కాంగ్రెస్ లో టీఆరెస్స్ – కాంగ్రెస్ తో బీఆరెస్స్!

తెలంగాణ కోసం బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటానని మొదలుపెట్టిన కేసీఆర్.. అనంతరం అక్టోబర్ 2011 సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్ పార్టీలో కలిపేసేందుకు సన్నద్దులయ్యారనే కథనాలు అప్పట్లో కోకొల్లలు! అవసరమైతే రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్ పార్టీలో కలిపేయడానికి కేసీఆర్ నర్మగర్భంగా ఒప్పుకున్నారని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు కూడా! అయితే… ఆ విషయంలో ఏమి జరిగిందో తెలియదు కానీ.. “కాంగ్రెస్ లో టీఆరెస్స్” అనేది జరగలేదు. ఫలితంగా… కేసీఆర్ రాజకీయ చాణక్యం ముందు కాంగ్రెస్ నేతలు చల్లబడ్డారు అనే కామెంట్లు వినిపించాయి!

కాలం గిరగిరా తిరిగింది.. జూన్ 2019 వచ్చింది. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆరెస్స్ లో చేరిపోయారు. చేరితే చేరారు… తమను టీఆరెస్స్ లో విలీనం చేయండంటూ స్పీకర్ కు లేఖ ఇచ్చారు. తాము ఎలాంటీ ఒత్తిడి లేకుండా టీఆరెస్స్ లో చేరామని చెప్పుకొచ్చారు. దీంతో… తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణలో ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటో అని పలువురు కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు!

ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా హైదరాబాద్ లో మీడియా ముందు మైకందుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో హంగ్ ఏర్పడుతుందని జోస్యం చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగితే ప్రత్యేకత ఏముందనుకున్నారో ఏమో కానీ.. కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీతో కలవడం తప్ప మరో ఆప్షన్ లేదని తేల్చే ప్రయత్నం చేశారు!

అవును… రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి 60 సీట్లు మించి రావని మొదలుపెట్టిన కోమటిరెడ్డి.. కేసీఆర్ కాంగ్రెస్ తో కలవక తప్పదని, అధికారంలో మాత్రం కాంగ్రెస్ పార్టీనే ఉంటుందని చెప్పుకొచ్చారు! కాసేపు కోమటి రెడ్డి జోస్యమే నిజమవుతుందని భావించి, అన్ని ప్రధాన పార్టీలకు దాదాపు సమానంగా సీట్లొస్తే… అప్పుడు మాత్రం తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణలు మాత్రం చూడొచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు!

అదే జరిగితే… కాంగ్రెస్ నాయకులు అప్పుడెప్పుడో కలలు గన్న “కాంగ్రెస్ లో టీఆరెస్స్” జరగకపోయినా… “కాంగ్రెస్ తో బీఆరెస్స్” అయినా జరిగే అవకాశాలున్నాయని అనుకోవచ్చేమో!!

కాగా, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆరెస్స్ లో చేరిన అంశంపై తాజాగా స్పందించిన టి.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… ఈ వ్యవహారంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని., రాజకీయ ఒత్తిళ్ల వల్ల తెరాసలో చేరారా., ప్రలోభాల వల్ల కాంగ్రెస్ ని వీడారా అన్నది తేల్చాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే!