―సికిందర్
Rating: 2. 25 / 5
***
ఒక దశాబ్ద కాలంగా, అంటే 2010 నుంచీ రజనీకాంత్ సినిమాల స్టయిల్ రెగ్యులర్ మాస్ ఎంటర్ టైనర్ ల నుంచి పక్కకు జరుగుతూ వచ్చింది. 2010 లో ‘రోబో’ అనే సైన్స్ ఫిక్షన్ తో ఈ మార్పు కొనసాగింది. ‘రోబో’ తర్వాత వరసగా ‘కొచ్చాడియన్’ అనే యానిమేషన్, ‘కబాలీ’, ‘కాలా’ అనే రెండు రియలిస్టిక్స్ తర్వాత, ‘రోబో- 2’ అనే మరో సైన్స్ ఫిక్షన్ వచ్చాయి. మధ్యలో ఒకే ఒక్క మాస్ ఎంటర్ టైనర్ ‘లింగా’ వచ్చినా, అది బాగా పాత వాసన వేసి ఫెయిలయ్యింది. అశేష అభిమానులు రజనీని మళ్ళీ పూర్వపు ఇమేజితో, పూర్తి స్థాయి మాస్ కమర్షియల్స్ లో కొత్తగా చూడాలని మొహం వాచి వున్నారు.
ఈ పరిస్థితుల్లో ‘పిజ్జా’, ‘జిగర్తాండా’ లాంటి వ్యూవేవ్ సినిమాలతో వెలుగులో కొచ్చిన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, అభిమానుల లోటు తీర్చదానికి రజనీకాంత్ తో పూర్తి స్థాయి మాస్ మసాలా కమర్షియల్ గా ‘పేట’ తీయాలనుకున్నాడు. ఒక న్యూవేవ్ దర్శకుడు నిజంగా రజనీ అనే మహా వృక్షంతో ఆల్ రౌండర్ తీయగలడా? లేక ‘కబాలీ’ తీసిన రియలిస్టిక్ సినిమాల దర్శకుడు పా. రంజీత్ లాగా అభిమానుల్ని మళ్ళీ దుఃఖ సాగరంలో ముంచేస్తాడా? ఇది తెలుసుకోవడానికి రివ్యూలోకి వెళ్దాం…
కథ
కాళీ(రజనీ కాంత్) ఒక కాలేజీ హాస్టల్లో వార్డెన్ గా వుంటాడు. సరదాగా అక్కడి అరాచక వాతావరణాన్ని సరిదిద్దుతూ వుంటాడు. హాస్టల్ భోజన కంట్రాక్టర్ కి బుద్ధి చెప్తాడు. అల్లరిగా ఒక ప్రేమ జంటని కలిపే ప్రయత్నాలు చేస్తాడు. ఈ అమ్మాయి తల్లి మంగళ (సిమ్రాన్) తో ప్రేమలో పడతాడు. మైకేల్ (బాబీ సింహా) గ్యాంగ్ ని దారిలో పెడతాడు. ఇంతలో తన మీద రెండు సార్లు హత్యాప్రయత్నాలు జరుగుతాయి. అప్పుడు కాళీ, కాళీ కాదని, పేట వీరుడు అనీ నిజం బయట పడుతుంది. ఈ నిజంతో ఎక్కడో ఉత్తర ప్రదేశ్ లో వుండే సింఘార్ సింగ్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) తో తలపడతాడు. ఎవరీ సింఘార్ సింగ్? ఎందుకు పేట వీరని చంపాలనుకుంటున్నాడు? ఇతడి కొడుకు జీతూ (విజయ్ సేతుపతి) తో పేట వీరకున్న సంబంధమేమిటి? ఇదీ మిగతా కథ.
ఎలావుంది కథ
మళ్ళీ ‘బాషా’ లాగా వుంది. న్యూవేవ్ దర్శకుడైనా మళ్ళీ ఇదే చేశాడు – నేటి రజనీతో అదే పాత కథ. ‘బాషా’ నాటి 1990 ల రజనీకాంత్ సినిమాలాగా. ఇది తీయడానికి పాత దర్శకులే వున్నారు. ‘లింగా’ తీసిన పాత కెఎస్ రవికుమార్ పాతగానే తీసి పాతరేశాడు. మళ్ళీ కొత్తగా న్యూవేవ్ సుబ్బరాజ్ వచ్చి ఇదే పని చేయనక్కర్లేదు. పాత రజనీకాంత్ నే కొత్త మాస్ కథా కథనాలతో కొత్తగా చూపగల్గినప్పుడే చెప్పుకోవడానికేమైనా వుంటుంది. తొలిసగం ఏదో కొత్తగా ఎంటర్ టైన్ చేసినా, అసలు కథలోకి వెళ్లేసరికి పురాతన పాయింటుతో ‘80 లనాటి కథలాగా దర్శనమిస్తుంది.
ఇదే మాత్రం యువతరం ప్రేక్షకులకి కనెక్ట్ ఆయ్యే అవకాశం లేకుండా పోయింది. చాలా సీనియర్ స్టార్ గా రజనీ పెద్ద వయసు పాత్ర పోషించినా, తొలిసగంలో ఆయన చుట్టూ స్టూడెంట్ పాత్రలతో వుండే ఫన్, కామెడీ, యూత్ అప్పీల్ మొదలైనవి – ‘మాస్టర్’ లో చిరంజీవి పాత్రలాగా – మలిసగంలో పాతలోకి ప్లేటు ఫిరాయించిన మూస కథ వల్ల మాయమైపోయాయి. ఫలితంగా రజనీ తమిళ ఫ్యాన్స్ కి మాత్రమే నచ్చే రొటీన్ తమిళ మూస కథలాగా ఇది తయారైంది.
