Family Star Movie Review: “ది ఫ్యామిలీ స్టార్” మూవీ రివ్యూ….

(చిత్రం : ఫ్యామిలీ స్టార్, విడుదల తేదీ : 5, ఏప్రిల్ 2024, రేటింగ్ : 2.75/5, నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, జగపతిబాబు, వెన్నెల కిషోర్, అభినయ, ప్రభాస్ శ్రీను తదితరులు , దర్శకత్వం : పరశురాం పెట్ల, నిర్మాత: దిల్ రాజు, సంగీత దర్శకులు: గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ : కే యూ మోహనన్, ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్)

యువతలో సూపర్ క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. అతడి యాటిట్యూడ్, మేనరిజమ్స్ యువతకి బాగా నచ్చుతాయి. అందుకే తక్కువ సమయంలోనే విజయ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇప్పటి యువతలో ఉన్న ఆలోచనలకు తగ్గట్లుగా ప్రతి చిత్రంలో అతడి పెర్ఫామెన్స్ ఉంటోంది. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ‘గీతా గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్, పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కావడంతో అంచనాలు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. ఈ మూవీలో విజయ్ కి జోడిగా మృణాల్ ఠాకూర్ నటించింది.ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అండ్ ట్రైలర్.. ఇలా ప్రతిదీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. నేడు ఏప్రిల్ 5న ఈ చిత్రం గ్రాండ్ విడుదలయింది. ట్రైలర్, సాంగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. దీనితో మరో ‘గీతా గోవిందం’ లాంటి సూపర్ హిట్ లోడింగ్ అంటూ అంచనాలు వినిపించాయి. ‘గీతగోవిందం’ బజ్ తో నేడు థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం ఈ వేసవి కానుకగా కుటుంబ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చింది. ఫ్యామిలీ, మాస్‌ యాక్షన్‌ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం విజయ్‌ దేవరకొండ కు ఖచ్చితమైన హిట్ ఇవ్వాల్సిన టైమ్ లో వచ్చింది. అయితే ఎంతవరకూ అతని అవసరాన్ని తీర్చి నమ్మకాన్ని నిలబెట్టింది? దిల్ రాజు బ్యానర్ అంటే ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ కాబట్టి ఆ ట్రెడిషన్ ని కొనసాగిస్తున్న రీతిలో ఈ ఫిల్మ్ ని రూపొందించారు. అయితే క్రైమ్ థ్రిల్లర్స్ ఓటిటిలకు షిప్ట్ అయ్యినట్లుగా ఫ్యామిలీ కథలు టీవీ సీరియల్స్ వెళ్లిపోయాయి. అలాంటప్పుడు అంతకు మించి ఉంటేనే తెరపై ఫ్యామిలీ స్టోరీలను ఆదరిస్తారు. ఓ రకంగా రిస్కే అయ్యినా విజయ్ దేవరకొండ దాన్ని ధైర్యంగా స్వీకరించి చేసారు. విజయ్ చాలా హోప్స్ పెట్టుకున్న ఈ చిత్రం ఆయన్ని ఫ్లాఫ్ ల నుంచి బయిటపడేసిందా? ఫ్యామిలీ స్టార్ గా మనందరినీ మెప్పించాడా..మరి ఈ చిత్రం అంచనాలు అందుకుందో లేదో చూద్దాం …

