‘అమిగోస్’ చిత్రం ఎలా ఉందంటే.. ?

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరచుకున్నాడు. మంచి కథలు.. ముఖ్యంగా నవతరం మెచ్చే కథలు.. వైవిధ్యమైన కథలు.. మాస్ ని మెస్మరైజ్ చేసి ఆలోచింపజేసే కథలపై బాగా ఫోకస్ పెట్టాడు. ఫలితంగా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ సొంతమయింది. దాదాపు రెండు దశాబ్దాలుగా విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ కెరీర్ లో దూసుకెళుతున్నాడు. ప్రయోగాలు చేయడానికి కళ్యాణ్ రామ్ ఎప్పుడూ ముందుంటాడని చెప్పుకుంటుంటారు. తను ఎంపిక చేసుకున్న చిత్రాలు.. ఆయా సినిమాల్లోని అతడి పాత్రలు వేటికవే భిన్నంగా ఉండేలా జాగ్రత్త పడుతూనే ఉంటాడు.

ఎప్పటికప్పుడు తన చిత్రాల్లో కొత్తదనం చూపిస్తూ ప్రయోగాలు చేసే కళ్యాణ్ రామ్.. గత ఏడాది ‘బింబిసార’తో కెరీర్‌లోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ చిత్రం తెచ్చిన విజయంతో అతడి కెరీర్ వెలిగిపోతోంది. ఆ ఉత్సాహంతోనే తాజాగా కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ అనే ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా విడుదలకు ముందు ‘అమిగోస్’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ ‘అమిగోస్’ చిత్రానికి రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించారు. కళ్యాణ్ రామ్ కు జోడీగా అషికా రంగనాథ్ నటించింది. కన్నడ నటి అయిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతోనే తెలుగులో ఆరంగేట్రం చేయడం విశేషం.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్‌లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చారు. సినిమాల ఎంపికలో అగ్ర హీరో నందమూరి కళ్యాణ్ రామ్ పంథాయే వేరు. ప్రయోగాత్మక ఇతివృత్తాలకు పెద్ద పీట వేస్తారాయన. కమర్షియల్‌ అంశాల్ని మిస్‌ చేయకుండా కథలో కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. జయాపజయాలతో సంబంధం లేకుండా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలని తపిస్తారు. గత ఏడాది ‘బింబిసార’ వంటి హిస్టారికల్‌ ఫిక్షన్‌ కథాంశంతో భారీ విజయాన్ని దక్కించుకున్నారు.

దాంతో ఆయన తాజా చిత్రం ‘అమిగోస్‌’ ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచింది. ఒకే పోలిక ఉన్న ముగ్గురు సంబంధం లేని వ్యక్తులు కలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్లంతా కలవడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనే అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం ఫిబ్రవరి 10, 2023న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేయడం మరింత ఆసక్తినిరేకెత్తించింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంత వరకు మెప్పించింది? మూడు పాత్రల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఎలాంటి పర్‌ఫార్మెన్స్‌ కనబరిచాడు? కళ్యాణ్ రామ్ చేసిన మరో ప్రయోగం ఎలాంటి ఫలితాన్నిచ్చిందో తెలుసుకుందాం..

