ప్రీతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలింపు.. ఆందోళనకు దిగిన విద్యార్థి నేతలు..?

మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఎంబిబిఎస్ పూర్తి చేసి పీజీ విద్యాభ్యసిస్తున్న ప్రీతి కళాశాలలో సీనియర్ వేదింపులు భరించలేక ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. ఐదు రోజులపాటు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడిన ప్రీతి ఆదివారం సాయంత్రం కన్నుమూసింది. ప్రీతి మరణంతో నిమ్స్ ఆసుపత్రి వద్ద ఆందోళన వాతావరణం నెలకొంది. ఒకవైపు ప్రీతి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆసుపత్రిని ముట్టడించగా మరొకవైపు గిరిజన సంఘాలు, విద్యార్థి నేతలు ఆసుపత్రిని ముట్టడించారు. ఇక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిమ్స్ ఆస్పత్రికి చేరుకొని ప్రీతీ తల్లిదండ్రులను పరామర్శించాడు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రీతి బతికే అవకాశం కేవలం ఒక్క శాతం మాత్రమే ఉందని వెల్లడించటంతో నిమ్స్ ఆస్పత్రి వద్ద వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత ప్రీతి బ్రెయిన్ డెడ్ అయిందన్న వార్త బయటికి తెలియడంతో ఆస్పత్రి వద్ద ఆందోళన మొదలైంది. ఇక ఆదివారం రాత్రి 9 నిమిషాలకు ప్రీతి మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేశారు. ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఆందోళన విరమించేది లేదంటూ దాదాపు రెండు మూడు గంటల పాటు నిమ్స్ ఆస్పత్రి వద్ద నిరసన చేశారు .

అలాగే ప్రీతి డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించకుండా అడ్డుకోవడంతో నిమ్స్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయ్‌. కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో ఎట్టకేలకు ప్రీతి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అయినా కూడా నిమ్స్‌ మరియు గాంధీ హాస్పిటల్స్‌ దగ్గర పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు . అలాగే ప్రీతి మృతితో వరంగల్‌ KMC, MGM దగ్గర పోలీసులు భారీ భద్రతను పెంచారు. ఇదిలా ఉండగా ప్రీతీ మృతి పట్ల ఇవాళ విద్యాసంస్థల బంద్‌కి పిలుపునిచ్చాయి గిరిజన విద్యార్ధి సంఘాలు, ఓయూ జేఏసీ. ప్రీతి మృతికి కారణమైన సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.అలాగే కేంఎసీ ప్రిన్సిపల్‌, హెచ్‌వోడీలను కూడా వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.