(చిత్రం : ఆది పురుష్, విడుదల : జూన్ 16, 2023, రేటింగ్ : 3.75/5, నటీనటులు: ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, సోనాల్ చౌహాన్, దేవదత్ నాగ్ తదితరులు. స్క్రీన్ ప్లే , దర్శకత్వం : ఓం రౌత్, నిర్మాతలు: భూషణ్ కుమార్, కృష్ణకుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, వంశీ, ప్రమోద్, సంగీతం : అజయ్ – అతుల్, నేపథ్య సంగీతం : సంచిత్ బల్హారా- అంకిత్ బల్హారా, మాటలు : భీమ్ శ్రీనివాస్ (తెలుగులో), పాటలు : రామజోగయ్య శాస్త్రి, సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని, ఎడిటర్: అపూర్వ మోత్వాలే సహాయ్ , ఆశిష్ మహాత్రే , విడుదల : యూవీక్రియేషన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ)
‘బాహుబలి’ చిత్రం తర్వాత నుంచి పాన్ ఇండియా లెవెల్లో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నారు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్. ఆయన తాజాగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’. సాహో, రాధేశ్యామ్ చిత్రాల తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమా ఇదే కావడంతో ఈ చిత్రంపై అందరికీ ఎంతో ఆసక్తి ఏర్పడింది. వాల్మీకి రచించిన ఇతిహాసం ‘రామాయణం’లోని కొన్ని ప్రధాన ఘట్టాల ఆధారంగా రూపొందిన ఈ ‘ఆదిపురుష్’ విడుదలకు ముందే ఇటు అభిమానులు, అటు ప్రేక్షకుల్లోనూ ఎంతో ఆసక్తిని కలిగించింది. నవతరానికి రామాయణ ప్రాముఖ్యత తెలియజెప్పడం కోసం.. రామాయణ ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మించారు. ‘తానాజీ’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం జూన్ 16, 2023న పాన్ వరల్డ్ స్థాయిలో విడుదలయింది. గ్రాఫిక్స్ విషయంలో ఈ చిత్రానికి తొలుత కాస్త నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. ఆ తర్వాత విడుదలైన పాటలు, ట్రైలర్స్ సినిమా మీద విశేషమైన బజ్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ.. ఎలాంటి భారీ ప్రమోషన్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ‘ఆదిపురుష్’” ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం…
కథ: రాఘవ (ప్రభాస్) వనవాసం స్వీకరించడం నుంచి సినిమా కథ మొదలవుతుంది. అపురూప సౌందర్యవతి అయిన తన సతీమణి జానకి (కృతి సనన్), శేషు (సన్నీసింగ్)తో కలిసి సత్యం, ధర్మమే తన ఆయుధంగా వనవాసం గడుపుతుంటాడు. ఈ క్రమంలో శత్రు దుర్భేద్యమైన లంకను పాలిస్తున్న లంకేశుడు రావణ (సైఫ్ అలీ ఖాన్).. తన సోదరి శూర్పణఖ చెప్పిన మాటలువిని ఆగ్రహంతో సాధువు వేషంలో వచ్చి జానకిని అపహరించి అశోకవనంలో బంధిస్తాడు. అంతటితో ఆగకుండా సోదరి చెప్పిన మాటలకు తోడు సహజంగా తన స్వభావం కారణంగా రావణ జానకి పై ఆశ పెంచుకుంటాడు. అనంతరం రాఘవ తన సతీమణి జానకిని దక్కించుకోవడానికి ఏం చేశాడు?, హనుమంతుడు (దేవదత్త) శక్తి ఎలా నడిపించింది?, ఈ యుద్ధంలో వానర సైన్యం పోరాట పటిమ ఎలా సాగింది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!
విశ్లేషణ : భారతీయ జీవన సౌంద్యరంలో రామాయణం మమేకమైన అద్భుతమైన కావ్యం. అజరామమైన అలాంటి కావ్యానికి దృశ్యరూపం ఇచ్చి..వెండితెరపై ఆవిష్కరించిన విధానం ప్రేక్షకుల్ని మైమరపింపజేసింది. వాల్మీకి విరచిత ఇతిహాసగాథ ప్రతీ ఒక్కరికీ ఆదర్శప్రాయంగా నిలిచేలా తీర్చిదిద్దినవైనం వాహ్.. అనిపిస్తుంది. ఈ చిత్రం ద్వారా నేటితరానికి రామాయణం గొప్పతనాన్ని చెప్పిన దర్శకుడు ఓం ఓం రౌత్ ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేం. రామాయణంలోని ప్రధాన ఘట్టాలను యుద్ద నేపథ్యంలో పూర్తిగా 3డిలో తెరకెక్కించడమే ఈ చిత్రానికి ప్రధాన ప్లస్ పాయింట్ గా నిలిచింది. అలాగే ఈ చిత్రంలోని అన్ని ముఖ్య పాత్రలకు అగ్ర నటీనటులు నటించడం.. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా.. ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో లీనమై జీవించేశారు. పైగా అత్యంత భారీ అంచనాలతో పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో అద్భుతమైన విజువల్స్, భారీ నిర్మాణ విలువలు ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్లు అయ్యాయి. ఇన్నాళ్లు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓం రౌత్ ఈ సినిమా రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్ ట్రీట్ ఇచ్చారు.
