టీఆర్ఎస్ అభ్యర్థిగా తిరిగి పోటీ చేసే అవకాశం దక్కని మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో జితేందర్ రెడ్డి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీలోకి ఆయనను సాదరంగా ఆహ్వానించారు. దీంతో, జితేందర్ రెడ్డి తిరిగి తన సొంతగూటికి చేరినట్టయింది.
కాగా, 1999 లో మహబూబ్ నగర్ నుంచి బీజేపీ తరపున ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన జితేందర్ రెడ్డి, ఆ పార్టీని కూడా వీడి టీఆర్ఎస్ లో చేరారు. 2014లో మహబూబ్ నగర్ నుంచి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం జితేందర్ రెడ్డికి దక్కకపోవడంతో తిరిగి సొంతగూటికే ఆయన చేరడం గమనార్హం. జితేందర్ రెడ్డి బీజేపీలో చేరడంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కీలక పాత్ర పోషించినట్టు సమాచారం.