టిఆర్ఎస్ లో నిప్పుల కుంపటి రాజేసిన డిఎస్.

టిఆర్ఎస్ పార్టీలో నిప్పుల కుంపటి సృష్టించారు రాజ్యసభసభ్యుడు డి శ్రీనివాస్. ఆయన తాజాగా రాసిన బహిరంగ లేఖ టిఆర్ఎస్ ను కలవరపాటుకు గురిచేసింది. ఎప్పుడైతే ఎంపి కవిత డిఎస్ కు వ్యతిరేకంగా జిల్లా నాయకులందరితో కలిసి సిఎం కేసిఆర్ కు లేఖ రాశారో అప్పటి నుంచి డిఎస్ టిఆర్ఎస్ పార్టీకి కొరుకుడు పడని కొయ్యగా మారారు.  పక్కా ప్లాన్ ప్రకారమే డిఎస్ తన కార్యాచరణ చేపడుతూ అధికార పార్టీలో అలజడి రేపుతున్నారు. 

ప్రగతి నివేదన సభా వేదిక మీద డిఎస్ ఎక్కడా కనిపించలేదు. ఆయనకు ఆహ్వానం అందలేదన్న చర్చ ఉంది. ఆహ్వానం లేకపోతే ప్రగతి నివేదన సభకు ఎలా హాజరవుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక టిఆర్ఎస్ లో తనను పొమ్మనలేక పొగ పెడుతున్నారని భావించిన డిఎస్ మెల్లగా పార్టీ నాయకత్వంపై స్వరం పెంచుతున్నారు. అందులో భాగంగానే దశలవారీగా ఆయన యాక్టివిటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో ఊహించని రీతిలో డిఎస్ పెద్ద కొడుకు సంజయ్ నర్సింగ్ కాలేజీ అమ్మాయిలను లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. బాధితులు ఏకంగా హైదరాబాద్ వచ్చి సచివాలయంలో హోంమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. వెంటనే సర్కారు సీరియస్ అయింది. డిఎస్ కొడుకు మీద నిర్భయ కేసులు పెట్టి లోపలేసింది. ఆ సమయంలో డిఎస్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సందర్భం వచ్చే వరకు వేచి చూడాలన్న ధోరణితో ఉన్నాడు. అంతో ఇంతో డిఎస్ చిన్న కొడుకు అయినా సంజయ్ తప్పు చేస్తే కఠినంగా శిక్షించాలంటూ స్పస్టం చేశాడు కానీ డిఎస్ నోరు తెరవలేదు. 

ఇటు డిఎస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఏకంగా సిఎం కూతురే లేఖ రాయడం, మరోవైపు పెద్ద కొడుకు అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేసిన ఆరోపణల మీద జైలుపాలు కావడంతో డిఎస్ ప్రతిష్ట ఉన్నఫలంగా పాతాలంలోకి పడిపోయింది. ఇంత జరిగినా డిఎస్ మీద కేసిఆర్ వేటు వేయలేదు. డిఎస్ విషయంలో నాన్చివేత ధోరణిని అవలంభించారు. అయితే తర్వాత కాలంలో డిఎస్ కేసిఆర్ ను ఢిల్లీలో కలిసినట్లు వార్తలొచ్చాయి. అప్పటి నుంచి కూడా డిఎస్ టిఆర్ఎస్ లో కుంపటి రాజేస్తూనే ఉన్నట్లు టిఆర్ఎస్ భావించింది.

ఇక ఇటీవల డిఎస్ పెద్ద కొడుకు బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చాడు. దీంతో డిఎస్ ఇప్పుడు ఆట మొదలు పెట్టారు. మంగళవారం నిజామాబాద్ లో మీటింగ్ పెట్టి కేసిఆర్ ను ఇరకాటంలోకి నెట్టేలా మాట్లాడారు. ప్రజలకు తన గురించి వివరిస్తూ ఒక బహిరంగలేఖ కూడా రాశారు. తాను మాత్రం రాజ్యసభ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, టిఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేసే సవాల్ లేదని తేల్చి పారేశారు. మీకు దమ్ముంటే నామీద వేటు వేయండి అంటూ చాలెంజ్ చేశారు. ఒకవేళ రాజ్యసభ పదవికి రాజీనామా చేసినా, పార్టీకి రాజీనామా చేసినా తనమీద వచ్చిన ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్లవుతుంది అంటూ మెలిక పెట్టారు.

తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డానో చెప్పాలంటూ కవితకు డిఎస్ సవాల్ చేశారు. తన కొడుకులు స్వతంత్రంగా పెరిగారని అన్నారు. వారు ఏ పార్టీలో ఉండాలన్నది వారే నిర్నయించుకుంటారని అన్నారు. నిజంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డానని సిఎం కేసిఆర్ భావిస్తే  తక్షణమే తన మీద వేటు అయినా వేయాలి లేదంటే కేసిఆర్ కూతురు కవితతోపాటు టిఆర్ఎస్ జిల్లా పార్టీ నేతలు పంపిన లేఖను వెనక్కు తీసుకుని తన పరువు భంగం కలిగించినందుకు బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  డిఎస్ తీరుపై టిఆర్ఎస్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ భగ్గుమన్నారు.