హైదరాబాద్ లో ఘోర విషాదం…ఆడుకుంటూ ప్రాణాలు కోల్పోయిన చిన్నారి..?

హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గోడ కూలిన ఘటన లో ఒక బాలుడు మృతి చెందగా మరొక బాలిక తీవ్ర గాయాల తో ఆసుపత్రి లో చికిత్స పొందుతోంది.

వివరాలలోకి వెళితే… కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నింబోలి అడ్డాలో రాజస్థాన్ నుండి కూలి పనుల నిమిత్తం వలస వచ్చిన కూలీలు బండి సింగ్, సేవారజ్ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. బండి సింగ్ కుమారుడు 6 సంవత్సరాల ధీరు సింగ్, సేవారాజ్ కుమార్తె 5 సంవత్సరాల రాధిక ఇంటి వద్ద ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటూ ఉన్నారు. అయితే పిల్లలు అక్కడ ఆడుకుంటున్న సమయంలో ఒక్క సారిగా గోడ కుప్ప కూలడంతో ధీరు సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాల పాలైన రాధికను దగ్గర్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం రాధికను యశోద హాస్పిటల్స్ కి తరలించారు.

అప్పటి వరకు సతోషంగా ఆడుకుంటున్న పిల్లలు విగత జీవులుగా అవ్వడంతో పిల్లల తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పిల్లలు ఆడుకుంటున్న ఖాళీ స్థలం పక్కనే ఉన్న స్థలంలో సత్యేందర్ అనే వ్యక్తి నూతనంగా ఇంటి పిల్లర్ నిర్మాణ పనులు చేపట్టాడు. ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టే సమయంలో కావలసిన ఎటువంటి ముందస్తు అనుమతులు, జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేపట్టాడని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన కాచిగూడ పోలీసులు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంటి యజమాని సత్యెందర్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.