ఆయనను కేసిఆర్ వద్దన్నా హరీష్ రావే బిగబట్టిండట

మెదక్ జిల్లాలో మామా అల్లుళ్లు కేసిఆర్, హరీష్ రావు టిఆర్ఎస్ బలోపేతానికి సీరియస్ గా వ్యూహరచన చేస్తున్నారు. కేసిఆర్ తెలంగాణ అంతటికి స్టార్ క్యాంపెయినర్ అయితే హరీష్ రావు గజ్వేల్ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తున్నారు. గజ్వేల్ తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా బాధ్యతలన్నీ హరీష్ రావే చూస్తున్నారు. దాంతోపాటు దక్షిణ తెలంగాణలోని పాలమూరు జిల్లా కూడా హరీష్ రావుదే అని పార్టీ వర్గాల టాక్.

ఈ పరిస్థితుల్లో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ తూంకుంట నర్సారెడ్డి విషయంలో మాత్రం వీరిద్దరు వేరువేరు ఆలోచనలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తూంకుంట నర్సారెడ్డికి రోడ్డు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆయన వ్యవహార శైలి మారిపోయిందని కేసిఆర్ పసిగట్టారు. ఆ తర్వాత పిసిసి ఉత్తమ్ సహా గజ్వేల్ లో టిడిపి నుంచి కాంగ్రెస్ లో చేరిన వంటేరు ప్రతాపరెడ్డి నర్సారెడ్డి ఇంటికి పోయి పరామర్శించారు. 

అంతేకాకుండా పలుమార్లు నర్సారెడ్డి ఉత్తమ్ ను కలిసినట్లు తెలుస్తోంది. ఇక మాజీ మెదక్ ఎంపి, ప్రస్తుత కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ అయిన సినీ నటి విజయశాంతిని కూడా గజ్వేల్ నర్సారెడ్డి కలిశారు. పైగా తాను కలిసినట్లు ఒప్పుకున్నారు కూడా. కానీ తాను టిఆర్ఎస్ లోనే కొనసాగుతానని నర్సారెడ్డి వివరణ ఇచ్చారు. దీన్నిబట్టి నర్సారెడ్డి రెండు పడవల్లో కాళ్లు పెట్టాడన్న చర్చ జరిగింది. అయితే టిఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ అన్నట్లు ఆయన వ్యవహర శైలి ఉందని టిఆర్ఎస్ పెద్దలు అంచనాకు వచ్చారు.

హరీష్ అడ్డుకోబట్టే వేటు నిర్ణయం లేటు

నర్సారెడ్డి కాంగ్రెస్ టచ్ లోకి వెళ్లగానే ఇంటెలిజెన్స్ సమాచారం కేసిఆర్ కు అందింది. అప్పుడే నర్సారెడ్డి మీద కేసిఆర్ వేటు వేసే ఆలోచన చేశారని చెబుతున్నారు. అయితే హరీష్ రావే ఆయనపై వేటు వేయకుండా అడ్డుకున్నట్లు హరీష్ కు అత్యంత సన్నిహితుల ద్వారా సమాచారం అందింది. సాధారణంగా హరీష్ రావు స్టయిల్ తెలంగాణలో అందరికంటే డిఫరెంట్ గా ఉంటది. బలమైన నాయకుల నుంచి బలహీనమైన నాయకుల వరకు అందరూ తనచుట్టే ఉండాలన్నది హరీష్ స్ట్రాటజీ. అందుకే నర్సారెడ్డిని బయటకు పంపకుండా కేసిఆర్ ను నిలువరించినట్లు చెబుతున్నారు.

ఇక గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో చాలామంది దిగువ శ్రేణి నేతలు టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. ఆ సమయంలో హరీష్ మీద నమస్తే తెలంగాణ పత్రిక, టి న్యూస్ చానెల్ లో నిషేధం నడుస్తున్న కాలం. ఆ నిషేధానికి కారణాలేమిటో ఇప్పటికీ బయటకు తెలియరాలేదు కానీ ఇప్పుడు ఆ నిషేధం కొంత సడలించినట్లు పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. అయినా కూడా హరీష్ రావు కాంగ్రెస్ గూటికి చేరినోళ్లందరినీ 24 గంటలు గడవకముందే వెనక్కు రప్పించారు. హరీష్ ఆపరేషన్ తో అందరూ సొంతగూటికి చేరారు. 

కాంగ్రెస్ లో చేరిన వీరిని 24 గంటల్లోనే వెనక్కు రప్పించిన హరీష్

అలా టిఆర్ఎస్ నేతల్లో ఎంతగా అసంతృప్తి ఉన్నప్పటికీ వారిని ప్రత్యర్థి పార్టీల్లోకి వెళ్లకుండా హరీష్ నిలువరించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. అందుకే నర్సారెడ్డి కి కాంగ్రెస్ నేతలు టచ్ లోకి రాగానే ఆయన మీద వేటు వేయాలని కేసిఆర్ తలచినా హరీష్ రావు ఆయనను పంపకుండా బిగబట్టినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ ఇక తూంకుంట నర్సారెడ్డి వెళ్లడం ఖాయమని తెలిసిన వెంటనే శుక్రవారం ఉదయం ఆయన మీద వేటు నిర్ణయాన్ని టిఆర్ఎస్ వెల్లడించింది. 

మరి 2014 ఎన్నికల్లో కేసిఆర్ గెలుపు కోసం లోపాయికారి ప్రయత్నాలు చేసిన తూంకుంట నర్సారెడ్డి ఈసారి టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థి ( ఖరారయ్యే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి) వంటేరు ప్రతాపరెడ్డి కోసం పని చేస్తే పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వస్తాయా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో కేసిఆర్ బలం, బలగం ఒకవైపు పనిచేయగా మరోవైపు అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డితో లోపాయికారి ఒప్పందం కారణంగా బొటాబొటిగా 20వేల లోపు మెజార్టీ సాధించి కేసిఆర్ బయట పడ్డారు.

కానీ ఇప్పుడు ఎన్నికలు గతంలో మాదిరిగా ఈజీగా లేని వాతావరణం అయితే గజ్వేల్ లో ఉందంటున్నారు. ఈ పరిస్థితులను కేసిఆర్, హరీష్ రావు తమ చారుర్యంతో మార్చేస్తారా? లేదా అన్నది చూడాలి.