కథ : మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక సాధారణ యువకుడు గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) ఒక ఆర్కిటెక్ట్ ఇంజినీర్. చిన్నపాటి ఉద్యోగంతో తన కుటుంబ బండిని అదుపు పొదుపులతో పేరుకు తగ్గట్టుగానే ఆ బరువు భాద్యత లను మోస్తాడు. మిడిల్ క్లాస్ కుర్రాడు ‘గోవర్ధన్’ కి ఫ్యామిలీ అంటే ప్రాణం. ఆర్కిటెక్ట్ అయిన అతను ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తూ కుటుంబ బాధ్యతలు అన్నీ తన భుజాల మీదే మోస్తూ ఉంటాడు. ఇంట్లో తనే ఆర్దిక ఆధారం. ఓ ప్రక్కన తాగుడుకు బానిసైన ఒక అన్న(రవి ప్రకాష్) మరో ప్రక్క ఎప్పుడూ ఏదో బిజినెస్ పెట్టుబడి అంటూ తిరిగే మరో అన్న (రాజా చెంబోలు) కు ఆదాయాలు లేకపోవటంతో వాళ్ల ఫ్యామిలీలను తనే సాకాల్సిన పరిస్దితి. ఇలా తను,తన కుటుంబం, ఉద్యోగం అంటూ వెళ్తున్న గోవర్ధన్ జీవితంలోకి తన ఇంటి మీదకి అద్దెకి ఉండేందుకు ఓ అమ్మాయి ఇందు (మృణాల్ ఠాకూర్) వచ్చాక తన లైఫ్ ఎలా టర్న్ అవుతుంది? అసలు ఆమె తన జీవితం లోకి ఎందుకు వచ్చింది ఈ నేపథ్యంలో కి ఎదురైన సవాళ్లు ఏంటి? వాళ్ళు కలుస్తారా లేదా? అసలు ఇందు ఎవరు? చివరికి ఈ ‘ఫ్యామిలీ స్టార్’ ఏం చేస్తాడు అనేది వెండితెరపై చూడాల్సిందే…

