తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ పేరును టీ.ఆర్.ఎస్ నుంచి బీ.ఆర్.ఎస్ గా మార్చేశారు. భారత్ రాష్ట్ర సమితి పేరుతో ఏర్పాటైన ఈ పార్టీతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీల సహకారంతో కేసీఆర్ ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ పేరు మార్పుకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇప్పటికే అనుమతులు లభించిన సంగతి తెలిసిందే.
ఈరోజు మధ్యాహ్నం 1.20 గంటలకు ఈసీ పంపిన లేఖకు అంగీకారం తెలుపుతూ కేసీఆర్ సంతకం చేశారు. భారాస ఆవిర్భావం నేపథ్యంలో ప్రజల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. అనుకున్నది సాధించే వరకు కేసీఆర్ వదిలిపెట్టరనే సంగతి తెలిసిందే. పీఎం అవ్వాలనే కలను కేసీఆర్ నెరవేర్చుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. కేసీఆర్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
కేసీఆర్ నిజంగా పీఎం అయ్యే అవకాశం ఉంటే ఏపీ నుంచి కూడా సహాయసహకారాలు అందుతాయి. కేసీఆర్, జగన్ మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. అయితే జెండాలో కారు కనిపించకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. పార్టీ గుర్తు మారే అవకాశం ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ పార్టీ పేరు వివాదంలో చిక్కుకుందని సమాచారం.
తాను ముందుగా తన పార్టీ పేరును భారతీయ రాష్ట్ర సమితిగా మార్చాలని ఈసీని సంప్రదించానని అయితే తన పార్టీ పేరు మార్పుకు అంగీకరించని ఈసీ కేసీఆర్ పార్టీ పేరు మార్పుకు ఏ విధంగా అంగీకరించిందని ప్రేమ్ నాయక్ అనే వ్యక్తి కామెంట్లు చేశారు. పేరు విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని ఆ వ్యక్తి చెప్పుకొచ్చారు.