిమాను నడిపించడంలో దర్శకుడు శివ ప్రసాద్ యానాల ప్రతిభను కనబరిచారు. ‘విమానం’ ప్రారంభంలో తండ్రీ కొడుకుల మధ్య, వాళ్ళతో ఆ బస్తీ ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరించడంలో దర్శకుడు చక్కటి ఎక్కువ సమయం తీసుకున్నారు. అనసూయ, రాహుల్ రామకృష్ణ మధ్య సన్నివేశాలు బావున్నాయి. అయితే, కథలో భాగంగా ముందుకు తీసుకువెళితే మరింత బావుండేది. స్కూల్ లో సన్నివేశాలు చిన్నారుల అమాయకత్వాన్ని చూపెడుతూ నవ్విస్తాయి. ఇంటర్వెల్ దగ్గర క్లైమాక్స్ ఎలా ఉంటుందనే ఐడియా ప్రేక్షకులకు వస్తుంది. ప్రేక్షకులు ఎవరూ ఊహించని మరో ట్విస్ట్ క్లైమాక్స్‌లో ఇచ్చారు. మధ్యలో ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. తండ్రీ కుమారుల జర్నీ హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. విమానం’ టేకాఫ్ కావడానికి కొంత టైమ్ తీసుకుంది. ఇంటర్వెల్ వరకు రన్ వే మీద ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. మధ్యలో కొన్ని సీన్లు అలరించినా ఎంత సేపటికీ కథ ముందుకు కదలదు. ఇంటర్వెల్ తర్వాత జర్నీ గాడిలో పడింది. విమానం పర్ఫెక్ట్‌గా ల్యాండింగ్ అవుతుంది.

ఎవరెలా చేశారంటే : వీర‌య్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్ర‌లో స‌ముద్ర ఖ‌ని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ న‌టించారు. సుమ‌తి పాత్ర‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, రాజేంద్ర‌న్ పాత్ర‌లో రాజేంద్ర‌న్‌, డేనియ‌ల్ పాత్ర‌లో ధ‌న్‌రాజ్‌, కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ కనిపిస్తారు. తండ్రి పాత్రకు సముద్రఖని న్యాయం చేశారు. మాస్టర్ ధ్రువన్ నటనలో అమాయకత్వం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య భావోద్వేగభరిత సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. థియేటర్లలో ప్రేక్షకులు సైతం ఎమోషనల్ అవుతారు. అయితే… థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు (ముఖ్యంగా మాస్ సెంటర్స్) గుర్తు చేసుకునే మరో నటి అనసూయ. జీవితంలో ఒక్కొక్క‌రికీ ఒక్కో క‌థ ఉంటుంది. ప్ర‌తీ క‌థ‌లోనూ హృద‌యాల‌ను క‌దిలించే భావోద్వేగం ఉంటుంది. అలాంటి సుమ‌తి అనే ఓ ఎమోష‌న‌ల్ అండ్ బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో మెప్పించింది. అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌ వేశ్య పాత్రలో సుమతి అవసరమైన శృంగార రసాన్ని పలికించారు. క్లైమాక్స్ ముందు ఎమోషనల్ సీన్ అంత కంటే బాగా చేశారు. రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ తమ పాత్రల్లో ఈజీగా నటించారు. మీరా జాస్మిన్ నటించడం వల్ల ఎయిర్ హోస్టెస్ పాత్రకు హుందాతనం వచ్చింది.

సాంకేతిక వర్గం : ముఖ్యంగా చరణ్ అర్జున్ స్వరాలు, సాహిత్యం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి హ‌ను రావూరి డైలాగ్స్ హృదయాన్ని తాకాయి. వివేక్ కాలేపు సినిమాటోగ్రఫీ పనితనం మెచ్చుకోవలసిందే. ప్రతీ సన్నివేశాన్ని ఎంతో భావోద్వేగభరితంగా తన కెమెరాలో బంధించింది. మార్తాండ్ కె.వెంక‌టేష్‌ ఎడిటింగ్ ఒకే. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌) నిర్మించిన ‘విమానం’ చిత్రం నిర్మాణ విలువలు బేషుగ్గా ఉన్నాయి.

చివరగా చెప్పేదేమిటంటే.. ఇప్పటిదాకా ఫాదర్స్ డే శుభాకాంక్షలు విని ఉంటారు.. విమానం సినిమా చూస్తుంటే అసలు ఫాథర్స్ డే ని ఫీల్ అవుతారు…ప్రతి తండ్రి , పిల్లలని ప్రేమించడం కాదు , వాళ్ళ కోరికలని కూడా గొప్పగా ప్రేమిస్తారు అని చెప్పే సినిమా విమానం. ఈ చిత్రంలో సముద్రఖనిని చూస్తున్నంత సేపు , మీ నాన్న గుర్తుకు వస్తారు.. సినిమా నుండి బైటకి రాగానే కచ్చితం గా మీ నాన్న కి ఫోన్ చేసి thank you చెబుతారు.. విమానం చూసి థియేటర్ లో నుండి బైటకి వస్తారు కానీ, మీ నాన్న జ్ఞాపకాల నుండి మాత్రం బైటకి రాలేరు…సృష్టి లో అమ్మ గొప్పది..కానీ ఆ అమ్మ కూడా వాళ్ళ నాన్నని హీరోలానే చూస్తుంది… అది నాన్న గొప్పతనం.. అమ్మ కన్నీళ్లు అందరకి తెలుస్తాయి.. కానీ నాన్న కన్నీళ్లు కర్చీఫ్ కే తెలుస్తాయి.. ఆ విషయం విమానం చూసాక మీకే తెలుస్తుంది…మీకు ఏదైనా విషయం లో నాన్న మీద కోపం ఉంటే అది తగ్గిపోతుంది ,ప్రేమ ఒక్కటే ఉండి పోతుంది , కష్టం వస్తే అమ్మ ఓదారుస్తుంది,నాన్న ఐతే అసలు ఆ కష్టమే రాకుండా చూస్తాడు…త్యాగం అనే పదం నాన్న నుండి పుట్టిందేమో అనిపిస్తుంది విమానం చూసాకా. మొత్తం మీద భావోద్వేగాల వ్య‌క్తుల ప్ర‌యాణాన్ని తెలియ‌జేసే చిత్రంగా ‘విమానం’ ప్రేక్షకుల హృదయాల్ని తాకుతుంది. ప్రతీ ఒక్కరూ చూడాల్సిన సినిమా ‘విమానం’.
-ఎం.డి. అబ్దుల్