కథలోకి… సిద్దూ (కళ్యాణ్ రామ్) రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవ్యక్తి. తొలి చూపులోనే ఇషికా (ఆషికా రంగనాథ్) ప్రేమలో పడతాడు. ఇరు కుటుంబాలు వీళ్ల ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సిద్దూ, ఇషికా నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. ఈ క్రమంలో మనిషిని పోలిన మనుషుల గురించి తెలిపే వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవడంతో మంజునాథ్, మైఖేల్ అలియాస్ బిపిన్ రాయ్ పరిచయమవుతారు. మైఖేల్ చేసిన కుట్రకు మంజునాథ్ జాతీయ భద్రతాధికారులకు చిక్కిపోతాడు. ఇంతకీ.. మైఖేల్ ఎవరు? దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు చేశాడు? సిద్దూ, మంజునాథ్‌ను ఎలా వాడుకున్నాడు. మైఖేల్ చేసిన కుట్రకు మంజునాథ్ ఎలాంటి కష్టాల్లో ఇరుక్కొన్నాడు? మైఖేల్ చెరలో ఉన్న తన కాబోయే భార్య ఇషికాను ఎలా కాపాడుకున్నాడు. మైఖేల్ కుట్రలకు సిద్దూ ఎలా చెక్ చెప్పాడు? తనను పోలిన మనుషులను కలవడం ద్వారా సిద్దూ జీవితంలో జరిగిన మంచి, చెడులు ఏమిటనే ప్రశ్నలకు సమాధానమే ‘అమిగోస్’ చిత్ర కథ.

విశ్లేషణ: ఈ సినిమా కంటే ముందుగా వచ్చిన ‘బింబిసార’ నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో పెద్ద హిట్ గా నిలించింది. అందులో అతను ద్విపాత్రాభినయం చేస్తే, ఇప్పుడు అతను త్రిపాత్రాభినయం చేసిన సినిమా ‘అమిగోస్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో నడిచే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. సినిమా ప్రథమార్థం ఆసక్తిగా మొదలవుతుంది. మూడు పాత్రల్ని పరిచయం చేయడం, వారితో కథను నడిపించిన విధానం మెప్పిస్తుంది. అయితే సిద్ధూ, ఇషికా లవ్‌ ఎపిసోడ్‌ రొటీన్‌గా సాగుతుంది. ఇంటర్వెల్‌ ముందు కథాగమనం కాస్త ఉత్కంఠగా మారుతుంది. అక్కడి మలుపులతో ద్వితీయార్థం ఎలా ఉంటుందోననే ఆసక్తి కలుగుతుంది. మైఖేల్‌ వేసిన ప్లాన్‌ వల్ల మంజనాథ్‌ను ఎన్‌ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకోవడం, అనంతరం మైఖేల్‌ నిజస్వరూపం ఏమిటో సిద్ధార్థ్‌ తెలుసుకోవడంతో సెకండాఫ్‌ మీద ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ అవుతుంది. ద్వితీయార్థంలో మైఖేల్‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ఆసక్తికరంగా అనిపిస్తుంది.

ప్రతినాయకుడు మైఖేల్‌ పాత్రలో కల్యాణ్‌రామ్‌ లుక్స్‌, బాడీలాంగ్వేజ్‌ కొత్తగా అనిపిస్తాయి. యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో మొదలైన సెకండాఫ్‌ క్యూరియాసిటీ పెంచుతుంది .ఆ తర్వాత కథలో వేగం పెరుగుతుంది. బిపిన్‌రాయ్‌ అనే నరరూప రాక్షసుడిగా కల్యాణ్‌రామ్‌ పాత్రను డిజైన్‌ చేసిన విధానం బాగుంది. ప్రథమార్థంతో పోల్చితే సెకండాఫ్‌ ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. క్లెమాక్స్‌ ఘట్టాలు కాస్త ఉత్కంఠను పంచాయి. దర్శకుడు రాజేందర్ రెడ్డి సినిమా విడుదలకి ముందే కథని కొంచెం బహిర్గతం చేసాడు. దర్శకుడు తీసుకున్న భావన మంచిదే కానీ, అది తెర మీద చూపించటం లో కొంచెం విఫలం అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే మొదటి సగం లో కథ ఏమీ ముందుకు నడవదు, అలాగే ఆ లీడ్ పెయిర్ మీద ప్రేమ సన్నివేశాలు అంతగా పండవు. అదీ కాకుండా, హీరోయిన్ పిచ్చి పిచ్చి ప్రశ్నలు, వాటినే మళ్ళీ మళ్ళీ ఆమె చేత చేయించి కొంచెం విసిగిస్తాడు దర్శకుడు. నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన ఈ ‘అమిగోస్’ ఫస్టాఫ్ యావరేజ్‌గానే ఉంది. మంచి సన్నివేశాలతో అద్భుతంగా చూపించిన కాన్సెప్టుతో ఈ సినిమా సాగుతుంది.

