డిఎస్ కు సిగ్గు, లజ్జ ఉంటే రాజీనామా చేయాలి : బాజిరెడ్డి గోవర్దన్

టిఆర్ఎస్ లో నిప్పుల కుంపట ిరాజేసిన డిశ్రీనివాస్ పై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ భగ్గుమన్నారు. హైదరాబాద్ లోని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తీవ్రమైన మాటలతో డిఎస్ మీద విరుచుకుపడ్డారు బాజిరెడ్డి. ఆయన ఏమన్నారో కింద చదవండి. 

డిఎస్ కు ఏమాత్రం సిగ్గు, లజ్జ ఉంటే టిఆర్ఎస్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్లాలి. తర్వాత ఆయన ఏ పార్టీలో చేరినా అభ్యంతరం లేదు.  డిఎస్ వల్ల టిఆర్ఎస్ పార్టీకి ఈసమంత ప్రయోజనం లేదు. డిఎస్ కొడుకు మీద ఆరోపణలు చేసింది కవిత కాదు, టిఆర్ఎస్ నేతలు కాదు. మహిళా ఉద్యమ నేత సంధ్య. కాంగ్రెస్ హయాంలో డిఎస్ కొడుకు అరాచకాలు వెలుగులోకి రాలేదు. 

రాజ్యసభ సీటు కోసమే డిఎస్ ఆరాటం తప్ప మరొకటి కాదు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే రాజ్యసభ సభ్యుడిగా పదవిని అనుభవించవచ్చని డిఎస్ ఆరాటం. అందుకే నన్ను సస్పెండ్ చేయండి అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. నోరు మూసుకుని డిఎస్ పార్టీ నుంచి వెళ్లిపోవాలి. కేసిఆర్ కాళ్లు పట్టుకుంటేనే డిఎస్ కు రాజ్యసభ పదవి దక్కిందని గుర్తుంచుకోవాలి. తెలంగాణలో డిఎస్ చీడపురుగు లాంటోడు. 

కాంగ్రెస్ తో డిఎస్ టచ్ లో ఉన్నాడు. ఢిల్లీకి వెళ్లి బేరసారాలు చేశాడు. తనకు నాయకత్వం ఇస్తే పార్టీలో చేరతానని అన్నారు. డిఎస్ కు రాజ్యసభసీటు కోసం మేము ఓటు వేశాము. డిఎస్ కు ఓటు వేసిన ఎమ్మెల్యేలమే సస్పెండ్ చేయాలని లేఖ రాశాము. ఇంకా సిగ్గు లేకుండా డిఎస్ లేఖ రాయడం తప్పు.

పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే రాజ్యసభ సీటు దక్కించుకుంటా అన్న దురాశతో తప్ప మరొకటి కాదు. రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటే ఆయనకు గౌరవం దక్కేది. నన్ను సస్పెండ్ చేయండి అన్న మాట స్వార్థం  కోసం తప్ప వేరే లేదు. డిఎస్ కు బాజిరెడ్డి గోవర్దన్ గా నేనే జవాబు చెప్తా. గతంలో నేను నిన్ను చిత్తు చిత్తుగా ఓడించిన వ్యక్తిని నేను. నీ స్థాయికి సిఎం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేనే ఎక్కువ. 

డిఎస్ వల్ల నిజామాబాద్ అభివృద్ధి 20 ఏండ్లు వెనక్కు పోయింది. ఏదో రకంగా బ్లాక్ మెయిల్ చేసి పైరవీలు చేసుకుంటున్నాడు. ఏమాత్రం నీకు సిగ్గు, లజ్జ ఉంటే రాజీనామా  చేసి నీ ఇష్టం వచ్చిన పార్టీలో చేరు. ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు. నీకు కానీ, నీ కొడుకుకు కానీ ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. నీ కొడుకు క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు. శాంకరి కాలేజీలో ఎలంటి అకృత్యాలు జరిగినయో అందరికీ తెలుసు. నీ కొడుకు గురించి నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. నా కొడుకు ప్రతివ్రత అని సిగ్గులేకుండా మాట్లాడకు. ఇప్పటికైనా పశ్చాత్తాపంతో క్షమాపణలు చెప్పు.  టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా ఇంకా మొండికుసి కుసుంట, లేఖలు రాస్తా అంటే నిజామాబాద్ ప్రజలే నీకు తగిన బుద్ధి చెప్పుతారు జాగ్రత్త.