గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో బీజేపీ నుండి టీఆర్ఎస్ కు తొలి నుంచి గట్టిగానే పోటీ ఎదురైంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ ప్రభావం ఎంతో కొంత ఈ ఎన్నికలపై కూడా పడుతుందని టీఆర్ఎస్ భావించింది. అనుకున్నట్లుగానే తమకు పట్టున్న కొన్ని ప్రాంతాల్లో బీజేపీ పాగా వేసింది. ప్రధానంగా సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు బీజేపీకి అనుకూలంగా మారుతుండటం టీఆర్ఎస్ ను ఆందోళనలో పడేసే విషయం. ఈ ఎన్నికల్లో కొన్ని సామాజికవర్గాలు టీఆర్ఎస్ కు దూరమయ్యాయంటున్నారు.టీఆర్ఎస్ అభ్యర్థులకి తేలికగా ఏమి విజయం లభించలేదు. బ్రతుకు జీవుడా అంటూ గట్టెక్కారు.
ఐటీ రంగ సంస్థలనున్న గచ్చి బౌలి, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో బీజేపీ పట్టు సాధించింది. మంత్రి కేటీఆర్ కు ఇది కొంత ఇబ్బంది కల్గించే అంశమే. అయితే ఈ ఎన్నికల్లో ప్రధానంగా వరదల ప్రభావం బాగా పనిచేసిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. వరదల సమయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఆ తర్వాత ప్రకటించిన వరద సాయం అందరికీ అందకపోవడం వంటివి ప్రభావం చూపాయంటున్నారు. ఇక పోస్టల్ బ్యాలట్ తీసుకుంటే బీజేపీకే ఎక్కువ ఓట్లు రావడం విశేషం. ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకమయ్యారనడానికి ఇది సంకేతమే.
కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఆయనకు వ్యక్తిగతంగా కొంత ఇమేజ్ తెచ్చిపెడుతుంది. కానీ భవిష్యత్ లో బీజేపీ నుంచి ఇటు నగరంలో కూడా ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని టీఆర్ఎస్ కు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు సూచించాయి. బీజేపీ ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ కు అన్ని విషయాల్లో పోటీ ఇచ్చిందనే చెప్పాలి. ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ వరకూ ఢీ అంటే ఢీ అని తలపడిందనే చెప్పాలి. మొత్తం మీద గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంటుంది.