టిఆర్ఎస్ మాజీ డిప్యూటీ సిఎం రాజయ్యకు షాక్ మీద షాక్

ఆయన ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు. తెలంగాణ రాగానే తొలి ఉపముఖ్యమంత్రిగా చాన్స్ కొట్టేశారు. కారణమేంటో తెల్వదు.. నిజాలేంటో బయటకు రాలేదు. కానీ ఒక్కసారిగా వెలుగు జిలుగుల నుంచి చీకట్లోకి జారిపోయారు. ఇప్పుడు ఆయన చుట్టూ వివాదాలు, ఆయన వ్యవహారంపై విమర్శలు, ప్రజా జీవితంలో ఓడిపోయే దశలో ఉన్నారా నాయకుడు. ఇంతకూ ఎవరా నాయకుడు అనుకుంటున్నారా? ఆయనే తెలంగాణ మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య. ఆయనకు ఇప్పుడు షాక్ మీద షాక్ తగులుతూ ఉన్నది. ఆ వివరాలు చదవండి.

తెలంగాణ రాకముందే డాక్టర్ తాటికొండ రాజయ్య టిఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్య టిఆర్ఎస్ లో చేరగానే తన పదవికి రాజీనామా చేశారు.  తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు దగ్గరుండి మరీ గెలిపించారు. తర్వాత 2014 ఎన్నికల్లో తాటికొండ రాజయ్య మళ్లీ పోటీ చేసి కడియం గెలిచారు. వెనువెంటనే తెలంగాణ ఉపముఖ్యమంత్రిగా అదృష్టం కలిసొచ్చింది. 

ఏమైందో ఏమో, ఆయన అవినీతి చేశారా? అక్రమాలు చేశారా? తెలంగాణ సర్కారుకు తలవొంపులు తెచ్చారా? కారణాలు వెల్లడి కాలేదు. రహస్యంగానే ఉన్నాయి. కానీ ఒకరోజు తాటికొండ రాజయ్యను అవమానకరంగా ఉఫముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. దానికి కారణమేంటో ఇప్పటి వరకు ఆయన వెల్లడించలేదు. ఆయనను పదవి నుంచి తొలగించిన కేసిఆర్ వెల్లడించలేదు. అలా ఆయన స్థానంలో కడియం శ్రీహరిని ఉపముఖ్యమంత్రిగా నియమించారు కేసిఆర్. 

 

స్టేషన్ ఘన్పూర్ లో కడియం ను గృహ నిర్బంధం చేసిన అభిమానులు, అనుచరులు

కడియం శ్రీహరి ఎమ్మెల్సీ కోటాలో ఉన్నారు. ఆయన పదవి మరో మూడేళ్లు ఉంది. కానీ కడియంకు మనసులో ఎక్కడో పీకుతున్నది. ఎమ్మెల్సీ పదవితోటి ఉపముఖ్యమంత్రిగా ఉండుడేంది? ప్రజా బలం ఉన్న లీడర్ గా ప్రజల్లోంచి గెలిచి ఉపముఖ్యమంత్రి అయితే గౌరవం దక్కుతుంది అని కడియం ఆలోచన చేస్తున్నారు. తనకు సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని ఇచ్చిన స్టేషన్ ఘన్పూర్ లోనే పోటీ చేయాలని కడియం శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే కడియం వర్గం నేతలు తాటికొండ రాజయ్యకు సహకరించేది లేదని తేల్చి చెప్పారు. కడియం మళ్లీ పోటీ చేయాలంటూ ఆయన ఇంటిని చుట్టు ముట్టి దిగ్బంధించారు. తాటికొండ రాజయ్య అవినీతి అక్రమాలను సహించలేమని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే స్టేషన ఘన్పూర్ లోని ప్రతి మండలంలో ఇదే వాతావరణం నెలకొంది. కడియం రాజయ్య పంచాయితి అధిష్టానం పెద్ద అయిన కేటిఆర్ వద్దకు చేరింది. కడియం వర్గం అంతా హైదరాబాద్ వచ్చింది. కానీ రాజయ్య పేరు ఖరారు చేశాము. మార్చే ప్రసక్తే లేదని కేటిఆర్ తేల్చి చెప్పారు. కడియం వర్గం అసంతృప్తితోనే వెనుదిరిగింది.

