తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్కెచ్ వేశారు. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ తరుపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన నాయకుడు టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇంతకూ ఎవరా ఓడిపోయిన అభ్యర్థి? ఏంటా కథ అనకుంటున్నారా? చదవండి.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2014 ఎన్నికల్లో టిడిపి రెండు స్థానాల్లో గెలిచింది. అందులో కొడంగల్ ఎమ్మెల్యేగా టిడిపి తరుపున రేవంత్ రెడ్డి గెలుపొందారు. ఆయనతోపాటు నారాయణపేట నియోజకవర్గంలో రాజేందర్ రెడ్డి కూడా గెలిచారు. అయితే నాలుగేళ్ల కాలంలో ఆరంభంలోనే బంగారు తెలంగాణ సాధించేందుకు నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి టిడిపికి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరారు. అప్పట్లో ఆయన ఆస్తుల మీద విచారణ జరుగుతున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అంతిమంగా ఆయన టిడిపిని వీడి టిఆర్ఎస్ లో చేరారు.
ఇక రేవంత్ రెడ్డి మాత్రం టిడిపిని వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు. రేవంత్ లక్ష్యం మాత్రం బంగారు తెలంగాణ కాదు. కేసిఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలన్న ఏకైక లక్ష్యంతో రేవంత్ కాంగ్రెస్ గూటికి చేరారు. కానీ కాంగ్రెస్ లో రేవంత్ ఆశించిన రీతిలో పరిస్థితి లేదన్న ప్రచారం సాగుతున్నది. టిడిపిలో పులిలాగ ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత పరిస్థితి అలా లేదన్న చర్చ ఉంది. ఆయనకు ప్రచార కార్యదర్శి పోస్టు ఇస్తామని చెప్పినా ఇంకా రాలేదు. నెలలు గడుస్తున్నా రేవంత్ ను పెవిలియన్ కే పరిమితం చేస్తున్నారని ఆయన అనుచరులు ఆవేదన చెందుతున్నారు.
ఇది ఇలా ఉంటే నారాయణపేటలో అప్పటి టిడిపి అభ్యర్థి రాజేందర్ రెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓటమిపాలైన కుంభం శివకుమార్ రెడ్డి తాజాగా టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఎందుకంటే అక్కడ తన మీద గెలిచిన వ్యక్తి టిఆర్ఎస్ గూటిలో చేరిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లకే సీట్లు ఇస్తామని కేసిఆర్ ఆఫర్ పెట్టారు. ఎలాగైనా తనకు సీటు రాదన్న ఉద్దేశంతో శివకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. ఉత్తమ్ సంప్రదింపులు జరపడంతో ఆయన గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి బుధవారం భారీ సంఖ్యలో అనుచరగణంతో గాంధీభవన్ వచ్చి ఉత్తమ్, రామచంద్ర కుంతియా సమక్షంలోకాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే చదవండి. రేపటితో రాష్ట్రానికి పట్టిన కేసీఆర్ పీడ విరగడవుతుంది. రాష్ట్రంలో అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశాడు. క్రూరంగా అణిచివేశాడు. చెప్పిన ఏ హామీని నెరవేర్చని కేసీఆర్ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు. ఈ ఎన్నికలు టిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య జరుగుతున్న ఎన్నికల పోటీ కాదు, టిఆర్ఎస్ కు రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతున్న పోరు. కేసీఆర్ ను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం వీస్తుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. కార్యకర్తలే పార్టీ కి ఊపిరి .. అధికారంలోకి రాగానే సరైన ప్రాధాన్యత కల్పిస్తాం. టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన శివకుమార్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నాను. కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరేందుకు ఎవరు వచ్చినా సాదర స్వాగతం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని స్థానాలు కాంగ్రెస్ గెలుపు ఖాయం.