(చిత్రం : ఆపరేషన్ వాలెంటైన్, విడుదల : 29-02-2024, రేటింగ్ : 2.5/5, నటినటులు:వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్, నవదీప్, మిర్ సావర్ తదితరులు. దర్శకత్వం:శక్తి ప్రతాప్ సింగ్ హడా, నిర్మాత:సందీప్ ముద్దా, సోనీ పిక్చర్స్, సంగీతం:మిక్కీ జే మేయర్, సినిమాటోగ్రఫీ:హరి కె. వేదాంతం)
సరైనవిజయం కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొంతకాలంగా ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. అయితే తన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ పై మాత్రం భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆరాటపడ్డాడు. ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన విషయం తెలిసిందే. సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి.. ఈ సినిమా ఎలా ఉంది? వరుణ్ తేజ్ అనుకున్నట్లు సక్సెస్ ట్రాక్ ఎక్కడా? ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం ప్రేక్షకులను అలరించిందా? తెలుసుకుందాం…
కథ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్ అర్జున్ ( వరుణ్ తేజ్). దేశ రక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయర్ క్రాఫ్ట్స్ ని టెస్ట్ చేయడం అర్జున్ పని. 2021 ఫిబ్రవరి 14న డి.ఆర్.డీ.ఓ నుండి వచ్చిన ఒక కొత్త ఎయిర్ క్రాఫ్ట్ ను టెస్ట్ చేసి.. బేస్ క్యాంప్ కి రిటర్న్ అవుతుండగా.. అర్జున్ ని పాకిస్థాన్ జెట్స్ టార్గెట్ చేస్తాయి. అయితే.. అది ఒక ట్రాప్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ జెట్స్ పై దృష్టి పెట్టి ఉన్న సమయంలో కింద భూమిపై పుల్వామా దాడి జరుగుతుంది. ఇండియా 40 మందికి పైగా సైనికులను కోల్పోతుంది. అక్కడ నుండి దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి? వింగ్ కమాండర్ అర్జున్ పడ్డ కష్టం ఏమిటి? ఈ మొత్తం యుద్ధంలో అర్జున్ ఆశయం అయిన.. ఆపరేషన్ వజ్ర ఎలా సహాయ పడుతుంది? అతని భార్య అయిన మరో కమాండర్ అహ్న ( మానుషి చిల్లర్) రోల్ ఏమిటి? అన్నదే ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా కథ.
విశ్లేషణ: ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మొదలైన అరగంట వరకు ఆపరేషన్ వజ్రని రీ కాల్ చేసుకుంటూ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ పడుతూ ఉంటాయి. దీంతో.. కథలో ఆ సీక్వెన్స్ ఎక్కువ ప్లే ఉంటుందని అంతా ఆశిస్తారు. కానీ.. అసలు ఆ సీక్వెన్స్ అంతా అండర్ ప్లేలో చూపిస్తూ.. హీరో బిల్డప్ షాట్స్ గా ఉపయోగించుకున్నారు. ఇక చాలా సేపటికి పుల్వామా ఉగ్రదాడి జరగడం, దానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతీకారానికి సిద్దం అవ్వడంతో ఫస్ట్ ఆఫ్ కాస్త ఎంగేజింగ్ గా అనిపిస్తూ ముగుస్తుంది. పుల్వామా ఉగ్రదాడి దేశ చరిత్రలో ఎవ్వరూ మరచిపోలేరు. ఆ ఘటన తరువాత భారత్ తీర్చుకున్న రివేంజ్ కూడా ఒక చరిత్ర. ఇలాంటి అంశాన్ని కథా వస్తువుగా తీసుకుని చాలానే సినిమాలు వచ్చాయి. ఈ జనరేషన్ కళ్ళ ముందు జరిగిన ఒక విధ్వంసం కాబట్టి.. ప్రేక్షకులు ఈ పాయింట్ కి త్వరగా కనెక్ట్ అవుతారు కూడా. విక్కీ కౌశల్ ఉరి ఇందులో మాస్టర్ పీస్ మూవీ. అయితే.. ఆపరేషన్ వాలెంటైన్ మూవీలో కూడా ఈ మ్యాజిక్ రిపీట్ అయ్యిందా అంటే లేదనే చెప్పుకోవాలి. ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీని పూర్తిగా దేశభక్తి ప్రధానంగానే ప్రమోట్ చేశారు. పుల్వామా ఉగ్రదాడి, దాని ప్రతీకారం చుట్టూ జరిగే కథ అనే చెప్పారు. కానీ.., సినిమాలో ఆ మొత్తం ఎపిసోడ్ కి దక్కిన స్పేస్ చాలా తక్కువ. హీరో ఎలివేషన్ కోసం సగం సినిమా పైగా నడిపించేశారు. దీంతో.. కొన్ని అద్భుతమైన సీక్వెన్స్ లు ఉన్నా.. ‘ఆపరేషన్ వాలెంటైన్’ సక్సెస్ కాలేక పోయింది. సెకండాఫ్ మొదలైన కొద్దిసేపటికే నిమిషాల్లో కథలోని మెయిన్ పాయింట్ అయిపోతుంది. ఇక ఆపరేషన్ వాలెంటైన్ కథ ఏముంది? అనగా ఓ ఫిక్షనల్ పాయింట్ ఈ కథకి అటాచ్ చేసి.. హీరో క్యారెక్టర్ కి ఎలివేషన్ ఇస్తూ పోయారు. అప్పటి వరకు కొంత ఆకట్టుకుంటూ నడిచిన ఆపరేషన్ వాలెంటైన్ ఇక్కడ నుండి టోటల్ గా ఎమోషన్ మిస్ అయిపోయి.. ఒకానొక స్టేజ్ కి వీడియో గేమ్ అయిపొయింది. అయితే.. లాస్ట్ లో వింగ్ కమాండర్ అభినందన్ రిఫరెన్స్ ఇండైరెక్ట్ గా చూపించడం కాస్త కొస మెరుపు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే.. సినిమా ప్రథమార్థంలో వరుణ్ తేజ్ నటన, పల్వామా ఎపిసోడ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే.. ద్వితీయార్ధంకొచ్చే సరికి సినిమాలో ఎమోషన్ మిస్ అయింది. ఫలితంగా ప్రేక్షకులకు నిరాశే కలుగుతుంది.
ఎవరెలా చేశారంటే…. వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ కోసం తన బెస్ట్ ఇచ్చేశాడు. హీరోయిన్ మానుషి చిల్లర నటనలో అదరగొట్టింది. మిగతా నటులు ఎవ్వరికీ అంతగా స్క్రీన్ స్పేస్ దొరకలేదు.
టెక్నికల్ విషయాలకొస్తే… ఆపరేషన్ వాలెంటైన్ సినిమా చాలా స్ట్రాంగ్ మూవీ. కెమెరా వర్క్ తో పాటు.. సీజి వర్క్ అదిరిపోయింది. కాకుంటే సెకండ్ ఆఫ్ పై ఇంకాస్త దృష్టి పెట్టుంటే బాగుండేది. మ్యూజిక్ కు ప్రాధాన్యత లేదు. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. టెక్నీషియన్ గా మాత్రం దర్శకుడు శక్తి ప్రతాప్ కి మంచి మార్కులు వేయొచ్చు.