అయితే.. సాదాసీదాగా సాగే బ్యాగ్రౌండ్ స్కోర్ కారణంగా సినిమా కొంత నాసిరకంగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో క్యారెక్టర్లను చూపించిన తీరు, ఇంటర్వెల్ బాగున్నాయి. మొత్తంగా ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉన్నా.. సెకెండాఫ్ మాత్రం స్పీడుగా సాగిన స్క్రీన్‌ప్లే, యాక్షన్ సీన్స్, క్లైమాక్స్‌ వాహ్.. అనిపిస్థాయి. ద్వితీయార్ధంలో వచ్చే సన్నివేశాలన్నీ వేటికవే భిన్నంగా ఉండి ప్రేక్షకులను అలరిస్తాయి. దర్శకుడికి మంచి ఎంట్రీ ఇది. విభిన్నమైన కథలతో వస్తున్న కళ్యాణ్ రామ్ కెరీర్ కు మరో విజయమే అని చెప్పొచ్చు. దర్శకుడు రాజేంద్రరెడ్డి ఆసక్తికరమైన పాయింట్ తో కథనాన్ని నడిపించడానికి మంచి ప్రయత్నమే చేశాడు. ఇందులో ట్విస్టులు అదిరిపోయాయి. అయితే.. కథనం మాత్రం కొంతమేర స్లోగా సాగినట్లుగా అనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ క్యారక్టరైజేషన్స్, మూడు పాత్రలను మలచిన తీరు భేష్… అయితే.. ముగ్గురు ఒకేలా వున్న వ్యక్తులు తారసపడినప్పుడు ఆ సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉండాలి, కానీ అలా చేయలేకపోయాడు దర్శకుడు. అదీ కాకుండా, సన్నివేశాలు ఎలా ఉంటాయి అన్నది ప్రేక్షకుడికి ముందే అర్థం అయిపోతూ ఉంటుంది. అందువల్ల ఏమి జరుగుతుంది అన్న ఆసక్తి లేకుండా పోతుంది. ఒక్క పాత్ర కూడా భావోద్వేగాలతో కూడినది లేకపోవటం వలన, ప్రేక్షకుడు ఆ పాత్రలకు తొందరగా కనెక్ట్ అవడు. చాలా సన్నివేశాల్లో సాగదీత ఎక్కువయింది. సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకాస్త బాగుండాల్సింది. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ల ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఒకే. ఎస్. సౌందర్ రాజన్ కెమెరా వర్క్ అంతంత మాత్రమే. దీనివల్ల పాత కాలం సినిమాల మాదిరి అనిపించింది. సిద్దూ ఇంట్రడక్షన్‌తో ‘అమిగోస్’ చాలా రొటీన్ ఫార్మాట్‌లో ప్రారంభమవుతుంది. మనిషిని పోలిన మనుషులు కాన్సెప్ట్‌తో కొంత వెరైటీ ట్రై చేశాయనే ఫీలింగ్ కలుగుతుంది.

