‘శైలజా రెడ్డి అల్లుడు’ (మూవీ రివ్యూ)

 

కొంత కాలంగా సరైన హిట్స్ లేని నాగచైతన్య, దర్శకుడు మారుతీలు ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మీద చేయి వేద్దామని డిసైడ్ అయ్యారు. దాన్ని చవితికి రిలీజ్ చేస్తే పండగ ప్రేక్షకులతో బతికి బయట పడొచ్చని ఆశించారు. ఫ్యామిలీకి కావాల్సిన రమ్యకృష్ణ ఎట్రాక్షన్ ని కూడా జోడించారు. ఇద్దరికీ ఫాలోయింగ్ ఎలాగూ వుంది. మరి సినిమాకి ఫాలోయింగ్ ఎలా వుంటుందో చూద్దాం…

కథ 
          బాగా ఇగో వున్న సంపన్నుడు రావ్ (మురళీ శర్మ) సాదా కొడుకు చైతన్య (నాగ చైతన్య) రోడ్డు మీద అనూ రెడ్డి (అనూ ఇమ్మాన్యూయేల్) ని చూడగానే ప్రేమలో పడిపోతాడు. ఆమెకి కూడా బాగా ఇగో వుంటుంది. ఫైనార్ట్స్ చేస్తూంటుంది. ఇగో వున్న ఆమెని ప్రేమలో పడేద్దామని ప్రయత్నిస్తాడు. ఆమెకి ప్రేమవున్నా, ఇగో వల్ల పైకి చెప్పలేక పోతుంది. చైతన్య ఒక ఫైట్ చేసి రౌడీ బారినుంచి ఆమెని కాపాడగానే ప్రేమలో పడిపోతుంది. ఇది రావ్ కి తెలిసి తన లాగే ఇగోతో వున్న అనూరెడ్డి నచ్చి,  ఒక పట్టుదల కోసం ఎంగేజిమేంట్ ఏర్పాటు చేస్తాడు. అనూ రెడ్డి వరంగల్లో శైలజా రెడ్డి (రమ్య కృష్ణ)  అనే మరింత ఇగో వున్న ఫ్యూడలిస్టు  కూతురు. ఆమె తమ్ముడు అనుచరులతో వచ్చి ఎంగేజి మెంట్ ని చెడగొట్టి అనూ రెడ్డిని  లాక్కెళ్ళిపోతాడు. ఇరుకున పడ్డ చైతన్య సమస్య పరిష్కరించుకోవడానికి వరంగల్లలో శైలజా రెడ్డి ఇంట్లో చేరతాడు. అక్కడ తల్లీ కూతుళ్ళూ  వాళ్ళ ఇగోల వల్ల మాట్లాడుకోవడం లేదని తెలుస్తుంది. ఇప్పుడు చైతన్య వాళ్ళ ఇగోల్ని ఎలా తగ్గించి, ప్రేమని సక్సెస్ చేసుకున్నాడనేది మిగతా కథ.

ఎలా వుంది కథ 

          ‘భలేభలే మగాడివోయ్’ లో మతిమరుపు అనే మానసిక సమస్యని  నేచురల్ స్టార్ నాని పాత్రకి కల్పించి, అచ్చమైన రోమాంటిక్  కామెడీగా తీసి సూపర్ హిట్ చేసుకున్నారు దర్శకుడు మారుతి. తర్వాత ఫ్రెష్ స్టార్ శర్వానంద్ తో ‘మహానుభావుడు’   ని మరో మానసిక సమస్యతో ఇంకో రోమాంటిక్ కామెడీగా తీసి, ఓ మాదిరి హిట్ చేసుకున్నారు. ఇందులో ఒసిడి (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) అంటూ పబ్లిసిటీతో ఆకర్షించి, తీరా పరిసరాల అపరిశుభ్రత పట్ల ఎలర్జీ ఫీలయ్యే శర్వానంద్ సాదా పాత్రని మాత్రమే చూపించారు. ఇలా ఎలాగో మానసిక సమస్యలతో ఫార్ములా వర్కౌట్ చేసుకోవచ్చని, ఇప్పుడు అక్కినేని స్టార్ నాగ చైతన్యతో ‘ఇగో’ అనే మరో మానసిక సమస్యని ఎత్తుకుని, ‘శైలజా రెడ్డి’ తీశారు. అయితే ఇలా మానసిక సమస్యల కథలతో మారుతీ మోజు రెండో సినిమాతో క్వాలిటీ తగ్గినట్టు, ఇప్పుడు మూడో దాంతో పూర్తిగా అడుగంటి పోయింది. 

