దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, ఏపీ ప్రస్తుత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైయ్యారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ముఖ్యనేతలతో పాటు పలు జిల్లాల నేతలతో సమావేశమవుతూ రంగప్రవేశానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నిన్న జరిగిన ఒక మీడియా సమావేశంలో తొలిసారిగా తన అన్న జగన్ మీద సంచలన కామెంట్స్ చేసి ఆశ్చర్యపరిచారు.
మీడియాతో మాట్లాడుతూ… జగన్ మీకు పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించగా… ఆ విషయం ఆయననే అడగాలని షర్మిల కామెంట్ చేశారు. పార్టీ పెట్టడం తన అన్న జగన్‌కు ఇష్టం లేదని ఆమె కుండబద్దలు కొట్టారు. అయినా మా అనుబంధాల్లో ఎలాంటి తేడాలు ఉండవని షర్మిల స్పష్టం చేశారు. తనకు తల్లి విజయమ్మ మద్దతు ఉందని చెప్పారు. ఆమె ఆశీర్వాదంతో పార్టీ పెట్టి.. ముందుకు సాగుతున్నానని తెలియజేశారు. ఎవరీ సపోర్ట్ ఉన్నా లేకున్నా.. తాను ముందుకెళతానని చెప్పారు.
అదేవిధంగా లోటస్ పాండ్‌లో విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ నాయకురాలు విజయశాంతిలు తెలంగాణ వాళ్లేనా? అని ప్రశ్నించారు. తాను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే అని షర్మిల చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత అమరవీరుల ఆశయాలు నెరవేరాయా? తెలంగాణ ప్రజల కష్టాలు తీరాయా? అని అడిగారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ రాష్ట్రంలో గడపగడపకూ వెళ్లి వస్తానని చెప్పారు. త్వరలోనే పార్టీ పేరును ప్రకటిస్తానని చెప్పారు. అయితే ముహూర్తపు తేదీగా మే 14 లేక జులై 9 అన్నది మీరే చెప్పాలంటూ విద్యార్థులను ఆమె అడిగారు. రైతు సమస్యలపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్తామని తెలిపారు.