తెలంగాణలో టిఆర్ఎస్ పాలన పై కాంగ్రెస్ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. లక్డీ కాపూల్ లో ఓ హస్పిటల్ పై దాడి ఘటన పై ఆమె స్పందించారు. అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉందా అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో గుండాల రాజ్యం నడుస్తుందని అయినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఇంకా విజయశాంతి ఏమన్నారో ఆమె మాటల్లోనే…
“తెలంగాణలో యథా రాజా.. తథా ప్రజా అన్న చందంగా ప్రజాస్వామ్య పరిస్థితి ఉంది. సీఎం కేసీఆర్ అరాచకంగా కాంగ్రెస్ తరపును గెలిచిన ఎమ్మెల్సీలను టిఆర్ఎస్ లో కలుపుకొని దౌర్జాన్యాన్ని చేస్తున్నారు. ఆయన దౌర్జన్యాన్ని ఆసరాగా చేసుకొని కొంత మంది దుండగులు ఓ ప్రైవేటు ఆస్పత్రిపై దాడికి పాల్పడ్డారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న వారిని అడ్డుకున్న పోలీసుల పై కూడా వారు దురుసుగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డారు. దీనిని యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించింది.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో ఇటువంటి దారుణాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందోనని తెలంగాణ ప్రజలు ఒణికిపోతున్నారు. ఉద్యమ సమయంలో ఎంతో సంయమనంతో వ్యవహరించిన తెలంగాణలో ఇటువంటి అరాచకాలను ఎవరూ సహించరు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మేలుకోవాలి. మళ్లీ ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో శాంతి భద్రతల సమస్య ఉంది. ప్రభుత్వం వెంటనే దీనిని పరిష్కరించాలి. మళ్లీ అరాచకాలు జరగకుండా చూడాలి.” అని విజయశాంతి డిమాండ్ చేశారు.