ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? భారత్ రాష్ట్ర సమితి పేరు విషయమై ఇంకొద్ది రోజుల్లో పూర్తి స్పష్టత కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రానుంది. అప్పటి వరకూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ నేతృత్వంలో నడుస్తున్న పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు భారత్ రాష్ట్ర సమితి పేరు తెరపైకొచ్చింది. మునుగోడు ఉప ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి గురించి టీఆర్ఎస్ నాయకులు గట్టిగానే మాట్లాడారు. భారత్ రాష్ట్ర సమితికి దక్కిన తొలి విజయం మునుగోడు ఉప ఎన్నిక అని కూడా గులాబీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు.
ఇంతకీ, జాతీయ స్థాయిలో కేసీయార్ చక్రం తిప్పేదెప్పుడు.? ఆయన అలా చక్రం తిప్పడానికి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రానే వచ్చేశాయ్. ప్రధాని నరేంద్ర మోడీని, ఆయన సొంత రాష్ట్రంలో ఛాలెంజ్ చేసే అవకాశం కేసీయార్‌కి దక్కింది. కానీ, కేసీయార్.. ప్రధాని మోడీని గుజరాత్ రాష్ట్రంలో ఛాలెంజ్ చేయగలరా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
తెలంగాణ రాష్ట్ర సమితి కేవలం ప్రాంతీయ పార్టీ మాత్రమే. కానీ, మజ్లిస్ పార్టీ రూపంలో టీఆర్ఎస్‌కి మంచి అవకాశం వుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో మజ్లిస్ పోటీ చేయడం, ఒకటీ అరా సీట్లు వేరే రాష్ట్రాల్లో గెలుచుకోవడం తెలిసిన విషయమే. సో, గుజరాత్‌లో ఆ మజ్లిస్ పార్టీ ద్వారాగానీ, కాంగ్రెస్ పార్టీ ద్వారాగానీ కేసీయార్ జాతీయ రాజకీయాలు చేసేందుకు వీలు అయితే వుంది. కానీ, ఇక్కడ కావాల్సిందల్లా చిత్తశుద్ధి. అది కేసీయార్‌కి వుందా.? లేదా.? అన్నదే ప్రశ్న ఇక్కడ.