తెలంగాణ: ఎన్నికలలో ఓటర్లని ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా పార్టీలు డబ్బు, మద్యం , వాగ్దానాలు లాంటి ప్రలోభాలు ఎన్ని జరిగినా…ప్రజలు ఎవరికి ఓటు వేయలో వారికే వేస్తారు. అందులో వేరే ఆలోచన ఉండదు. అయితే ఈ గ్రేటర్ పోరులో ప్రతిపక్షాలు అధికార టీఆర్ఎస్కు చుక్కలు చూపించే అవకాశం ఉందని విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు.గతంలో జరిగిన ఎన్నికలు, ఈసారి జరిగే ఎన్నికలకు చాలా తేడా ఉందని అంటున్నారు. గతంలో టీఆర్ఎస్ తొలిసారి అధికారంలో ఉంది. దాంతో అప్పుడు ప్రజలు గులాబీ పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపారు. అలాగే ఎంఐఎంకు ఉండే ఓటర్లు ఆ పార్టీకి ఉన్నారు. కాబట్టి రెండు పార్టీలు అప్పుడు బంపర్ మెజారిటీతో గెలిచాయి. అయితే ఈసారి లెక్కలు మారాయని తెలుస్తోంది. ఎందుకంటే గులాబీ పార్టీ టీడీపీని వీక్ చేసినట్లే కాంగ్రెస్‌ని వీక్ చేసింది. దీంతో బీజేపీ, గులాబీ పార్టీకి ప్రత్యర్ధిలా మారింది.
పైగా కేంద్రంలో అధికారంలో ఉండటం బీజేపీకి అడ్వాంటేజ్. ఇటు కాంగ్రెస్‌కు కొంతవరకు ఓటు బ్యాంక్ ఉంది. అటు ఎంఐఎంకు పాతబస్తీ అండ ఉంది. అయితే గతంలో టీడీపీ ఓటర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. కానీ ఈసారి వీరు ఎటు వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర విభజన జరిగాక అంటే 2014 ఎన్నికల్లో గ్రేటర్లో మెజారిటీ స్థానాలు టీడీపీనే గెలిచింది.అయితే ఆ తర్వాత టీడీపీని కేసీఆర్ ఏం చేశారో తెలిసిందే. ఇక ఇప్పుడు టీడీపీని అభిమానించే వారు ఎటువైపు మొగ్గుచూపుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీ కూడా 100 డివిజన్లలో పోటీ చేస్తుంది. ఇక ఆ పార్టీకి ఎన్ని ఓట్లు పడితే అవి టీఆర్ఎస్కు మైనస్ అవుతాయి అంటున్నారు. అలాగే కొందరు టీడీపీ కార్యకర్తలు రేవంత్ రెడ్డిని కూడా అభిమానిస్తారు. దాని బట్టి చూస్తే కొన్ని ఓట్లు కాంగ్రెస్ వైపు వెళ్లొచ్చు. ఇక ఎన్టీఆర్ సమాధి విషయంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం పార్టీకి వార్నింగ్ ఇచ్చి, ఎన్టీఆర్ అభిమానులు తనవైపుకు తిప్పుకునే కార్యక్రమం చేశారు. ఇక ఇవన్నీ చూసుకుంటే గ్రేటర్లో పసుపు దెబ్బ గులాబీకే ఎక్కువ తగిలేలా కనిపిస్తోంది.