దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలు మీదే కాదు తెరాస పార్టీ మీద కూడ పెను ప్రభావాన్ని చూపిస్తోంది. పార్టీలో అసంతృప్తి వర్గం పుట్టుకొచ్చేలా చేస్తోంది. అదే హరీష్ రావు వర్గం. దుబ్బాక ఉప ఎన్నికల బాధ్యత మొత్తాన్ని కేసీఆర్ హరీష్ రావు నెత్తిన పెట్టినప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. హరీష్ రావుని వీలైతే అణచివేయాలని చూస్తున్న కేసీఆర్ అందుకు ఈ దుబ్బాక ఎన్నికలను ఆయుధంగా వాడుకుంటున్నారని అన్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు గెలిస్తే విజయం లేకపోతే హరీష్ రావు పతనం అనేలా వ్యూహం పన్నారని రాజకీయవర్గాల్లో చర్చ నడిచింది. అయితే హరీష్ రావు ఎంత అసంతృప్తి ఎదురైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏనాడూ కేసీఆర్ మాటను జవదాటలేదు.
అన్ని సమస్యలను తన పనితనంతోనే నెరవేర్చుకుంటూ వచ్చారు. ఈసారి కూడ ఎన్నికల్లో గెలిచి మరోసారి తన సత్తా చాటాలనుకున్నారు. కానీ పరిస్థితులు తారుమారయ్యాయి. పార్టీ ఓడిపోయింది. దీంతో హరీష్ రావు టార్గెట్ అయ్యారట. పార్టీ పెద్దగా కేసీఆర్ ఓటమి బాధ్యతలను తీసుకోవాలి. కానీ తప్పంతా హరీష్ రావు మీరు నెట్టేస్తున్నారని, ఒకవేళ గెలిచివుంటే ఆ క్రెడిట్ మాత్రం తమదే అన్నట్టు తీసుకునేవారని హరీష్ రావు వర్గీయులు మండిపడుతున్నారట. నిజానికి వారి బాధలో అర్థముంది. హరీష్ రావు గెలుపు కోసం నిజాయితీగా పనిచేశారు. అభ్యర్థి తానే అనుకుని ఓట్లు వేయమని అడిగారు. గెలిస్తే దుబ్బాకను అభివృద్ధి చేసే బాధ్యత తనదని, మరొక సిద్దిపేటను చేస్తానని హామీ ఇచ్చారు. ప్రయత్న లోపం లేకుండా కష్టపడ్డారు.
హరీష్ రావు అంతలా కష్టపడబట్టే కేవలం 2 వేల లోపు ఓట్ల తేడాతో ఒడామని లేకుంటే డిపాజిట్ కూడ దొరక్క ఘోర పరాజయాన్ని పొందాల్సి ఉండేదని అంటున్నారు ఆయన వర్గీయులు. అసలు ఓడిపోతామని తెలిస్తే కేసీఆర్, కేటీఆర్ తప్పుకుని హరీష్ మీద భారం వేశారని అంటున్నారు ఇంకొందరు. ఈ పరిణామాలను చూస్తే ఇన్నాళ్లు ఎంతో ఓపికగా అన్ని గండాలను దాటుకుంటూ వచ్చిన హరీష్ రావులోని సహనానికి ఇదే ఆఖరు పరీక్షని, ఇప్పుడు గనుక ఆయన మీద వ్యతిరేక చర్యలు, కుట్రలు జరిగితే ఇకపైనా జరిగే పరిణామాలకు ఆయన్నుండి తీవ్రమైన స్పందన వస్తుందని, ఆయన సైలెంట్ వార్ మొదలుపెడతారని, అప్పుడు పార్టీ మనుగడకే నష్టమని హెచ్చరిస్తున్నారు.