 

అయితే అధిష్టానంకు తడాఖా చూపించాలని కడియం వర్గం భావిస్తున్నది. అందుకే రాజయ్య ను మెసలనీయకుండా అడ్డుకట్టలు వేస్తూనే ఉన్నది కడియం వర్గం. తాము ఎంతగా నెత్తి నోరు కొట్టుకున్నా, రాజయ్యను మార్చే ప్రసక్తే లేదని అధిష్టానం తెగేసి చెప్పడంతో అధిష్టానంపై కడియం వర్గం తిరుగుబాటు చేసింది. ప్రతి మండలంలో ఉన్న నాయకులంతా రాజయ్యకు సహాయ నిరాకరణ మొదలు పెట్టారు. తాడోపేడో తేల్చుకునుడే అని డిసైడ్ అయ్యారు. రాజయ్యను మారిస్తే మంచిది… మార్చకపోతే తమ దారి తాము చూసుకుంటామని టిఆర్ఎస్ హైకమాండ్ కు వార్నింగ్ ఇచ్చారు.

రాజకీయ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న డాక్టర్ కడియం కావ్య

శనివారం రాంపూర్ శివారులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయం తేల్చి చెప్పారు. ఈ మీడియా సమావేశంలో కడియం వర్గానికి చెందిన వారు స్టేషన్ ఘన్పూర్ ఎంపిపి జగన్మోహన్ రెడ్డి, జెడ్పీటిసి స్వామినాయక్, రఘునాథఫల్లి ఎంపిపి అనిత తో పాటు ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తామంతా టిఆర్ఎస్ లో ఉంటూనే రాజయ్యకు వ్యతిరేకంగా పనిచేస్తామన్నారు. చివరి వరకు రాజయ్య మార్పు కోసం ప్రయత్నం చేస్తామన్నారు. లాస్టుకు బి ఫాం వచ్చే వరకు కూడా ప్రయత్నం చేసి అయినా రాజయ్యకే బి ఫాం వస్తే తమ దారి తాము చూసుకుంటామన్నారు. అప్పటి వరకు బరిలో ఎవరెవరు ఉన్నారో చూసుకుని ఎవరినో ఒకరిని ఎంపిక చేసుకుని వారికి మద్దతు ఇస్తామన్నారు. (వారి స్టేట్ మెంట్ సాక్షి దినపత్రికలో వచ్చింది. ఆ క్లిప్పింగ్ పైన ఉంది చూడొచ్చు).

అయితే సీటైతే ఎట్లోగట్ట సంపాదించిన రాజయ్య తన భవిష్యత్తు ప్రమాదంలో పడిందని తెలుసుకున్న తర్వాత కడియం శ్రీహరికి పాదాభివందనం చేసి సహకరించాలని కోరుకున్నారు. అంతేకాదు కేటిఆర్ తో జరిగిన మీటింగ్ లో కూడా గతంలో తాను చేసిన అన్ని తప్పులకు బహిరంగ క్షమాపణ చెప్పుకుంటున్నాని, ఎలాగైనా ఈసారి తనను గెలిపించాలని వేడుకున్నారు. అంతేకాకుండా ఒక సభలో తనకు అయిన వాళ్లే అన్యాయం చేశారని బోరున ఏడుస్తూ కంటతడి పెట్టారు. ఆయనతోపాటు జనగామ నేత ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా ఏడ్చారు. 

 

కడియం కు రాజయ్య పాదాభివందనం

 

దయచేసి నన్ను గెలిపించండి అని వేడుకుంటున్న డాక్టర్ రాజయ్య

తాజా పరిస్థితి చూస్తే టిఆర్ఎస్ అధిష్టానం మీద వత్తిడి తీవ్రమవుతున్నది. రాజయ్యను మార్చి కడియం ను కానీ, కడియం కూతురు డాక్టర్ కావ్యను కానీ అభ్యర్థిగా బరిలోకి దింపడమా? లేక వారి ఒత్తిడికి తలొగ్గకుండా అసమ్మతి రాజేసిన వారందరిపై వేటు వేయడమా అన్నది టిఆర్ఎస్ నాయకత్వం ముందున్న దారులు. మరి ఇప్పటికే నల్లగొండ జిల్లాలోని మునుగోడులో వెలమ సామాజికవర్గానికి చెందిన అసమ్మతి నేత వేనేపల్లి వెంకటేశ్వరరావు మీద వేటు వేసింది పార్టీ నాయకత్వం. ఇక్కడ కూడా అదే బాట పడతారా? లేక అక్కడ డిప్యూటీ సిఎం కడియం ఉన్నాడు కాబట్టి రాజయ్యను పక్కకు తప్పిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది.