లగడపాటి సర్వేలో గెలిచే మూడో అభ్యర్ధి ఇతడేనా

తెలంగాణ ఎన్నికలలో స్వతంత్ర్య అభ్యర్దులు 10 మంది గెలుస్తారని  లగడపాటి రాజగోపాల్ తిరుమలలో చెప్పి సంచలనం సృష్టించారు. రోజుకు ఇద్దరు చొప్పును అభ్యర్దులను ప్రకటిస్తానని రాజగోపాల్ అన్నారు. కానీ టిఆర్ఎస్ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేయడంతో రాజగోపాల్ నిశ్శబ్దమైపోయారు. కానీ అనూహ్యంగా ఆయన కొత్త విధానంతో మరో ఫలితాన్ని ప్రకటించినట్టు తెలుస్తోంది.

ఆంధ్ర ఆక్టోపస్ గా పేరుగాంచిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించే సర్వేలకు విపరీతమైన క్రేజ్ ఉంది. తెలంగాణ ఎన్నికల్లో 10 మంది స్వతంత్రులు గెలుస్తారని రాజగోపాల్ ప్రకటించి ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలను హీటెక్కించారు. వీరిలో మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేట నుంచి శివకుమార్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి అనిల్ కుమార్ గెలుస్తారని ప్రకటించారు. రోజుకు ఇద్దరు పేర్లు ప్రకటిస్తానన్నారు. కానీ మ్యాటర్ ఈసీకి చేరడంతో రాజగోపాల్ మౌనం వహించారు.  సోమవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతోంది.

మేడిపల్లి సత్యం

కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్ధి మేడిపల్లి సత్యంకు లగడపాటి ఫోన్  చేశారట. ఫోన్ చేసి నువ్వు గెలువబోతున్నావు.. నీకు అభినందనలు అంటూ ఆయన ప్రశంసించారని తెలుస్తోంది. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలువబోతున్నారో అనే విషయాన్ని కూడా ఆయనకు ఫోన్ లో చెప్పారట. చిన్నతనంలోనే ఇంత అభిమానాన్ని ఎలా సాధించావని ఆయనను ప్రశ్నించారట. దీంతో లగడపాటి సర్వేలో మూడో గెలుపు గుర్రం మేడిపల్లి సత్యం అని తేలిపోయింది. అసలు విషయం ఏమిటంటే ఉద్యమ సమయంలో మేడిపల్లి సత్యం, లగడపాటి రాజగోపాల్ హోరాహోరి తలపడ్డారు. మేడిపల్లి సత్యం రేవంత్ రెడ్డి అనుచరుడు.

లగడపాటి రాజగోపాల్ ఫోన్ కాల్ విషయమై పలువురు జర్నలిస్టులు సత్యంను సంప్రదించగా లగడపాటి రాజగోపాల్ ఫోన్ చేసిన విషయం వాస్తవమేనని ధృవీకరించారు.  దీంతో తెలంగాణలో లగడపాటి సర్వేలో మరో విజేత ఎవరో తేలిపోయింది. ఇప్పటికే ఇద్దరి స్వతంత్రుల పేర్లు ప్రకటించిన లగడపాటి రాజగోపాల్ మిగిలిన 8 మంది స్వతంత్ర అభ్యర్దులను ఎప్పుడు ప్రకటిస్తారని అంతా వేచి చూస్తున్నారు. కానీ లగడపాటి ప్రకటన పై టిఆర్ఎస్ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో లగడపాటి మిగిలిన వారి పేర్లు ప్రకటించలేదు.

కానీ అనూహ్యంగా కాంగ్రెస్ నేత మేడి సత్యం కాంగ్రెస్ నుంచి గెలువబోతున్నారని అనధికార ప్రకటన చేశారు. లగడపాటి గతంలో ఎన్నికలు ముగిసిన వెంటనే తన సర్వే ఫలితాలను వెల్లడించారు. అవి నిజమయ్యాయి. లగడపాటి వివిధ రాష్ట్రాలలో కూడా ఎన్నికల సర్వే చేసి ఫలితాలు చెప్పారు. అవి కూడా నిజమయ్యాయి. లగడపాటి రాజగోపాల్ కు సర్వేలంటే ఇష్టం. అది తన హాబీ అని చాలాసార్లు లగడపాటి ప్రకటించారు.

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలు ముగిసిన వెంటనే సర్వే పూర్తి ఫలితాలు ప్రకటిస్తానని లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. ఈ లోపు రోజుకో పేరు లగడపాటి సర్వే నుంచి లీక్ అవుతుండడంతో అంతటా చర్చనీయాంశమైంది.