ప్రస్తుత కాలంలో నవమాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రులను చూసుకోవడానికి పిల్లలు భారంగా భావిస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు కనీసం మూడు పూటలా తిండి పెట్టకుండా వారిని అనాధలుగా వదిలేస్తున్నారు. ఇటీవల ఇటువంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరోగ్య పరిస్థితి సరిగా లేని తల్లిని వైద్యం చేయిస్తానని నమ్మించి పట్టణానికి తీసుకువచ్చాడు. ఇప్పుడే వస్తానని చెప్పి తల్లిని బస్టాండ్ లో ఉంచి వెళ్లిపోయిన కుమారుడు తిరిగి వస్తాడని ఆ తల్లి 10 రోజులుగా పస్తులు ఉంటూ కొడుకు కోసం ఎదురు చూస్తోంది. ఈ విషాదకర ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే… సమ్మక్క అనే వృద్ధురాలు వినికిడి, కంటి చూపు సమస్యలలో బాధపడుతోంది. ఈ క్రమంలో తనకి వైద్యం చేయిస్తానని నమ్మించి కుమారుడు ఆ తల్లిని కరీంనగర్ పట్టణానికి తీసుకువచ్చి ఆమెను బస్టాండ్ లో వదిలి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. అలా వెళ్లిన కొడుకు పది రోజులు గడుస్తున్న కూడా తిరిగి రాలేదు. అయిన ఆ తల్లి మాత్రం కొడుకు తిరిగివస్తాడని తిండి, తిప్పలు లేకుండా పదిరోజులుగా ఎదురు చూస్తోంది. సమ్మక్క ఇలా పది రోజులుగా అక్కడే ఉండటం గమనించిన స్థానికులు ఆమె వద్దకు వెళ్లి వివరాలు సేకరించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆమెకి ఉన్న వినికిడి లోపం వల్ల వీరికి సరైన సమచారం ఇవ్వలేక ఇబ్బంది పడింది. దీంతో వారు పోలీసులకు ఫోన్ చేసి ఆమె పరిస్థితి వివరించారు.
దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని కరీంనగర్ లోని ఎల్డర్స్ హెల్ప్‌లైన్ అధికారి స్వర్ణలతకు సమాచారం అందించారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఆమె వివరాలు సేకరించి వారి సంస్థలో ఆమెకు ఆశ్రయం కల్పించారు. సమ్మక్క కొంత కోలుకున్న తర్వత తన పేరు, ఊరు, కొడుకు వివరాలు చెప్పి బస్టాండ్‌లో ఇన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితులను వివరించింది. ఇలా వైద్యం పేరుతో కన్నా తల్లిని వదిలించుకున్న కొడుకు కోసం ఇప్పటికి ఆ తల్లి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ తల్లికి ఇంకా తన కొడుకు వస్తాడని ఆసుపత్రికి తీసుకెళ్తాడనే ఎంతో నమ్మకంగా ఉంది. అందుకే కొడుకు తిరిగి వస్తే తాను అక్కడ లేకపోతే కంగారు పడతాడని బస్టాండ్ కి వెళ్లి చూస్తాను అని చెప్పటంతో అందరి గుండెలు బరువెక్కపోయాయి.