          ఈ కథలో రెండు అంశాలున్నాయి : ఇగో సమస్య, అత్తా అల్లుళ్ళ ఫార్ములా. ఈ రెండూ కలగలిపి తీయాలనుకోవడమే అసలు సమస్యగా మారింది. ఇంకా ఈ రోజుల్లో ఈ అత్తా  అల్లుళ్ళ ఫార్ములా కాలం చెల్లిన వ్యవహారం. నాగార్జున ఇవి నటించేశారు. మళ్ళీ ఆయన కుమారుణ్ణి అలాటి సినిమాలో అలాటి పాత్రలో చూపించాలని మారుతి ఉత్సాహపడి వుంటే, ఆ పురాతన కథని రీసైక్లింగ్ చేయకుండా, ఇప్పటి కాలానికి తగ్గట్టు రీబూట్ చేసి వుండాల్సింది. అప్పటి నాగార్జున కథలకి నాగార్జున ఫ్యాన్స్ వేరు, ఇప్పటి నాగ చైతన్య కథలకి నాగచైతన్య ఫ్యాన్స్ వేరు. అలా రీబూట్ తో అప్డేట్ చేయకుండా బద్దకించడం వల్ల,  ఇగో అంశం – అత్తా అల్లుళ్ళ ఫార్ములా రెండూ జతకలవని కాడెద్దుల్లా పుంజాలు తెంపుకుని పారిపోయాయి. 

 ఎవరెలా చేశారు.

          ‘భలే భలే మగాడివోయ్’ లో నాని లాగానో,  ‘మహానుభావుడు’లో శర్వానంద్ లాగానో చేయలేదు నాగచైతన్య. ఎందుకంటే ఆ సినిమాల్లో వాళ్ళ పాత్రలకున్న మానసిక సమస్యలు ఇక్కడ తన పాత్రకి లేవు. ‘ఇగో’ అనే మానసిక సమస్య దారితప్పి ఇతర పాత్రలకి చేరిపోయింది. నాగ చైతన్య పాత్ర ఇక ఆ పాత్రలకి ప్రవచనాలు చెప్పుకుంటూ తిరగడమే సరిపోయింది. చాలా సిల్లీగా చేశారు ప్రధానపాత్ర చిత్రణ. సింపుల్ గా ఇగో సమస్యని ప్రధాన పాత్ర (నాగ చైతన్య) – ప్రత్యర్ధి పాత్ర (రమ్య కృష్ణ) లకి మాత్రమే కల్పించి, ఇద్దరి మధ్యా అత్తా అల్లుళ్ళ హిలేరియస్ కామెడీని వర్కౌట్ చేసి వుంటే మారుతి మోజు తీరిపోయేది. 

          పాత అత్తా అల్లుళ్ళ సినిమాల్లో ఎంత హుషారైన డ్రామాలు, డైనమిక్సు వుండేవి… ఇందులో ఇవేవీ లేవు. నాగచైతన్య పాత్రకి నీరసమే ఎక్కువ. చాలా సార్లు నాగచైతన్య ని మిడ్ ఫ్రేం లో పెట్టి, మిడ్ షాట్లు తీసిన పూర్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ ఇంకో పక్క. తండ్రి నాగార్జున బాటలో నాగ చైతన్య తొలి సినిమా ‘జోష్’ ని  ఇంకో ‘శివ’ లాగా తీయబోయి అట్టర్ ఫ్లాప్ అయిన అనుభవముండగా, నాగార్జున ఇంకో ఫార్ములాని నాగచైతన్య నటించాలనుకోవడం అత్యాశే. ‘సోగ్గాడే చిన్ని నాయన’ తో నాగార్జున అక్కినేని నాగేశ్వర రావులాగా దసరాబుల్లోడిగా దుమ్ము రేగ్గొట్టి సూపర్ డూపర్ హిట్ చేశారు. నాగార్జునలో వున్న డైనమిక్స్ నాగచైతన్యకి లేనప్పుడు ఇలాటి సాహసాలు వృధా.  

          నాగచైతన్య చేయడానికి కామెడీ కూడా లేదు. ఎందుకంటే పైన చెప్పుకున్న నాని పాత్రకి లాగా, శర్వానంద్ పాత్రకి లాగా సమస్య తనకి లేదు. కామెడీని పక్క పాత్రలు వెన్నెల కిషోర్, పృథ్వీలు చేసుకోవాల్సి వచ్చింది. వీళ్ళ మీద మళ్ళీ చూపించింది కూడా ప్రాణిక్ హీల్ చికిత్స పేరుతో చీప్ టాయిలెట్ కామెడీయే. 

          హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ స్థానంలో ఇంకో హీరోయిన్ వుండాల్సింది. ఈమెకి బిగ్ మూవీస్ లో మెయిన్ హీరోయిన్ స్థాయి లేదు. రమ్యకృష్ణ ఇలాటి పాత్రలు, నటనలు ఎప్పుడో చేసేశారు. కొత్తగా ఏమీ లేదు. ఇతర పాత్ర ధారులూ సోసో.

          పాటలు చూస్తున్నంత సేపూ బాగానే అన్పిస్తాయి. పాటల రచయితలు, సంగీత దర్శకులు, గాయనీగాయకులూ వాళ్ళ కళల్ని  శ్రమకోర్చి ప్రదర్శిస్తారు బాగానే వుంటుంది. అదంతా సరుకులేని సినిమా వల్ల బూడిదలో పోసిన పన్నీరవుతుంది. పాటలకి ముందు, పాటలకి తర్వాతా వచ్చే మొత్తం కథా కథనాలూ ఓపికని పరీక్షిస్తూ వెలవెల బోతూంటాయి. కెమెరా వర్క్ బావుండాలంటే దర్శకుడి విజన్ బావుండాలి. అప్డేట్ అవని స్క్రిప్టుకి అప్డేట్ అవని విజనే ఇక్కడ కన్పిస్తుంది. 

చివరికేమిటి 

         ఇది ఫ్లాపయితే కాదు, అలాగని హిట్ కూడా అన్పించుకోదు. దర్శకుడు మారుతి, వెంకటేష్ తో తీసిన ‘బాబుబంగారం’ అనే పాత మూస ఫ్లాప్ ప్రమాణాలెలా వున్నాయో, అంతకి మించి ఇంప్రూవ్ ఏమీ కాలేదాయన. మారుతి డైరెక్షన్ అంటే ఇక భయపడాలేమో. రైటింగ్ నానాటికీ తీసికట్టే. టెంప్లెట్ లో పెట్టి ఈజీ స్క్రీన్ ప్లే లాగించేశారు. ఇంకెన్ని సినిమాల్లో ఇలా ఫస్టాఫ్ అంతా లవ్ ట్రాకులే చూపిస్తారు. తెలుగు సినిమా చూద్దామని కూర్చుంటే, లవ్ ట్రాకులే ఫస్టాఫ్ అంతా భరిస్తూ వుండాలా? అవేమైనా యూత్ కి కనెక్ట్ అవుతున్నాయా అంటే యూత్ టేస్టే తెలీని రాత తీతలు. 

          కాలం చెల్లిపోయి ఫ్లాపులు ఎదుర్కొంటున్న పూరీ జగన్నాథ్ టెంప్లెట్ లాగే, ఫస్టాఫ్ లవ్ ట్రాక్ వేసి, ఇంటర్వెల్లో విలన్ (రమ్యకృష్ణ) ని రప్పించే బాపతు కథనమే మళ్ళీ చేశారు. విచిత్రమేమిటంటే, ఇంటర్వెల్లో నాగచైతన్య నుంచి హీరోయిన్ ని విడిపించుకు వెళ్ళిపోయే రమ్యకృష్ణ తమ్ముడి పాత్ర, ఆ తర్వాత వరంగల్లో రమ్యకృష్ణ ఇంట్లో కన్పించదు. నాగ చైతన్య రమ్యకృష్ణకి తెలీని కొత్త వ్యక్తిలా ఆమె ఇంట్లోకి ప్రవేశిస్తాడు. రమ్యకృష్ణ తన కూతుర్ని హైదరాబాద్ లో ఎంగేజిమెంట్ చేసుకోబోయిందెవరో తమ్ముడి ద్వారా తెలుసుకోనే లేదా?

          ఫస్టాఫ్ ఓ మాదిరిగా ఎలాగో లాక్కొచ్చినా సెకండాఫ్ లో విషయం లేదు. కారణం ఇగోలు  వుండాల్సిన పాత్రల మధ్య వుండకపోవడమే. ఉన్న ఇగోలకి కూడా సరైన రూట్స్ వుండవు. పదేపదే ఇగోలున్నాయని డైలాగుల్లో చెప్పుకోవడమే. ఇక తల్లీ కూతుళ్ళ మధ్య ఇగోల వల్ల ఐదేళ్లుగా మాటల్లేక పోవడానికి కారణమైన సంఘటన కూడా ఒప్పించేదిగా లేదు. 

          ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ హిట్టయినప్పుడు రచయిత వక్కంతం వంశీ ఒక కొటేషన్ చెప్పారు. సినిమా కథలు పైపైన రాసేసి తీయయడం వల్ల ఫ్లాపవుతున్నయనీ, అలాకాకుండా ‘టెంపర్’ స్క్రిప్టుని డెప్త్ తో రాశామని. ఇది తర్వాతి సినిమాలకి ఆయనే పాటించలేదు అది వేరే విషయం. కానీ కొటేషన్ మాత్రం మారుతికి వర్తించేలా సజీవంగా వుంది. యువదర్శకుడిగా ఇంకా ఇలాటి పాత మూ(మో) స కథల్ని పైపైన రాసేసి తీసేసే భావజాలం లోంచి అత్యవసరంగా అయన బయటపడక పోతే ఇక  కష్టం.

‘శైలజా రెడ్డి అల్లుడు’ 
రచన – దర్శకత్వం : మారుతి 
తారాగణం : నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, నరేష్, పృథ్వీ, వెన్నెల కిషోర్ తదితరులు  
సంగీతం : గోపీ సుందర్, ఛాయాగ్రహణం : నిజర్ షఫీ, 
బ్యానర్ : సితారా ఎంటర్ టైన్మెంట్స్ 
నిర్మాతలు : రాధాకృష్ణ, నాగావంశీ, ప్రసాద్ 
విడుదల : సెప్టెంబర్ 13, 2018
2.5 / 5

దారితప్పిన అల్లుడు 

―సికిందర్