బయోపిక్స్ పిచ్చి పీక్ కెళ్ళింది. ఇక రూటు మార్చుకోవడమే కరెక్ట్ అనుకుంటున్నారు. గత కొంత కాలంగా బాలీవుడ్ బయోపిక్స్ తీయడాన్ని జొత్త ట్రెండ్ గా, ఓ భారీ వ్యాపారంగా మార్చుకుంది. నటీనటులు, రాజకీయ నేతలు, క్రీడా కారులు, చారిత్రక పురుషులు… ఇలా పాజిటివ్ వ్యక్తులపై బయోపిక్స్ తీస్తూ వచ్చింది. ఇలా అదేపనిగా బయోపిక్స్ తీసి ప్రేక్షకుల మీద పడేస్తూంటే, బయోపిక్స్ తో ఎవరెవరివో జీవిత పాఠాలు నేర్పుతున్నారని ప్రేక్షకులకీ విసుగొచ్చేసింది.
ఈ ప్రమాదాన్ని పసిగట్టారేమో, ఇలాకాదని నెగెటివ్ బయోపిక్ కి నడుం కట్టారు. అదే పనిగా పాజిటివ్ చరిత్రలు చూపిస్తూ ప్రేక్షకులకి ఇంకా బోరు కొట్టించడం కంటే, నెగెటివ్ చరిత్ర చూపిస్తే డిఫరెంట్ ఫీల్ వచ్చి, మళ్ళీ బయోపిక్స్ కి కొత్త వూపు వస్తుందనుకున్నట్టుంది- ఏకంగా సంచలన రేపుల బాబా ఆశారాం బాపూ మీద బయోపిక్ తీసి పడేస్తున్నారు!
ఉషినార్ మజుందార్ అనే రచయిత ‘గాడ్ ఆఫ్ సిన్ : డౌన్ ఫాల్ ఆఫ్ ఆశారాం బాపు’ అనే నవల రాశాడు. దీన్ని అగ్రనిర్మాత సునీల్ బొహ్రా బయోపిక్ గా తీసేందుకు హక్కులు కొనేశాడు.
నేరగాణ్ణి గ్లామరైజ్ చేస్తున్నాడన్న మాట రాకుండా, ఈ బయోపిక్ ఆశారాం మీద కాక ఆశారాంకి వ్యతిరేకంగా పనిచేసి బాధితురాళ్ళకి న్యాయం జరిగేలా చూసిన ఒక లాయర్, ఇద్దరు లేడీ పోలీసాఫీసర్ల విజయం మీద ఫోకస్ చేస్తున్నట్టు చెప్పాడు నిర్మాత బొహ్రా. ఇందులో ఎవరెవరు నటిస్తారనేది త్వరలో తెలియజేస్తానన్నాడు. ఈ బయోపిక్ కి అంతర్జాతీయ గుర్తింపు రావాలని కోరుకుంటున్నట్టు చెప్పాదా.
అటు నరేంద్ర మోడీ బయోపిక్, లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ ఎన్నికల కోడ్ గుప్పిట ఇరుక్కుని విలవిల్లాడుతున్నాయి. ఈ రెండూ బ్యాలెన్స్ వుండగా ఆశారాం బాపూ రాబోతున్నాడు. 2013 లో రేపుల కేసులో అరెస్టయి 2018 లో జీవిత ఖైదు పడ్డ ఆశారాం కథ – ఇంతవరకూ వచ్చిన సాత్విక బయోపిక్స్ కంటే మసాలా బయోపిక్ గా ఇదే ఎక్కువ హిట్ అవుతుందనేది వాస్తవం. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నేరాల మీద తీసిన బయోపిక్ ‘సంజు’ ఆరువందల కోట్లు వసూలు చేసిన ఎగ్జాంపుల్ వుండనే వుంది. ఏ శాఖాహార బయోపిక్ కూడా ఇంత వసూలు చేయ లేదు. వందకోట్లకి చేరడమే గగనమైంది.
ఇలావుండగా, మా నాన్న పోతే నేను లేనా అన్నట్టు రేప్ చేసిన ఆశారాం కొడుకు నారాయణ్ సాయికి మొన్న ఏప్రెల్ ఇరవై ఆరునే జీవిత ఖైదు పడింది. ఆశారాం బయోపిక్ లో ఇది కూడా తోడైతే డబుల్ మసాలా అవుతుంది. ఇంకో పెద్ద మసాలా మాస్టర్ వున్నాడు – డేరా బాబా! గుర్మీత్ రాంరహీం సింగ్ జీ ఇన్సాన్. ఇతను కూడా రేప్ కేసులో ఇరవై ఏళ్ళు శిక్ష పడి కటకటాల వెనుక సేద దీరుతున్నాడు. ఇంకా హత్య కేసులు కూడా వున్నాయి. కానీ ఇతను ఆల్రెడీ సూపార్ స్టార్ గా ఐదు యాక్షన్ సినిమాలు తీసేశాడు. బయోపిక్ కి ఇంకా ఎవరి దృష్టీ పడలేదు.
ఇక ఇటు టాలీవుడ్ కి తాజా బయోపిక్ దొరికింది. ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న హఫీజ్ పూర్ సీరియల్ రేపిస్టు కిల్లర్ శ్రీనివాస రెడ్డి బయోపిక్ తీస్తే ఎలా వుంటుంది? – అన్న ఎంక్వైరీలు చేస్తున్నారు. ఇలా మసాలా బయోపిక్స్ తో మంచి మెసేజిలివ్వచ్చు.
కలెక్షన్లు కూడా వస్తాయి. కానీ ఈ సందర్భంగా ఒక ఐడియా ఏమిటంటే, ఇలా నేరస్థులు దొరికాక వాళ్ళ గురించి తెలుసుకుని బయోపిక్స్ తీసేకంటే, అంతు చిక్కని నేరాలు జరిగినప్పుడే వాటి మీద ఇన్వెస్టిగేటివ్ కథనాలు చేసి తీస్తే, శ్రీనివాసరెడ్డి లాంటి క్రిమినల్స్ ని పోలీసులు పట్టుకునేందుకు క్లూస్ ఇచ్చినట్టవుతుంది. అప్పుడు ‘ముందస్తు బయోపిక్’ గా మంచి పేరొస్తుంది.
―సికిందర్