కొంగర కలాన్ సభ వెనక ఉన్న ఎకనామిక్స్ ఇదే…

కొంగర కలాన్ పేరు ఒక పది రోజుల కిందటి దాకా ఎవరికీ తెలియదు. దూరదృష్టితో వ్యాపారం చేసుకునే రియల్ ఎస్టేట్ వాళ్లకు, ప్లాట్లలో ఇన్వెస్ట్ చేసుకుందామనుకునే ముందుచూపున్న మదుపరులకు మాత్రమే  కొంగరకలాన్ గురించి తెలుసు. అయితే, ఇపుడు తెలంగాణ మొత్తం కొంగర కలాన్ అనే మాట ప్రతిధ్వనిస్తూ ఉంది.  ఎక్కడ చూసిన కొంగర కలాన్ పేరే కనిపిస్తుంది, వినిపిస్తుంది.  రకరకాల పోస్టర్లో , ఫ్లెక్సిబోర్డులలో, బ్యానర్లమీద, నాయకుల ప్రసంగాలలో కొంగరకలాన్. నిన్నటి నుంచి వేలాది ట్రాక్టర్లు బస్సులు, కార్లు, కొంగర కలాన్ కు పరుగుపెడుతున్నాయి. రంగా రెడ్డి జిల్లాలో ఇబ్రహీం పట్నం అసెంబ్లీ నియోజకర్గంలోని ఈ చిన్న గ్రామం ఈ రోజు దాదాపు 25 లక్షల మందికి ఆశ్రయమివ్వబోతున్నది.

  ఈ కొంగర కలాన్ ప్రయాణికులతో హైదరాబాద్ లోని రోడ్లే కాదు, రాష్ట్రంలోని కీలకమయిన రోడ్లన్నీ జామ్ అయిపోయాయి. ఈ చిన్న గ్రామం ఇపుడు పింకురంగులోకి మారిపోయింది. అధికారులు, నాయకులు, మంత్రులు   ఈ గ్రామాన్నిసందర్శిస్తున్నారు. ఇన్నాళ్లు అభివృద్ధి ఊసే లేని కొంగరకలాన్ లో భారీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన మొదలయ్యాయి. విఐపిలకు విడిదికాబోతున్న ఈ చిన్న పల్లెటూరిలో నాలుగైదు రోజులుగా జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి  గ్రామస్తులు ఆశ్యర్యపోతున్నారు.  ఒక వైపు గ్రామస్థుల్లో ఆనందం వ్యక్తమవుతోన్నా, ప్రభుత్వం అనుకుంటే తప్ప అభివృద్ధి దానికదే  సాగదన్న నిజం కూడా గ్రహిస్తున్నారు. ఔటర్‌ రింగురోడ్డుకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా కొంగర కలాన్‌కు  20 అడుగుల రోడ్డు మాత్రమే ఉండేది. టిఆర్ ఎస్ ప్రగతినివేదన సభ పుణ్యాణ గ్రామ దశ తిరిగింది. విఐపిలు పెద్ద ఎత్తున వచ్చిపోతుంటారు కాబట్టి ఇరుకురోడ్డు నూరడుగుల  రహదారిగా మారింది. యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న పనులతో  ఈ రోడ్డు  ఓఆర్‌ఆర్‌ లాగా కళకళలాడుతూ ఉంది.   అంతర్గతరోడ్లు, డ్రైనేజీ అభివృద్ధికి కూడా నిధులు కేటాయించారని మాజీ సర్పంచ్ అశోక్  మీడియాకు చెప్పారు.

కొంగర కలాన్ ను టిఆర్ ఎస్  ప్రగతినివేదన సభకు ఎంపిక చేయడం వెనక పెద్ద ఎకనమిక్ ప్రోగ్రాం ఉందని చెబుతున్నారు.  ఈ వూరు టిఆర్ ఎస్ సభతో పాపులర్ చేస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. సభ జరపాలనుకోవడం వెనక టిఆర్ ఎస్ ప్రభుత్వం ఇక్కడ డెవలప్ చేస్తున్న స్పెషల్ ఎకనమిక్ జోన్ లో భాగమేనని కొందురు చెబుతున్నారు. కొంగర కలాన్ దగ్గిర ఒక స్పెషల్ ఎకనమిక్ జోన్ కూడ రాబోతున్నది. ఇక్కడ దేశంలోనే మొదటి సారి ఒక బంగారు  శుద్ధి కర్మాగారం కూడా రాబోతున్నది. ఏడాదికి రు. 25 కోట్ల కు పైబడి వార్షిక టర్నోవర్ ఉన్న రెండు నగలతయారీ కంపెనీలు గోల్డ్ రిఫైనరీ పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఒకపుడు ఇక్కడ రంగారెడ్డి జిల్లా కలెక్టొరేట్ కార్యాలయం కూడా నిర్మించాలనుకున్నారు.

ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ బూమ్ సృష్టించడంలో భాగమే టిఆర్ ఎస్ సందడంతా అని చాలా మంది అనుమానం.  ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు కూడా బాగా ఉన్నాయి. ఇక ముందు అన్ని రకాల భూముల రేట్లు పెరుగుతాయి. ప్రగతి నివేదన సభ వల్ల  గుర్తింపులేని కొంగరకలాన్  పేరు అందరి నోళ్లలో నానుతోంది. దీనితో రియల్టర్ల ఆనందానికి అంతేలేకుండా పోయింది. కదలకుండా ఉన్న అనేక వెంచర్లకు సభ ప్రాణం పోస్తుందని చెబుతున్నారు. 

కొంగరకలాన్ గ్రామం గురించి నాలుగు ముక్కలు… ఇది ఇబ్రహీం పట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంటుంది. ఇక్కడి    ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, గెలిచింది కాంగ్రెస్ నుంచి  ఇపుడుండేది టిఆర్ ఎస్ లో.   భువనగిరి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందీగ్రామం. ఎంపి బూర నర్సయ్య గౌడ్ (టిఆర్ ఎస్.). గ్రామ సర్పంచ్ బంగారుగుళ్ల శేఖర్. ఎస్టిడి కోడ్ 08414. పిన్ కోడ్ 501510. ఈ గ్రామానికి సమీపంలో పోస్టాఫీస్ రంగన్నగూడ క్రాస్ రోడ్స్ లో ఉంది. 2011 సెన్సస్ ప్రకారం గ్రామ జనాభా 5269. ఇందులో 48.1 శాతం మహిళలు,  గ్రామ అక్షరాస్యత 53. 1 శాతం. మహిళల అక్షరాస్యం బాగా తక్కువ 21.2 శాతం. ఇక్కడి ప్రజలు తెలుగు ఉర్దు మాట్లాడతారు.