సినిమా చూస్తున్నంత సేపూ సాంకేతిక హంగులతో ఓ అత్యుత్తమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూస్తున్న ఫీల్ కలుగుతుంది. అయితే.. ఈ సినిమా చూస్తున్నంత సేపూ తర్వాత ఏం జరుగుతుందో ఇట్టే తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ కథ అందరికీ తెలిసిందే కాబట్టి. సినిమాలోని ఒక్కో సన్నివేశం విడిగా చూస్తే, ఆ సన్నివేశాలన్నీ పాత సినిమాల్లో చూసిన ఫీలింగే కలుగుతుంది. అయినప్పటికీ దర్శకుడు ఇచ్చిన విజువల్ ట్రీట్ ముందు అవన్నీ మరచిపోయి బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పటి వరకు రామాయణం ఆధారంగా వచ్చిన సినిమాలు చూసి ఓ అంచనాతో థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకులకు… సినిమా ప్రారంభం నుంచి ఓం రౌత్ సర్‌ప్రైజ్ చేశారు. ‘వానర సైన్యం చూస్తే ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’లో వానరాలు గుర్తుకు వస్తాయి. లంకలో రావణుడి సైన్యం చూస్తే హాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్లు చూసినట్టు ఉంటాయి. ప్రేక్షకులకు తెలియని కథను ఎలా చెప్పినా ఓకే. కానీ, తెలిసిన కథను ఆసక్తికరంగా చెప్పాలి. చిత్రసీమ అనుసరించే సూత్రం ఇది. రామాయణం కథ అందరికీ తెలుసు. ఆల్రెడీ బోలెడు సినిమాలు వచ్చాయి. మరి, ఈ ‘ఆదిపురుష్’ని దర్శక నిర్మాతలు ఎలా తీశారు? ఈతరం ప్రేక్షకులకు సైతం మెచ్చేలా తీశామని చెప్పిన మాటల్లో నిజమెంత? ప్రజలకు తెలిసిన రామాయణానికి ఓం రౌత్ మోడ్రన్ టచ్ ఇచ్చారు. కథ, కథనాల్లో పెద్ద పెద్ద మార్పులు ఏమీ చేయలేదు. కానీ, కొన్ని విషయాల్లో క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకున్నారు. ముఖ్యంగా గెటప్స్ విషయంలో! లంకాధిపతి రావణుడి ఆహార్యం విషయంలో మరోసారి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. కథ, కథనాలు, పురాణ ఇతిహాస గ్రంథంలో ఏముంది? అనేది పక్కన పెట్టి ఓం రౌత్ ఎలా తీశారు? అనే విషయానికి వస్తే… విజువల్స్ పరంగా కొత్తగా ఉంటుంది. త్రీడీ ఎఫెక్ట్స్ కొన్ని బావున్నాయి. తెలిసిన కథే కావడంతో చాలా నిదానంగా ముందుకు వెళుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ‘ఆదిపురుష్’ ప్రథమార్థం నిదానంగా ఉన్నప్పటికీ… కంప్లైంట్స్ పెద్దగా లేకుండా ముందుకు వెళుతుంది. విశ్రాంతి తర్వాత వచ్చే యుద్ధ సన్నివేశాలు, డైలాగులు బాహుబలిని గుర్తు చేస్తాయి. ‘బాహుబలి’ యుద్ధాన్ని కొత్తగా చూసినట్టు ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ వల్ల తెరపై వచ్చేవి తెలిసిన సన్నివేశాలే అయినప్పటికీ కొత్త అనుభూతి కలుగుతుంది.
ఎవరెలా చేశారంటే.. రాఘవుడు / రాముని పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయారు. ఆయన అభినయం, ఆహార్యం ప్రేక్షకులను మెప్పిస్తుంది. రాఘవగా మర్యాద పురుషోత్తముడిగా తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యుద్ద సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. తరతరాలు చెప్పుకునేలా సాగిన ఈ పోరాటంలో చెడుపై మంచి ఎలా గెలిచిందో చూపించే ఘట్టాల్లో, తన జానకిని తీసుకెళ్లేందుకు వచ్చిన రాఘవగా ప్రభాస్ చూపిన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాఘవుడిగా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ & స్క్రీన్ ప్రెజన్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తుంది. ప్రభాస్ తన చరిష్మాతో సినిమాకు ప్రధాన ఆకర్షణ అయ్యారు. కథానాయికగా నటించిన కృతి సనన్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా, తన నటనతోనూ విశేషంగా అలరించింది. జానకిగా ప్రతీ సన్నివేశంలో ఆమె నటన బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని ప్రేమ సన్నివేశాల్లో, కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ ఆమె పలికించిన హావభావాలు మెచ్చుకునేలా ఉన్నాయి. జానకిగా ఆమె బాగా సెట్ అయ్యింది. ఆమె కళ్ళలో బాధ, ఆమె ముఖంలో హావభావాలు చక్కగా పండాయి. నెగిటివిటీకి తావు లేకుండా ఆమె పాత్రను పోషించింది. కాకపోతే.. ఆమె కాస్ట్యూమ్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది. ఆమె కనిపించే సన్నివేశాలు తక్కువ. ఉన్నంతలో చక్కగా చేశారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో అభినయం ఆకట్టుకుంటుంది. ప్రభాస్, కృతి సనన్ జోడీ బావుంది. వాళ్ళిద్దరి సన్నివేశాలు బావున్నాయి.