విశ్లేషణ: దర్శకుడు పరశురాం పెట్ల కెరీర్ లో ఈ చిత్రం వీక్ వర్క్ అని చెప్పక తప్పదు. విజయ్ పాత్రని ప్రతి మధ్య తరగతి కుటుంబంలో ఇలాంటి వాడు ఒకడు ఉండాలి అనేలా ప్లాన్ చేసుకున్నారు కానీ.. దానిని ఆవిష్కరించడంలో డిజప్పాయింట్ చేశారు. ప్రధానంగా తన నుంచి వచ్చే వినోదం, ఎమోషనల్ నరేషన్ ఈ చిత్రంలో బాగా మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది. అక్కడ పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ మీద డిపెంట్ అయ్యారు కానీ అవి చాలా సార్లు చూసేసినవే కావటంతో డేజావులా ఇంతకు ముందే చూసిసినట్లు అనిపిస్తూంటాయి. కామెడీ కూడా గీతా గోవిదం తరహాలో వర్కవుట్ కాలేదు. అక్కడక్కడా కొన్ని మెరుపులు మెరిసినా ప్లాట్ స్ట్రాంగ్ గా లేకపోవటంతో తేలిపోయాయి. ఈ చిత్రంలో మెప్పించే అంశాలు కంటే నొప్పించే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. సింపుల్ కాన్సెప్ట్ అయినప్పటికీ సినిమాలో ఆకట్టుకునే కథనం ఒక ఫ్లో మిస్ అయ్యింది. ఆల్రెడీ ఈ తరహా సీన్స్ చూసేసాం అన్నట్టే ఉండే సన్నివేశాలు సాగదీతగా సాగే కథనం మొదటి సగం మలిసగంలో కూడా ఆడియెన్స్ సహనానికి పరీక్ష పెడతాయి. అసలు సినిమా మెయిన్ అంశం లోకి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. పోనీ అంతవరకు కథనం ఏమన్నా ఆసక్తిగా ఉందా అంటే అదీ కనిపించదు. సరైన ఎంటర్టైన్మెంట్ లేదు .. భావోద్వేగ పరిచే ఎమోషన్స్ ఉన్నాయా అంటే అవి కూడా లేవు. ఈ లోపం సినిమా మొదలు నుంచి చివరి వరకు కనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా మృణాల్ పాత్ర విజయ్ ని కలవడం వారిద్దరి సీన్స్ లో పొంతన కనిపించదు. అలాగే విజయ్ పై కొన్ని సన్నివేశాలు అతిగా అనిపిస్తాయి. ఇంకా వాసుకి, అభినయ లాంటి నటులకు పెద్ద ఇంపార్టెన్స్ కనిపించదు. విజయ్, పరశురాం నుంచి గీతా గోవిందం లాంటి సాలిడ్ ఎంటర్టైనర్ చూసి ఈ సినిమా విషయంలో అంచనాలు పెట్టుకొని చూసేవారు డిజప్పాయింట్ అవ్వొచ్చు. సినిమా అంతా బోర్ గానే సాగుతుంది. సినిమా హిట్ అవ్వాలంటే కథే బాగుండాలా ఏంటి? అనుకుని చేసినట్లున్న ఈ సినిమా కథాంశం తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీ స్టార్ అని చెప్పడమే . అయితే దాన్ని ఎంత స్మూత్ గా, ఎంత అందంగా చెప్పారనేదానిపై సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. పరుశురామ్ దర్శకుడుగా అద్బుతం తీయకపోవచ్చు కానీ డిజప్పాయింట్ చేయరనిపిస్తారు. అయితే ఈ సినిమాకు ఎంచుకున్న కథ ఆయనకు కలిసి రాలేదు. గీతాగోవిందం టెంప్లేట్ ని రిపీట్ చేద్దామని ప్రయత్నించారు. అయితే అంత ఈజీ టాస్క్ కాదు. హీరోను, నిర్మాతను ఈ ఫార్మెట్ తో ఒప్పించవచ్చు కానీ ప్రేక్షకుడుని ఒప్పించి మెప్పించటం చాలా కష్టం. అయినా ఒకసారి జరిగిన మ్యాజిక్ మరోసారి జరుగుతుందని ఆశించటం అత్యాశే. తనమీద తనకే కాన్ఫిడెన్స్ తగ్గించే అనిపించేలా అమెరికాలో వచ్చే సీన్స్ ఉంటాయి. “ది ఫ్యామిలీ స్టార్” లో మెయిన్ లీడ్ పర్వాలేదనిపిస్తారు. అలాగే కొన్ని సీన్స్ కేవలం ఓకే అనిపిస్తాయి కానీ విజయ్, పరశురాం పెట్ల హిట్ కాంబినేషన్ నుంచి అంచనాలు అందుకునే రేంజ్ సినిమా అయితే ఇది కాదు. ఎమోషన్స్ వర్కవుట్ కాలేదు, కథనం నిరాశపరుస్తుంది. దర్శకుడు ఇంకా కథ, కథనాలు పై వర్క్ చేయాల్సింది. ఫస్ట్ హాఫ్ సెటప్ సాగినట్లున్నా, కొన్ని ఫన్నీ డైలాగులుతో నడిచిపోయింది. సెకండాఫ్ లో అదరకొట్టేస్తారు..అసలు విషయం అక్కడుందనుకుంటాము. కానీ ఇంట్రవెల్ అయ్యిన కాసేపటకే అంత సీన్ లేదని డైరక్టర్ మనని వెక్కరిస్తారు. స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా రాసుకుంటే బాగుండేది. కానీ స్క్రీన్ ప్లే చాలా బద్దకంగా కునుకు తీస్తూ నడుస్తున్నట్లు ఉంటుంది. కథను నడపటానికి ఎంచుకున్న బ్రదర్, హీరోయిన్ రెండు కాంప్లిక్ట్స్ లు బలంగా లేవు. రొటీన్ ఫ్యామిలీ కథలలో స్టార్స్ నటించినా అంతంత మాత్రమే ఇంపాక్ట్ ఇస్తుందని మరోసారి రుజువైంది. ఫ్యామిలీలను టార్గెట్ చేసినట్లున్న ఈ సినిమా యూత్ కు ఏ మేరకు ఎక్కుతుందనే దానిపై సక్సెస్ రేటు ఆధారపడి ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా ఫన్ సీన్స్ తో మొదలవుతుంది. కానీ వెంటనే ఏమాత్రం ఆసక్తికరంగా లేని సన్నివేశాలు రిపీట్ అయ్యాయి. మ్యూజిక్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. గీతా గోవిందం కాంబినేషన్ ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయింది. దర్శకుడు పరశురామ్ అసలేం చెప్పదలుచుకున్నాడో పూర్తిగా కన్ఫ్యూజ్ అయ్యారు.

