తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థంకావడం లేదు. పార్టీని బలోపేతం చేయడం ఎలా అనే అంశంపై ఫోకస్ పెట్టడం కంటే… తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఎవరిని ఎంపిక చేయాలనే దానిపైనే ఆ పార్టీ నాయకత్వం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ పదవి ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఖాయమైందనే ప్రచారం చాలాకాలంగా సాగుతోంది.
దీనిపై త్వరలోనే ప్రకటన ఉంటుందని వాదన కూడా మొదలైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళతారనే ప్రచారం నేపథ్యంలో ఆయన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ పదవిపై ఆశలు వదులుకోవాల్సిందే అనే ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తనకు టీపీసీసీ చీఫ్ పదవి కంటే కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు ఇస్తేనే బాగుంటుందని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పడం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. అయితే టీపీసీసీ చీఫ్ రేసులో ఉన్న రేవంత్ రెడ్డి ఉన్నట్టుండి తనకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు మాత్రం చాలని వ్యాఖ్యానించడంపై అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వెనుక కాంగ్రెస్ అధిష్టానం ఉందనే చర్చ మొదలైంది.