‘ఆరెంజి’ మార్కు ప్రేమకథ ( ‘మిస్ట‌ర్ మ‌జ్ను’ రివ్యూ)

 
―సికిందర్

Rating: 2.5

తొలి రెండు సినిమాల పరాజయాలతో వున్న అఖిల్, అక్కినేని వంశస్థుడిగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో వున్నాడు. మరో ప్రేమ సినిమా నటించి నిలదొక్కుకునేందుకు సమాయత్తమయ్యాడు. దీనికి ‘తొలి ప్రేమ’ తీసిన వెంకీ అట్లూరి అనే తాజా దర్శకుడితో చేయి కలిపాడు. ఇద్దరూ చేయీ చేయీ కలిపిన తర్వాత వెలిసిన సినిమా ‘మిస్టర్ మజ్నూ’ అయింది. ఏమిటీ ఈ ఇంకో ప్రేమ కథ? పరాజయాల్లో వున్న అఖిల్ తో ఇందులో కొత్తగా ఏం చూపించారు? ఈ ప్రేమ కథ కాలక్షేపానికైనా, కొత్తగా ఏమైనా తెలుసుకునెందుకైనా పనకొచ్చేట్టు వుందా? ఇవి తెలుసుకుందాం…

కథ

అమెరికాలో విక్కీ (అఖిల్) ఎం.ఎస్ చేస్తూంటాడు. ఇట్టే అమ్మాయిలు అతడి వెంట పడుతూంటారు. వాళ్ళతో చిలిపి చేష్టలకి పాల్పడుతూ ఎవరితోనూ కమిట్ కాడు. వాళ్ళూ సీరియస్ గా తీసుకోరు. అక్కడే నిక్కీ (నిధి)అనే అమ్మాయి వుంటుంది. ఈమె రాముడి లాంటి భర్తని కోరుకుంటుంది. ఒకరోజు నిక్కీ విక్కీ క్లాష్ అవుతారు. విక్కీ వ్యవహారమంతా కనిపెట్టి దూరంగా వుంటుంది నిక్కీ. ఇంకో రోజు ఒకరికి తెలియకుండా ఒకరు ఇండియాలో జరిగే పెళ్ళికి బయల్దేరతారు.

తీరా ఇక్కడికి వచ్చాక ఈ పెళ్లి సంబంధంతో తాము బంధువులమని తెలుసుకుంటారు. నిక్కీ అన్నకీ, విక్కీ చెల్లికీ పెళ్లి! శివప్రసాద్ (జయప్రకాష్) కొడుకు నిక్కీ. సత్యప్రసాద్ (నాగబాబు) కూతురు నిక్కీ. శివప్రసాద్ తమ్ముడు (కృష్ణ ప్రసాద్) రావురమేష్.

ఇలా మూడు కుటుంబాల సందడితో పెళ్లి కార్యక్రమాలు జరుగుతూంటాయి. నిక్కీతో విక్కీ మామూలుగా వుంటాడు,. ఓ రోజు చిట్టి (ప్రియదర్శి) విక్కీ అసలు వ్యక్తిత్వం నిక్కీకి చెప్తాడు. దీంతో ఆమె ప్రేమ పెంచుకుని విక్కీకి చెప్తుంది. అతను పెళ్లి ఇష్టం లేదంటాడు.

అయినా అరవై రోజులు ప్రయత్నించి చూద్దామని ప్రేమాయణం సాగిస్తుంది. అయినా విక్కీకి ప్రేమ కలక్కపోగా ఆమె చేస్తున్న అతికి ఎలర్జీ పుట్టి నో అనేస్తాడు. దీంతో ఆమె బాధపడి అమెరికా వెళ్ళిపోతుంది. ఇలా విడిపోయిన వీళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారనేదే మిగతా కథ.

ఎలావుంది కథ

రాం చరణ్ ‘ఆరెంజి’ లోని ఫ్లాష్ బ్యాక్ లా వుంది. విచిత్రమేమిటంటే, ‘ఆరెంజి’ తీసి ఘోరంగా నష్టపోయిన నాగబాబు ‘ఆరెంజి’ లాంటి దాన్లోనే నటించడం, అదే ఆయన్ని వెంటాడ్డం. ఇక తెలుగు ప్రేమ సినిమాలకి రెండే టెంప్లెట్లు. అయితే ప్రేమ చెప్పలేక నాన్చడం, కాకపోతే అపార్ధాలతో విడిపోవడం.

అయినా గత ఇరవై ఏళ్లుగా విసుగులేకుడా మళ్ళీ మళ్ళీ ప్రేక్షకులు ఇవే చూస్తున్నారంటే వాళ్ళ సహనశక్తికి పరమ వీర చక్ర ఇవ్వాల్సిందే. ఈ రెండో కోవకి చెందుతుంది ప్రస్తుత ‘ఆరెంజి’ మార్కు ప్రేమకథ. ఇక ప్రేక్షకుల ఇష్టం. రేపు రిపబ్లిక్ డే కూడా.

