తెలంగాణలో ఉనికిని కాపాడుకునేందుకు టీడీపీ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత చాలా రోజుల పాటు అడ్రస్ లేకుండాపోయిన ఆ పార్టీ మళ్లీ యాక్టివ్ అవుతోంది. హుజూర్‌నగర్, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో అయితే అసలు రాష్ట్రంలో టీడీపీ ఉందా లేదా అన్నట్టుగా వ్యవహరించిన ఆ పార్టీ.. ఇటీవల మళ్లీ గ్రేటర్ ఎన్నికలతో లైన్‌లోకి వచ్చింది. తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోనూ పోటీకి సిద్ధమవుతూ అందర్నీ ఆశ్చర్యపరిస్తుంది.
త్వరలో జరగబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకోవాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అనుకుంటున్నారు. నాగార్జున సాగర్ పార్టీ ఇన్ చార్జి మువ్వా అరుణ్ కుమార్ సాగర్ ఉప ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. పార్టీ అధినాయకత్వం ఆయన పోటీకి పచ్చజెండా ఊపింది. 2014 ఎన్నికల్లో జానారెడ్డికి టీడీపీనే గట్టి పోటీ ఇచ్చింది. తర్వాత పరిస్థితులు మారడంతో టీడీపీ క్యాడర్ నెమ్మదిగా టీఆర్ఎస్ గూటికి చేరింది.
ఈ పరిస్థితుల్లో టీడీపీ బరిలోకి దిగితే ఏం జరుగుతందనేది చర్చ జరుగుతోంది. ఇప్పటికీ టీడీపీ అభిమానులు ఉన్నా.. అవి ఓట్ల రూపంలో వస్తాయా అనేది డౌటే ? కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి పోటీకి సై అంటుండటంతో ఆ ఉప ఎన్నిక రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇంకా సాగర్ ఉప ఎన్నిక బరిలో నిలబడే అభ్యర్థుల ఎంపికలో మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ ఎన్నికల్లోకి ఒక్కసారిగా టీడీపీ దూసుకురావడంతో సాగర్ ఎన్నికల మీద ఆసక్తి అలముకుంది.