‘‘సీల్డ్ కవర్ సీఎం కావాలా..సింహం లాంటి కేసీఆర్ మనకు సీఎం కావాలా? మరోసారి నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏర్పడితే ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్లో ముఖ్యమంత్రి పేరు వస్తుంది…ఆ పార్టీలో ఒక సీఎం కుర్చీ కి వంద మంది నేతలున్నారు తస్మాత్ జాగ్రత్త’’ అని హెచ్చరించారు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత.
శనివారం బోధన్ లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. మంత్రి ఈటల రాజేందర్ ఎంపీ కవిత ముఖ్య అతిథులు గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ ఎన్నికలు వచ్చాయంటే చాలు తప్పుడు సమాచారంతో ప్రజల్లోకి విష ప్రచారాన్ని చేసే నాయకులు బయలుదేరుతారని చెప్పారు. వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. విపక్షాల కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టాలని ఎంపీ కవిత ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆడబిడ్డలు ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఇట్లాంటి విష ప్రచారాన్ని తిప్పికొట్ట వచ్చునన్నారు.
షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తమన్నారు ..తెరిపించడం లేదని కాంగ్రెస్ నాయకుడు సుదర్శన్ రెడ్డి విమర్శిస్తున్నారని అన్నారు. అసలు రైతులతో సంతకాలు చేయించి చంద్రబాబు నాయుడు కు అప్పగించిన విషయం ఆయన మర్చిపోయారేమో కానీ రైతులు మరిచిపోలేదన్నారు. వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెరుకు రైతుల తో హైదరాబాద్లో సమావేశం కూడా నిర్వహించారని తెలిపారు. ఫ్యాక్టరీని తెరిపించేందుకు ఒకటి కాదు రెండు వందల కోట్ల ఇస్తామని, కాంగ్రెస్ నేతలు ముందుకు వచ్చినా అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు అండగా ఉండేందుకు చేసిన ప్రయత్నం ఆంధ్ర యాజమాన్యం వైఖరి వల్ల సఫలం కాలేదని కవిత తెలిపారు.
చెరకు కొనుగోలు ధర తక్కువ చెల్లిస్తుండటంతో యాజమాన్యంతో మాట్లాడి 80 కోట్లు అదనంగా ప్రభుత్వమే చెల్లించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వంది అన్నారు. ఏ పంట వేసిన ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని తెలిపారు. బోధన్ లో శనగలు ఆఖరు కిలో వరకు కూడా ఉన్న విషయాన్ని కవిత గుర్తు చేశారు. రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం చేస్తున్నారని రైతులకు బీమా చేయించిన కుటుంబాన్ని ఆదుకునేందుకు చేసిన ప్రయత్నం రైతులకు భరోసా ను ఇచ్చిందన్నారు.
చక్కెర కర్మాగారం కార్మిక సోదరులందరితో తాను మాట్లాడానని వారి ఇంటి బిడ్డగా చెప్తున్నాను.. మూడేళ్ల నుంచి రావాల్సిన జీవితాలను ఇప్పిస్తా.. అని ఎంపి కవిత ప్రకటించారు. చెరుకు ఫ్యాక్టరీ తెరిపించే విషయం ఇవ్వాల్టిది కాదన్నారు. సుదర్శన్ రెడ్డి దిగజారిపోయి విపరీత ప్రచారం చేస్తుండడం సరికాదన్నారు. బోధన్ నియోజకవర్గంలో గంగా- జమున- తహజీబ్ సంస్కృతి వెల్లివిరుస్తుందని, దాన్ని చెడగొట్టే ప్రయత్నం కొందరు చేస్తున్నారని తెలిపారు పరాయి మతస్తుడి కి ఓట్లు ఎట్ల వేస్తారని సుదర్శన్ రెడ్డి అనడం సిగ్గు లేని తనం అన్నారు. ఈ విభజన వాదాన్ని తిప్పి కొట్టాలని ఎంపి కవిత పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ గారు అనాడే చెప్పారు ‘మిమ్మల్ని చూసి ఉత్తర భారతం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ‘ అన్నారు అని వివరించారు.
షకీల్ అమీర్ ముస్లిం అయినా గణేష్ లడ్డూ వేలం లో పాల్గొని లడ్డూను దక్కించుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఆయనలో ఉన్న సోదర ప్రేమ, విశ్వాసం కు నిదర్శనమని కవిత చెప్పారు. షకీల్ ను హిందువుల వ్యతిరేకిగా ప్రచారం చేసిన బిజెపి గణేష్ లడ్డు ను షకీల్ దక్కించుకోడంతో ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు. అయితే సోషల్ మీడియాలో లడ్డూ వేలం లో పాల్గొన్న షకీల్ ను ముస్లిం వ్యతిరేకి గా చూపే వీడియో ప్రచారంలో పెట్టారని అట్లాగే మరో వీడియోలో హిందువులకు వ్యతిరేకంగా చూపెట్టే ప్రయత్నం చేశారని.. ఫోన్ నెంబర్ ఆధారంగా వివరాలు సేకరిస్తే ఒకే వ్యక్తి కుట్రపూరితంగా ఇలా చేశాడని తేలిందని వివరించారు. కుట్రలు ఎలా జరుగుతాయో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ అని కవిత తెలిపారు.
షకీల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ కవిత కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లు బిజీ గౌడ్ వి జి గౌడ్ ఫారుక్ హుస్సేన్, గంగాధర్ పట్వారి టిఆర్ఎస్ నాయకులు మోహన్ రెడ్డి, గిర్దావర్ గంగారెడ్డి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.