ప్రేమించి పెళ్లి చేసుకొని ఏకగ్రీవ సర్పంచ్ అయింది

దేనికైనా అదృష్టం ఉండాలి. తినే మెతుకుపైన కూడా రాసి పెట్టి ఉండాలి అని పెద్దలు ఊకనే అనలేదు. ప్రేమను నమ్మి వచ్చిన అమ్మాయికి జాక్ పాట్ దక్కింది. ఏకంగా గ్రామ సర్పంచ్ పీఠం ఎక్కే అదృష్టం వచ్చింది. ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఆ గ్రామం ఎస్టీ సర్పంచ్ రిజర్వ్ అయ్యింది. ఆ గ్రామంలో ఒక్క ఎస్టీ కుటుంబం కూడా లేకపోవడంతో ఆ యువతిని అదృష్టం వరించింది.

జనగాం జిల్లా అంక్షాపూర్ గ్రామానికి చెందిన బానోతున సోమ్లా, లక్ష్మీల కూతురు లల్లి. గత సంవత్సరం వేములవాడ రాజన్న దర్శనానికి పోగా అక్కడ కోటగడ్డ గ్రామానికి చెందిన ననుబోతుల రాజ్ కుమార్ తో లల్లికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో గతేడాది మార్చి 23న పెళ్లి చేసుకున్నారు. ప్రియుడిని నమ్మి వచ్చి కోటగడ్డలో ఓ పూరి గుడిసెలో కాపురం పెట్టారు. ఇదే సమయంలో కోటగడ్డ నూతన పంచాయతీగా ఎన్నికై ఎస్టీ రిజర్వ్ అయ్యింది. ఆ గ్రామంలో ఎస్టీలు ఎవరూ లేరు. లల్లి మాత్రమే ఎస్టీ. దీంతో లల్లి ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నిక కానుంది. గతంలో కోటగడ్డ లక్నవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. 

కోటగడ్డ ఏజెన్సీ  గ్రామపంచాయతీ కావడంతో గ్రామంలో మొత్తం  ఆరు వార్డులకు గాను మూడు వార్డులను ఎస్టీలకు కేటాయించారు. గ్రామంలో ఎస్టీలు లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారులు రిజర్వేషన్లు మారుస్తారా లేక ఏం చేస్తారా అని చర్చ జరుగుతోంది

ప్రేమ కొందరి జీవితాల్లో విషాదం నింపితే వీరి జీవితంలో మాత్రం ఆనందం నింపింది. నమ్మి వచ్చినందుకు భర్త తనను ప్రాణంగా చూసుకుంటున్నాడని ఇంతలోనే అనుకోకుండా సర్పంచ్ పీఠం ఎక్కే అదృష్టం వచ్చిందని లల్లి ఆనందం వ్యక్తం చేసింది. గ్రామ పెద్దల సహాకారంతో గ్రామ అభివృద్ది చేస్తానని లల్లి మీడియాకు తెలిపింది. 

లల్లి కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. రాజ్ కుమార్ తల్లి కూడా వీరి పెళ్లిని వ్యతిరేకించింది. అయినా పెద్దలను వ్యతిరేకించి వారు పెళ్లి చేసుకున్నారు. పూరి గుడిసెలో కాపురం పెట్టారు. లల్లి పదో తరగతి వరకే చదువుకుంది. గ్రామం ఎస్టీకి రిజర్వ్ కావడంతో గ్రామ పెద్దలంతా కలిసి ఆమె వద్దకు వెళ్లారు. ఎస్టీగా ఉన్నందున ఏకగ్రీవంగా ఎన్నికయ్యావని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. 

ఏకగ్రీవ గ్రామాలకు తెలంగాణ ప్రభుత్వం 25 లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. దీంతో ఈ గ్రామానికి కూడా నజరానా దక్కుతుందని నజరానాతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్ తో గ్రామాన్ని అభివృద్ది చేస్తానని ఆమె అన్నారు. గ్రామ సర్పంచ్ గా ఎన్నికవుతానని కలలో కూడా అనుకోలేదన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లల్లి మీడియాతో అన్నారు. ఇదే స్పూర్తితో దూర విద్య ద్వారా పై చదువులు కూడా కొనసాగిస్తానని తెలిపారు. చిన్న వయసులోనే సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించే అదృష్టం రావడంతో లల్లి ఆనందం వ్యక్తం చేశారు.