లంకేశ్వరుడిగా సైఫ్ అలీ ఖాన్ గెటప్, నటన బాగుంది. ఆ పాత్రలో అతడు చూపిన నటన సినిమాకు బాగా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ప్రభాస్ కు ధీటుగానే సాగిన అతడి క్యారెక్టర్ ను సమర్ధవంతంగా పోషించాడు. శేషుగా నటించిన సన్నీసింగ్ ఫర్వాలేదనిపించుకున్నాడు. భజరంగ్ పాత్రలో దేవ్ దత్తా జీవించేశాడు. మండోధరిగా సోనాల్ చౌహాన్ మెరిసింది. ఇతర నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు చక్కటి నటనను కనబరిచి ప్రేక్షకుల మెప్పును పొందారు.
సాంకేతిక విభాగం : ముందుగా కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ వర్క్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ప్రతీ సన్నివేశాన్ని ఎంతో అందంగా తన కెమెరాలో బంధించిన విజువల్స్ సినిమాకు అందాన్ని తెచ్చిపెట్టాయి. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను చాలా చక్కగా చిత్రీకరించారు. ఎడిటింగ్ ఓకే. సంచిత్ & అంకిత్ ద్వయం నేపధ్య సంగీతం సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. కంటెంట్ వైజ్ ఉన్న మైనస్ లన్నీ బ్యాగ్రౌండ్ స్కోర్ కవర్ చేసింది. అలాగే.. అజయ్-అతుల్ & సాచిత్-పరంపరాలు సమకూర్చిన బాణీలు కూడా బాగున్నాయి. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం బావుంది. పాటల్లో పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది.
అద్భుతమైన సినిమాటోగ్రఫీకి తోడు బీజీఎం, విజువల్స్, గ్రాఫిక్స్, ఫైట్ సీక్వెన్స్ .. గూజ్ బమ్స్ కలిగిస్తాయి. బీజీఎం అయితే నెక్ట్స్ లెవల్లో ఉంది. విజువల్స్ హుషారెక్కిస్తాయి. హనుమాన్ అయితే సినిమా మొత్తం ర్యాంప్ ఆడించేశాడు. నిర్మాణ విలువలు చిత్ర స్థాయికి తగ్గట్టే ఉన్నాయి. రామాయణం లాంటి అత్యద్బత దృశ్య కావ్యాన్ని.. ‘ఆదిపురుష్’ అంటూ 3డిలో వచ్చిన ఈ మైథలాజికల్ విజువల్ యాక్షన్ డ్రామా బాగానే ఆకట్టుకుంది. 3డి ఎఫెక్ట్స్, ప్రభాస్ – కృతి సనన్ ల నటన, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. అయితే, తెలిసిన కథ కావడం, పైగా సెకెండ్ హాఫ్ పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ గా సాగకపోవడం వంటి అంశాలు సినిమాని బలహీనపరుస్తాయి. అయితే ప్రభాస్ తన స్టార్ డమ్ తో ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకు వెళ్లారు. ఓవరాల్ గా ఈ చిత్రం ప్రభాస్ ఫాన్స్ ను, చిన్న పిల్లలను చాలా బాగా ఆకట్టుకుంటుంది.
చివరగా చెప్పేది ఏంటంటే? : ‘ఆదిపురుష్’ ఓమోడ్రన్ రామాయణం! పురాణ కథకు మోడ్రన్ టచ్ ఇస్తూ తీసిన సినిమా. సీతను రావణాసురుడు అపహరించే ఎపిసోడ్, లంకాదహనం, ఇంట్రవెల్ సీన్స్ సినిమాకు హైలైల్‌గా నిలిచాయి. ఓవరాల్‌గా యాక్షన్ లవర్స్‌తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్‌ను ‘ఆదిపురుష్’ మెప్పిస్తుంది. మనం చిన్నప్పట్నుంచి వింటూ, చదువుతూ, చూస్తూ వచ్చిన రామాయణం వేరు.. “ఆదిపురుష్”లో చూపించే రామాయణం వేరు. నవతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కొన్ని భారీ మార్పులు చేశారు. ప్రభాస్ చరిష్మా & అద్భుతమైన నేపధ్య సంగీతం కోసం “ఆదిపురుష్”ను కచ్చితంగా కుటుంబంతో కలిసి చూడొచ్చు!!
-ఎం.డి. అబ్దుల్