తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాలు

తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త జిల్లాలు కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించి నెలరోజుల పాటు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 9 మండలాలను విభజిస్తూ ములుగు జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. ములుగు, ,వెంకటాపూర్, గోవిందరావు పేట, తాడ్వాయి, ఏటూరు నాగారం, కన్నాయగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాలుగా కొత్త జిల్లా ములుగు ఏర్పడనుంది.

మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణ పేట కూడా జిల్లాగా ఏర్పడుతుంది. నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూరు, ఉట్కూరు, నర్వ, మాగనూరు, మక్తల్, కృష్ణ, కోయిలకొండ మండలాలుగా నారాయణపేట జిల్లా ఏర్పడబోతుంది.

మరో రెండు రెవిన్యూ డివిజన్లు, కొత్తమండలాల ఏర్పాటు పై కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనగామ జిల్లా నుంచి గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాకు మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. డివిజన్లు, మండలాలు, జిల్లాల ఏర్పాటు పై జనవరి 30 వరకు అభ్యంతరాలు స్వీకరించి ఆ తర్వాత 15 రోజుల్లో వాటిని పరిశీలించి తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రెండు కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 33 కు చేరనుంది.