ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేయటం వల్ల ఇంట్లో వంట చేసుకుని సమయం కూడా ఉండకపోవటంతో చాలామంది ఆన్లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని సమయానికి భోజనం చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని సందర్భాలలో ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా లేదా ఇతర కారణాలవల్ల ఈ ఫుడ్ డెలివరీ ఇవ్వటం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇలా ఆర్డర్ చేసిన ఫుడ్ ఆలస్యం అయితే చాలామంది డెలివరీ బాయ్స్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఫుడ్ డెలివరీ లేట్ అయిందని ఏకంగా డెలివరీ బాయ్ మీద దాడి చేసిన ఘటన ఇటీవల హైదరాబాద్లో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే… ఫుడ్ డెలివరీ ఇవ్వటం ఆలస్యమైందని ఆగ్రహానికి గురైన వ్యక్తి 15 మంది అనుచరులను తన వెంట తీసుకొని మాసబ్ ట్యాంక్‌లోని హోటల్ వద్దకు వచ్చి తన అనుచరులతో కలిసి బీభత్సం సృష్టించాడు. దీంతో సదరు డెలివరీ బాయ్ భయంతో హోటల్‌లోకి పరుగుతీశాడు. అయినా వారు అతని వదలకుండా వెంబడిస్తూహోటల్‌లోకి పరుగెత్తి మరీ డెలివరీ బాయ్ ఇలియాస్ పై మూకుమ్మడిగా దాడి చేశారు. హోటల్ సిబ్బంది గొడవను ఆపేందుకు ప్రయత్నించగా ఫలించలేదు.
అయితే వారి నుండి తప్పించుకోవడానికి ఆ డెలివరీ బాయ్ వంటగదిలోకి వెళ్లగా వారు అక్కడికి కూడా వచ్చి అతడి మీద దాడి చేయటానికి ప్రయత్నం చేయటంతో.. స్టౌమీద మరుగుతున్న నూనె వారి మీద పడింది. దీంతో ఫుడ్ డెలివరీ బాయ్ ఇలియాస్, హోటల్ ఉద్యోగులు సోను, సజ్జన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక ఈ ఘటన గురించిసమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు, అతని ముగ్గురు కుమారులు సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.