ఎవరెలా చేశారంటే… హీరో విజయ్ దేవరకొండ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ గా ఈ సినిమాలో కనిపిస్తాడు. తన టైమింగ్ తన ఫ్యామిలీతో సాగే కొన్ని సన్నివేశాలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి టచ్ అవ్వొచ్చు. అలాగే తన పాత్రలో వేరియేషన్స్ ని కూడా అతడు బాగా పండించాడు. అలాగే తనపై కొన్ని మాస్ మూమెంట్స్ ఫ్యాన్స్ కి నచ్చవచ్చు. విజయ్ దేవరకొండకు ఇది కీలకసమయం. ఇలాంటి కంపర్ట్ జోన్ కథలు సీనియర్ హీరోలకు వదిలేయాలి. అలాగే పెద్దగా ఇంపార్ట్ కలగచేయని ఇలాంటి టెంప్లేట్ కథలకు స్వస్ది చెప్పాలి. లేకపోతే ఎంత బాగా చేసినా సీన్స్, కథ సహకరించక సక్సెస్ దూరంగా నిలబడి దోబూచులాడుతుంది. ఇలాంటి సినిమాలు బాగున్నాయి అని చెప్పలేం. భలే ఉంది వెంటనే చూడాలి అని చెప్పలేని పరిస్దితి క్రియేట్ చేస్తాయి. అయితే అదే సమయంలో ఒక విషయం చెప్పాలి..మిడిల్ క్లాస్ కుర్రాడుగా ఫెరఫెక్ట్ గా యాప్ట్ అయ్యారు. విజయ్ దేవరకొండ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావలసిన టైం ఇది. అతడి మ్యానరిజమ్స్ రిపిటీటివ్ గా అనిపిస్తున్నాయి. విజయ్ ఇకనైనా మంచి స్క్రిప్ట్స్ ఎంచుకోవాలి. ఇక హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన పాత్రలో డీసెంట్ పెర్ఫామెన్స్ తో మెప్పిస్తుంది. ఇద్దరి నడుమ కెమిస్ట్రీ బాగుంది. అలాగే ఆమె తన డీసెంట్ లుక్స్ నేచురల్ పెర్ఫామెన్స్ బాగున్నాయి. మృణాలి ఠాకూర్.. చూడ్డానికి బాగుంది. అయితే క్యారక్టరైజేషన్ అంతగొప్పగా లేదు.ఇంకా వీరితో సీనియర్ యాక్టర్ జగపతిబాబు రొటీన్ పాత్రలో అలా కనిపించి ఇలావెళ్లిపోయారు. వెన్నెల కిషోర్ కమిడియన్ గా కాసేపు నవ్వించారు. బామ్మ పాత్రలో మరాఠీ రోహిణి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత మరోసారి కనిపించి ఆకట్టుకుంది.

సాంకేతిక వర్గం : ఈ చిత్రంలో గోపీసుందర్ మ్యూజిక్ మేజిక్ చెయ్యలేదు. ‘గీతా గోవిందం’ చిత్రానికి పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యాయి. ఈ చిత్రానికి అంతగా కుదరలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాలో అవసరానికి తగ్గట్టుగా దిల్ రాజు ఖర్చు పెట్టారు. కే యూ మోహనన్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. అలాగే మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ ఫర్వాలేదు.బీజీఎమ్ అసలు ఏం బాగోలేదు సాంగ్స్ ఓకే అనిపించినా డాన్స్ నాట్ ఓకే . విజయ్ అండ్ మృణాల్ కెమిస్ట్రీ మాత్రం ఓకే.

రేటింగ్ : 2.75/5