ఎవరెలా చేశారు
దశాబ్దం తర్వాత మళ్ళీ పాత రజనీ పాత్రని రజనీయిజంతో చూస్తాం. హాస్టల్ వార్డెన్ పాత్రలో ఆయన పాపులర్ విన్యాసాలన్నీ చూస్తాం. న్యూవ్ వేవ్ దర్శకుడు కాబట్టి రజనీని అతి స్టయిలిష్ గా చూపిస్తూ రజనీ మార్కు గిమ్మిక్కులతో, డైలాగులతో, ఫైట్స్ తో బాగానే ఎంటర్ టైన్ చేశాడు. ‘నేను రాననుకున్నారా?’ అనే ఎంట్రీ డైలాగు దగ్గర్నుంచి – ప్రేమకు కళ్ళు లేవు, మిగతావన్నీ వున్నాయి; నేను మంచి వాడినే, కానీ చాలా మంచి వాణ్ణి కాదు; పోరా యువ సామ్రాట్; బిర్యానీ డీలర్ (ప్రాణిక్ హీలర్ అనబోయి)…లాంటి ఎన్నో డైలాగులు తెగ నవ్విస్తాయి.
సిమ్రాన్ తో లిమిటెడ్ రోమాన్స్ కూడా నవ్విస్తుంది. ఇదంతా ఫస్టాఫ్ వరకే. సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ దగ్గర్నుంచీ మూసగా మారిపోతాయి పాత్ర తీరుతెన్నులు. ఫ్లాష్ బ్యాక్ లో పెద్ద మనిషి తరహా వేషం, ఫ్లాష్ బ్యాక్ తర్వాత విలన్ తో రొటీన్ రివెంజి డ్రామా. ఇక్కడే వ్యూవేవ్ దర్శకుడు చాదస్తపు దర్శకుడిగా తేలిపోతూ రజనీని తేల్చేశాడు. తను న్యూవేవ్ దర్శకుడే గానీ, రజనీ లాంటి సూపర్ ర్ స్టార్ ని హేండిల్ చేయగల్గేంత బిగ్ కమర్షియల్ దర్శకుడు కాడని తెలియజేసుకున్నాడు.
రజనీ తప్ప చెప్పుకోవడానికి పాత్రలే లేవు, విలన్ పాత్ర తప్ప. నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్ పాత్రలో కనిపిస్తాడు. ఈ పాత మూస ఫార్ములా పాత్రని అతనెందుకు అంగీకరించాడో అర్ధంగాదు. అలాగే విజయ్ సేతుపతి పాత్ర నామ మాత్రమే. ఇక ఫస్టాఫ్ లో కొద్ది సేపు సిమ్రాన్, సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో కొద్ది సేపు త్రిష కన్పించి వెళ్లిపోతారు. కమెడియన్ లెవరూ లేరు.
మ్యూజికల్ గా రజనీ మీద పాటలు బావున్నాయి. ఫస్టాఫ్ లో స్టూడెంట్స్ తో ఆయన స్టయిలిష్ డాన్స్ సూపర్. దృశ్యాల చిత్రీకరణ మళ్ళీ సుబ్బరాజ్ మార్కు చిక్కటి ఎరుపు రంగుల్లో ఏదో మర్డర్ మిస్టరీ అన్నట్టుగా వుంది. ఈ మాస్ కథకి ఈ చిత్రీకరణ ఎబ్బెట్టుగా వుంది. ఇంకా తన తొలి హిట్ హార్రర్ ‘పిజ్జా’ చిత్రీకరణ స్టయిల్ ని మర్చిపోలేకపోతున్నాడేమో సుబ్బరాజ్.
చివరికేమిటి
ఫస్టాఫ్ రజనీ – సెకండాఫ్ ఇనుప రజను. సుబ్బరాజ్ నూరుకుంటూ కూర్చున్నాడు. రజనీ లాంటి సూపర్ స్టార్ తో మెగా మూవీ తీస్తున్నప్పుడు తెలుగులో కూడా విడుదల చేస్తారని దృష్టిలో పెట్టుకోవాలి తమిళ దర్శకులు. ‘పేట’ ని తెలుగుతో బాటు హిందీలో కూడా రిలీజ్ చేశారు. తమిళంలో ఇలా తీసి ఇతర భాషీయుల మీద రుద్దితే చచ్చూరుకుంటారు వాళ్ళు. ఫస్టాఫ్ వరకూ జాతీయంగా తీసి, సెకండాఫ్ తమిళ ప్రాంతీయంగా తీయడం అదేం వ్యాపార తెలివో అర్ధంగాదు. కాళీ ‘పేట వీర’ గా తెలిసే ఫ్లాష్ బ్యాక్ అయినా బలంగా వుండాలి. ఇందులో హిందూ ముస్లిం పెళ్లి గొడవ, ప్రతీకారాలు జాతీయ కథగా సూపర్ గా వుంటాయనుకుని, తమిళ సాంబారు చేసి వదిలారు. హాస్టల్ మెస్ మాస్టర్ ని రజనీ కాంత్ రాయిలాంటి ఇడ్లీ పెట్టి కొడితే, తల గిర గిరా తిరిగి కింద పడతాడు మెస్ మాస్టర్. దీన్ని తెలుగు ప్రేక్షకులు తమ మీద ప్రయోగించిన సింబాలిజంగా తీసుకోవాలి.
నటీనటులు: రజనీకాంత్, సిమ్రన్, త్రిష, విజయ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహా, యోగిబాబు తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫీ: తిరు
ఎడిటింగ్: వివేక్ హర్షన్
నిర్మాత: కళానిధి మారన్, అశోక్ వల్లభనేని
దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజు
సంస్థ: సన్ పిక్చర్స్
విడుదల: 10-01-2019