హార్రర్ కాదు, థర్డ్ డిగ్రీ టార్చర్! ‘బొట్టు’ (మూవీ రివ్యూ)

హార్రర్ కాదు థర్డ్ డిగ్రీ టార్చర్! 
‘బొట్టు’ 
రచన – దర్శకత్వం : విసి వడివుదయన్ 
తారాగణం : భరత్, సృష్టీ డాంగే, నమిత, సాయాజీ షిండే, షకీలా తదితరులు 
సంగీతం : అమ్రేష్ గణేష్, ఛాయాగ్రహణం : ఎన్నియన్ 
నిర్మాత : జి. కుమార్ బాబు 
విడుదల : మార్చి 8, 2019 
1.5 / 5

 తమిళ హార్రర్ ‘పొట్టు’ తెలుగులో ‘బొట్టు’ గా విడుదలైంది. 2016 లో ‘షావుకార్ పెట్టై’ అనే ప్రతీకారపు హార్రర్ తీసిన దర్శకుడు వడివుదయన్, మళ్ళీ  ప్రతీకారపు హార్రరే తీశాడు. కొల్లిమలై లో అన్యాయానికి బలైన గిరిజన యువతి ఆత్మ పగదీర్చుకునే కథ ఇది. నగరంలో మెడికల్ కాలేజీలో చంపేస్తూంటుంది. మెడిసిన్ స్టూడెంట్ అయిన అర్జున్ భరత్ ఇంకో స్టూడెంట్ అంజలి (సృష్టీ డాంగే) ని ప్రేమిస్తూంటాడు. ఇంటిదగ్గర తల్లిదండ్రులుంటారు. ఒకరోజు ఉన్నట్టుండి అతను మారిపోతాడు. గిరిజన యువతి ఆత్మ అతణ్ణి ఆవహిస్తుంది. బీభత్సం సృష్టిస్తూంటాడు. కాలేజీ యాజమాన్యం తట్టుకోలేక పరమేశ్వరి అనే మంత్రగత్తెని ఆశ్రయిస్తుంది. శ్మశానం మీద కాలేజీ కట్ట వద్దంటే ఎందుకు కట్టారని ఆమె సీరియస్ అవుతుంది. అయినా ఆ దురాత్మని నిర్వీర్యం చేశాక మళ్ళీ ఎలా వచ్చిందని మంత్ర శక్తిని ప్రయోగిస్తుంది. ఆ మంత్ర శక్తితో కాలేజీ చుట్టూ రక్షణ వలయం ఏర్పడి అర్జున్ రూపంలో వున్న దురాత్మ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇక దురాత్మకీ మంత్రగత్తెకీ పోరాటం మొదలవుతుంది. ఎవరీ దురాత్మగా మారిన గిరిజిన యువతి? ఆమెకి జరిగిన అన్యాయమేమిటి? ఆమెని చంపిందెవరు? ఆమె కెలా శాంతి జరిగింది?….మొదలైనవి  తలెత్తే ప్రశ్నలు.

 ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలంటే మామూలు టార్చర్ కాదు, థర్డ్ డిగ్రీ టార్చర్ ని భరించడానికి మనస్ఫూర్తిగా ఇష్ట పడాలి. ఫస్టాఫ్ పూర్తయ్యేసరికే టార్చర్ని  భరించే  ఓపిక వుండదు. ఈ హార్రర్ లో భయపెట్టే హార్రర్ ఏమీ వుండదు. నాన్ స్టాప్ అరుపులతో, హింసతో, మొరటు యాక్షన్ తో, నాటు మ్యూజిక్ తో రాక్షస క్రీడలా వుంటుంది. కథ, పాత్రలు, కథనం ఏమీ కన్పించవు. సినిమా పేరుతో దర్శకుడి రాక్షసత్వంలా వుంటుంది. ఇతనేం దర్శకుడో, ఎందుకిలా ప్రతీకారం తీర్చుకుంటున్నాడో అర్ధంగాదు. హిందీలో అప్పట్లో హార్రర్ మాస్టర్స్ రామ్సే బ్రదర్స్ తీసిన ‘హోటల్’ కూడా శ్మశానం కథే. ఆ శ్మశానం మీద హోటల్ కట్టిన కథలో హార్రర్ కి థియేటర్ లోంచి పారిపోవడమే. ఈ తమిళ హార్రర్ లో టార్చర్ కి పారిపోవాలి. 

దురాత్మ భరత్ ని ఆవహించింది చాలక ఆడదానిలా మారిపోవడం ఒకటి. ఇక ఆడ భరత్ ని భరించే టార్చర్ బోనస్ గా మనకి లభిస్తుంది. ఇక నమిత మంత్రగత్తె తనం ముందు అమ్రిష్ పురి కూడా పనికిరాడు. జీన్స్ లో రీమిక్స్ మంత్రగత్తెకి నోటికొచ్చిన మంత్రాలు, కళ్ళెర్ర జేసి ఓవరాక్షన్ శాపతాపాలు.          

ఒకప్పటి బి, సి గ్రేడ్ హార్రర్ లు కూడా ఇంత దారుణంగా లేవు. హార్రర్ అనే పదానికే అర్ధాన్ని మార్చేసిన ఈ టార్చర్ లో టెక్నాలజీని కూడా వాడుకోవడం చేతగాలేదు. వాటిని గ్రాఫిక్స్ అంటారో ఇంకేమంటారో దర్శకుడికే తెలియాలి. కాశ్మీర్లో దీన్ని విడుదల చేసి,  టెర్రరిస్టుల్ని పడేసి తాళం వేసేస్తే వాళ్ళ సంగతి ఈ థర్డ్ డిగ్రీ టార్చరే చూసుకుంటుంది.          

―సికిందర్