ఎవరెలా చేశారు

అఖిల్ ప్రేమ కథలకే సూటవుతాడు. కానీ పాత ప్రేమలే నటించాల్సి వస్తే ఏం చేయగలడు. రొటీన్ కథకి లోబడే, ఆ కథా కథనాల్లో ఇరుకున్న పాత్రకి లోబడే చేస్తాడు. ఐతే కథతో బాటు ఇంత పాత కథనంలోనూ, అఖిల్ పాత్రని కాస్త కొత్తగా చూపించవచ్చు. హీరోయిన్ తనకి రాముడు లాంటి భర్త కావాలని చెప్పడంతో మొదలవుతుంది సినిమా. అప్పుడు అఖిల్ ని హీరోయిన్ పాయింటాఫ్ వ్యూలో రాముడిగానే చూపిస్తూ నడపవచ్చు – ప్రేక్షకులని కూడా ఇలాగే నమ్మిస్తూ.

హీరోయిన్ ఛేదిస్తూంటే అఖిల్ అసలు ప్లేబాయ్ క్యారెక్టర్ అంచెలంచలుగా బయటపడుతూ హీరోయిన్ కీ, ప్లస్ ప్రేక్షకులకీ షాకింగ్ గా వుండే సస్పెన్స్ తో కూడిన పాత్ర చిత్రణ చేయవచ్చు. కానీ మొదట్నుంచీ మొత్తం ఓపెన్ చేసి చూపడంతో ఫస్టాఫ్ అఖిల్ క్యారెక్టర్ పాత వాసనే వేస్తూ, కథ కూడా తెలిసిపోయేలా తయారయ్యింది. ఇక సెకండాఫ్ లో దూరమైన హీరోయిన్ కి దగ్గరయ్యే రొటీన్ ప్రయత్నాలే.

ఇది హీరోయిన్ క్యారెక్టర్ కథగా నిధీ అగర్వాల్ కి మంచి పాత్రే. కానీ ఆమెమీద సానుభూతి కలగడానికి బలమైన సీన్లు లేవు. మొదలైన ప్రేమకీ, ఇంటర్వెల్ దగ్గర విడిపోయిన ప్రేమకీ మధ్య అనవసర పెళ్లి తంతు, కుటుంబ కష్టాలు, ఏడ్పులు వచ్చి పడి హీరోయిన్ కి అలాటి బలమైన సన్నివేశాలు లేకుండా చేశాయి.

ఇక మిగిలిన పాత్రల్లో సీనియర్ నటులవి షరా మామూలు పాత్రలు, నటనలు. ఓ మాదిరి కెమెరా వర్క్ కి ప్రొడక్షన్ విలువలకోసం భారీగా ఖర్చు పెట్టారు. తమన్ సంగీతంలో హిట్ పాటలేవీ లేవు.

చివరికేమిటి

ఇందులో చాలా సినిమాల సన్నివేశాలు కన్పిస్తాయి. గీత గోవిందం, శుభలేఖ + లు మొదలైనవి. అలాగే ఎందరో దర్శకులు తీసితీసి వున్న అవే చీరెల షోరూం, గుడి, నైట్ ఈటరీస్ ప్లస్ ఐస్ క్రీం బండి లాంటి టెంప్లెట్ సీన్లే వస్తూ, తాజా దర్శకుడి స్పెషల్ టాలెంట్, పడ్డ కష్టం ఏమీ కన్పించవు. ఓ ఫ్లాపయిన సినిమా లోంచి సిల్లీ కాన్సెప్ట్, మరికొన్ని సినిమాల్లోంచి సన్నివేశాలు, టెంప్లెట్ సీన్లూ కలిపి చూపిస్తే ‘మిస్టర్ మజ్నూ’ అయింది. తప్పులేదు, ప్రేక్షకులకీ ఇలాటివే కావాలి.

న‌టీన‌టులు: అఖిల్ అక్కినేని, నిధి అగ‌ర్వాల్‌, ప్రియ‌ద‌ర్శి, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, హైప‌ర్ ఆది, సితార‌, ప‌విత్ర లోకేష్‌, విద్యుల్లేఖ రామ‌న్ త‌దిత‌రులు
సంగీతం: త‌మన్‌
ఛాయాగ్ర‌హ‌ణం: జార్జ్‌ సి. విలియమ్స్‌
కూర్పు: నవీన్‌ నూలి
క‌ళ‌: అవినాష్‌ కొల్లా
నృత్యాలు: శేఖర్‌
నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి.
సంస్థ‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌
విడుద‌ల‌: 25-01-2019నిర్మాణ సంస్థ‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌
నటీనటులు: అఖిల్ అక్కినేని, నిధిఅగ‌ర్వాల్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, రావు ర‌మేష్‌, నాగబాబు, విద్యుల్లేఖారామ‌న్‌, ప్రియ‌ద‌ర్శి, హైప‌ర్ అది, అజ‌య్‌, సుబ్బ‌రాజు త‌దిత‌రులు
సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
ఛాయాగ్ర‌హ‌ణం: జార్జ్ సి.విలియ‌మ్స్‌
కూర్పు: న‌వీన్ నూలి
ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి