చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విద్యార్థిని గదిలో ఉంచి తాళం వేసిన వార్డెన్!

ప్రస్తుత కాలంలో పిల్లలకు చదువులు భారంగా మారిపోయాయి. ర్యాంకులు రావాలన్న ఉద్దేశంతో ప్రైవేట్ సంస్థలు పిల్లలను అధిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. అవతలి భరించలేక ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇటువంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని నార్సింగ్ ప్రాంతంలో ఓ ప్రైవేటు కాలేజీలో ఈ దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన నాగుల సాత్విక్ (16) అనే యువకుడు ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. కాలేజీలో ప్రిన్సిపల్, లెక్చరర్, వార్డెన్ వేధింపులు భరించలేక తన క్లాస్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

రాత్రి పది గంటలు సమయంలో స్టడీ అవర్స్ ముగిసిన తర్వాత విద్యార్థులు అందరూ వారి గదులకు వెళ్ళగా సాత్విక్ మాత్రం తరగతి గదిలో బట్టలు ఆరేసే తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. కొంత సమయం తర్వాత విద్యార్థులు గుర్తించి తరగతి గదికి వెళ్లి చూడగా సాత్విక్ తరగతి గదిలో వేలాడుతూ కనిపించాడు. వెంటనే వార్డెన్ అక్కడికి చేరుకొని పిల్లల మీద అరిచి వారిని అక్కడినుండి పంపించి కొన ఊపిరితో ఉన్న సాత్విక్ ని కాపాడే ప్రయత్నం చేయకపోగా ఆ గదికి తాళం వేశాడు. అయితే విద్యార్థులందరూ పెద్ద ఎత్తున అరిచి గోల చేయడంతో ఎట్టకేలకు గది తాళం తీసి చూడగా సాత్విక్ అప్పటికి ఇంకా కొనఊపిరితో ఉన్నాడు.

వార్డెన్ అలా గదికి తాళం వేయకుండా అతని కాపాడే ప్రయత్నం చేసి ఉంటే సాత్విక్ ప్రాణాలతో ఉండేవాడని విద్యార్థులు వెల్లడించారు. అయితే విద్యార్థి పట్ల కాలేజీ యాజమాన్యం వ్యవహరించిన తీరుకి విద్యార్థి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి మీద దాడి చేశారు. సాత్విక్ కుటుంబ సభ్యులతో పాటు కళాశాల విద్యార్థులు కూడా కాలేజీ ఎదుట నిరసనకు దిగారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. విద్యార్థుల బాగోగులు పట్టించుకోకుండా వారిని చిత్రహింసలకు గురి చేస్తున్న కాలేజీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.