అవును. మీరు చదివిన హెడ్డింగ్ నిజమే. తెలంగాణ ప్రభుత్వంలో కొందరు అధికారులు చేసిన నిర్వాకం ఇది. వారి చర్యల వల్ల భార్య, పిలగాడు ఒక్కరే ఉన్నా ఆమె భర్తలు మాత్రం ఇద్దరు అన్నట్లు వ్యవహారం మారిపోయింది. అంతేకాదు ఇంగ్లీష్ భర్త ఒకరైతే తెలుగు భర్త మరొకరు. ఇంతకూ అసలు కథేంటో చదవండి కింద.
తెలంగాణ ప్రభుత్వం ఆకాశమే హద్దుగా పత్రికలకు ప్రకటనలు జారీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కదా. అయితే ఈ యాడ్స్ ఇచ్చే క్రమంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా గందరగోళం నెలకొంది. తాజాగా తెలంగాణ సర్కారు రెండు పథకాల గురించి ఫ్రంట్ పేజీ యాడ్స్ ఇచ్చింది. ఆ యాడ్స్ లో భాగంగా ముగ్గురు ఫొటో దర్శనమిస్తుంది. అందులో ఒకరు భర్త, మరొకరు భార్య, వారి కొడుకు. మొత్తం ముగ్గురు వీరు తెలంగాణ సర్కారు చేపట్టిన పథకాలతో ఆనందంగా జీవిస్తున్నారన్నది యాడ్ ఉద్దేశం.
ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ముగ్గురు ఫొటోలు బాగానే ఉన్నాయి కానీ ఒక ఫొటోలో భార్య, పిలగాడు సేమ్ ఉన్నారు కానీ భర్త స్థానంలో ఇంకో మనిషి ఫొటో పెట్టారు. తెలగు పత్రికలకు ఇచ్చిన కంటి వెలుగు యాడ్ లో ఒక భర్త దర్శనమిస్తే, ఇంగ్లీష్ పత్రికలకు ఇచ్చిన రైతు బీమా యాడ్ లో ఇంకో భర్త దర్శనమిచ్చాడు. ఇదేం నిర్వాకం నాయనా అని ఈ రెండు యాడ్స్ చూసిన జనాలు నెత్తి నోరు కొటటుకుంటున్నారు. తెలంగాణ సర్కారు పథకాలు ఎంత బాగుంటే మాత్రం ఇలా ఒక్క భార్య, ఒక పిలగాడు ఇద్దరు భర్తలు అన్నట్లు యాడ్స్ ఇచ్చుడేంది అని జనాలు ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న వివాదం :
తెలంగాణ సర్కారు కోట్లాది రూపాయల ప్రజా ధనం ఖర్చు చేసి భారీ పత్రికా ప్రకటనలు జారీ చేయడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు జనాల సొమ్ము మంచినీళ్లలా ఖర్చు చేయడంతోపాటు మరోవైపు అడ్డగోలు ఫొటోలు యాడ్స్ కోసం ఇవ్వడం పై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా భర్తల ఫొటోల మార్పు విషయమై సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ గా మారింది. ఆ పోస్టు కింద ఉంది చూడండి.