టిఆర్ఎస్ కు బాబూమోహన్ షాక్

సినీ హాస్య నటుడిగా దశాబ్ద కాలం పైగా వెండి తెరను ఏలిన బాబూమోహన్ తన రాజకీయ ప్రస్తానంలో మరో అడుగు ముందుకేస్తున్నారు. ఆయన టిఆర్ఎస్ కు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. బాబూ మోహన్ ప్రయాణం ఎటువైపు..? ఏం కథ చదవండి.

బాబూమోహన్ 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ తరుపున మెదక్ జిల్లా ఆంథోల్ లో పోటీ చేశారు. టిఆర్ఎస్ ఊపు కావొచ్చు. గతంలో మంత్రిగా పనిచేసిన బాబూమోహన్ బలం కావొచ్చు.. కారణమేదైనా ఉమ్మడి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మను మట్టి కరిపించి గెలుపొందారు బాబూమోహన్.

అయితే టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ చేపట్టిన సర్వేల్లో బాబూమోహన్ బాగా వెనుకబడి ఉన్నట్లు తేలింది. బాబూమోహన్ జనాలతో సరిగా లేడని, కేడర్ తో అసలే బాగాలేడని వెల్లడైంది. దీంతో ఈదఫా ఎన్నికల్లో బాబూమోహన్ కు సీటు లేదని కేసిఆర్ తేల్చి చెప్పారు. అంతేకాదు ఆయనతోపాటు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కు కూడా సీటు నిరాకరించారు కేసిఆర్.

బాబూమోహన్ స్థానంలో సీనియర్ టివి జర్నలిస్ట్ క్రాంతి ని అభ్యర్థిగా ప్రకటించారు కేసిఆర్. నల్లాల ఓదేలు స్థానం చెన్నూరులో పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ ను అభ్యర్థిగా ప్రకటించారు. తనకు సీటు ఇవ్వకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు బాబూమోహన్. తాను ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నా సర్వేల పేరుతో తనను అవమానించారని ఆయన టిఆర్ఎస్ మీద ఆగ్రహంగా ఉన్నారు.

బిజెపి తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్ తో ఢిల్లీలో బాబూమోహన్

ఈ నేపథ్యంలో బాబూ మోహన్ శనివారం బిజెపి లో చేరారు. బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ తో పాటు ఢిల్లీ వెళ్లిన బాబూమోహన్ పార్టీ అధినేత అమిత్ షా ఆధ్వర్యంలో బిజెపిలో తీర్థం పుచ్చుకున్నారు. బాబూమోహన్ కు బిజెపి తరుపున ఆందోల్ సీటునే కేటాయించే చాన్స్ ఉందని చెబుతున్నారు. 

ఉమ్మడి రాష్ట్రంలో సినిమాల్లో బిజిగా ఉన్న సమయంలోనే బాబూమోహన్ రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఆయనకు టికెట్ ఇచ్చిన టిడిపి మంత్రివర్గంలో చోటు కూడా కల్పించింది. తర్వాత కాలంలో ఆయన కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం బలంగా సాగుతున్న సమయంలో ఆయన రాజకీయాల్లో కనిపించలేదు. 

టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు బాబూమోహన్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో బాబూమోహన్ టిడిపిలో ఉన్న సమయంలో కేసిఆర్ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఆ సమయంలో ఇద్దరూ బావా, బామ్మార్ది అనుకునేవారు. ఆ సాన్నిహిత్యం కారణంగానే బాబూమోహన్ ను టిఆర్ఎస్ లోకి కేసిఆర్ ఆహ్వానించి టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచారు. ఒక దశలో బాబూమోహన్ కు మంత్రి పదవి కూడా ఇస్తారని చర్చ జరిగింది. కానీ ఏమైందో ఏమో కేసిఆర్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు.

ఇక బాబూమోహన్ ఆందోల్ నియోజకవర్గంలో నిత్యం వివాదాల్లో నిలిచారు. జనాలను కసురుకున్నట్లు విమర్శలున్నాయి. కేడర్ ను విసుక్కున్నట్లు ఆరోపణలున్నాయి. ఒకసారి ఏదో కార్యక్రమంలో ఒక కార్యకర్త మీద కాలు లేపి తన్నబోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో చర్కర్లు కొట్టింది. 

బాబూమోహన్ ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న అమిత్ షా

అంతేకాదు బాబూమోహన్ అధికారుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయి. ఈ అన్ని అంశాలను బేరీజు వేసుకున్న కేసిఆర్ ఆయనకు టికెట్ నిరాకరించారు. అంతేకాదు రానున్న రోజుల్లో బాబూమోహన్ తోపాటు, నల్లాల ఓదేలును కడుపులో పెట్టుకుని చూసుకుంటాను అని కూడా ప్రకటించారు. అయినా  అందరికీ టికెట్లు ప్రకటించి తనకు ప్రకటించపోవడాన్ని బాబూమోహన్ అవమానంగా భావించారు. అందుకే పార్టీకి గుడ్ బై చెప్పారని ఆయన అనుచరులు అంటున్నారు.

నిజానికి కేసిఆర్ ప్రకటించిన 105 సీట్లలో అందరూ గెలుస్తారా?… గెలుస్తారన్న నమ్మకంతోనే కేసిఆర్ సీట్లిచ్చారా అని ఆయన సన్నిహితుడు ఒకరు ప్రశ్నించారు. కొన్ని సీట్లు ఓడిపోతామని తెలిసి కూడా ప్రకటించినప్పుడు బాబూమోహన్ ఒక్కడే ఏం పాపం చేసిండని ఆయన ప్రశ్నించారు. బాబూమోహన్ కానీ, నల్లాల ఓదేలు కానీ ఇద్దరూ దళితులే కాబట్టి వీరిని ఈజీగా పక్కన పెట్టేయొచ్చని టిఆర్ఎస్ అధిష్టానం భావించిందేమో అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరి బిజెపి బాబూమోహన్ ఏరకమైన ప్రభావం చూపుతారన్నది చూడాల్సి ఉంది.