మూడు క్యారెక్టర్లను నడిపించిన విధానం ఫర్వాలేదనిపిస్తుంది. ఇక ఇషికాతో సిద్దూ లవ్ ట్రాక్ రెగ్యులర్ ఫార్మాట్‌లోనే సాగడంతో ఓ సాదాసీదా సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. అయితే ఇంటర్వెల్ ట్విస్టుతో దర్శకుడు సెకండాఫ్ పై ఆసక్తిని కలిగేలా చేశాడు. సెకండాఫ్‌లో మైఖేల్ క్యారెక్టర్‌తో కళ్యాణ్ రామ్ కొత్తగా ట్రై చేశాడనిపిస్తుంది. కానీ మైఖేల్ పాత్రలో బలం లేకపోవడం, పాత్రలో వేరియేషన్ లేకపోవడం వల్ల ఏదో మిస్ అయ్యామనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే క్లైమాక్స్ మరీ రొటీన్‌గా ముగియడంతో అమిగోస్ యావరేజ్ సినిమాగా అనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో విలన్ పాత్రలో కొత్తగా కనిపించాడు, బాగా చేసాడు కూడా. మాట తీరు, హావభావాలు ఆ పాత్ర కోసం కొంచెం మార్చాడు, అవన్నీ బాగున్నాయి. మిగతా రెండు పాత్రలు మామూలుగానే చేసాడు. ఆషికా రంగనాథ్ స్క్రీన్ మీద అందంగా కనపడింది, కానీ ఆమె పాత్ర కేవలం కొన్ని సన్నివేశాలకి, పాటకి మాత్రమే పరిమితం చేశారు. పాటలో చక్కగా కనపడింది ఆమె. ఆమె గ్లామర్ పాత్రకే పరిమితమైంది. రొమాంటిక్ సన్నివేశాల్లో కళ్యాణ్ రామ్ తో మంచి కెమిస్ట్రీని పండించింది. కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో వేరియేషన్స్ చూపించేందుకు ప్రయత్నించిన తీరు మాత్రం మెచ్చుకోవలసిందే. మైఖేల్ పాత్రలో కల్యాణ్ రామ్ ఒదిగిపోయాడు. ఫెర్ఫార్మెన్స్ పరంగగా, నటుడిగా మరో మెట్టు ఎక్కే ప్రయత్నం చేశాడు. విలనిజాన్ని బాగా పండించాడు. బ్రహ్మజీ, సప్తగిరి ఫర్వాలేదనిపించారు. మిగతా పాత్రల్లో కనిపించిన వారు వారి పాత్రల పరిధిమేరకు నటించి ఓకే అనిపించారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సౌందర రాజన్ సినిమాటోగ్రఫీ సోసోగానే సాగింది. యాక్షన్ సన్నివేశాలను బాగానే చిత్రీకరించాడు. మ్యూజిక్ విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ సినిమాలో పాట ‘ఎన్నో రాత్రులొచ్చాయి గానీ’ ఇందులో రీమిక్స్ చేశారు. అది స్క్రీన్ మీద చాలా బాగుంది అని చెప్పాలి. కొంత రిలీఫ్ కూడా ఆ పాటే. ‘ఎన్నో రాత్రుల..’ పాట తప్ప బీజీఎం కూడా నార్మల్‌గానే ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగుంటాయి. ఈ సినిమాలో వాళ్లు ఖర్చు చేయడానికి, క్వాలిటీ మెయింటెన్ చేయడానికి స్కోప్ కూడా లేకపోయింది. పాటలో ఆర్ట్ వర్క్ ఓకే. మిగతా విభాగాలు పెద్దగా ఎలివేట్ అయ్యే ఛాన్సే కనిపించలేదు. మొత్తం మీద ఎన్నో అంచనాలతో వచ్చి ‘అమిగోస్’ సినిమా చూస్తే మాత్రం నిరాశ చెందుతారు. ఎదో వైవిధ్యంగా ఉంటుంది అనుకోని, జస్ట్ టైం పాస్ కోసం వస్తే మాత్రం ఫర్వాలేదు.
-ఎం.డి. అబ్దుల్

(చిత్రం : ‘అమిగోస్’ రేటింగ్ : 3/5, నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్, నితిన్ ప్రసన్న, జయప్రకాశ్, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు, రచన, దర్శకత్వం: రాజేంద్రరెడ్డి, నిర్మాణం : మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు : నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, సంగీతం : జిబ్రాన్ ఛాయాగ్రహణం : ఎస్. సౌందర్ రాజన్, ఎడిటింగ్: తమ్మిరాజు, విడుదల : 10 ఫిబ్రవరి 2023)