కొత్తపేటలో కలకలం, ఉద్రిక్త పరిస్థితి

హైదరాబాద్ కొత్తపేట చౌరస్తాలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కొత్తపేటలోని వీఎం హోం గ్రౌండ్ ను మూసివేశారని దానిని నిరసిస్తూ 2వేల మంది నిరుద్యోగులు భగ్గుమన్నారు. కొత్తపేటలోని హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు.  అసలు వివరాలు ఏంటంటే…

కొత్తపేటలో విక్టోరియా మాల్ హోం ఉంది. వందల ఎకరాల్లో సువిశాలమైన ప్రాంతంతో ఈ ప్రదేశం ఉంది. ఇది ఒక ట్రస్టీకి సంబంధించిన స్థలం. దీనిలో నిత్యం వేలాది మంది వాకర్స్, ముఖ్యంగా కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారు ఈ గ్రౌండ్ లోకి వచ్చే సాధన చేస్తుంటారు. శుక్రవారం కూడా సాధారణంగానే వచ్చిన వారికి గేటు తాళాలు వేసి కనిపించింది. దీంతో వారు ఖంగుతిన్నారు. ఎందుకు తాళాలు వేశారంటూ 2 వేల మంది నిరుద్యోగులు, వాకర్స్ రోడ్డు పైకి ఎక్కి నిరసన తెలిపారు.

నిరుద్యోగులు భారీ ఎత్తున ఉండటంతో వారిని అదుపు చేయడం పోలీసులకి కష్టంగా మారింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నిరుద్యోగులు రోడ్డు మీదే ఆసనాలు వేసి నిరసన తెలిపారు.  

నిరుద్యోగుల ఆందోళన విషయం తెలుసుకున్న ఎల్ బీ నగర్ మహా కూటమి అభ్యర్ధి దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో పాటూ ప్రజా సంఘాల నేతలు అక్కడికి చేరుకొని వారికి మద్దతుగా నిలిచారు. శనివారం నుంచి యథావిధిగా విక్టోరియా హోం తెరిచి ఉంటుందని పోలీసులు నేతలకు, నిరుద్యోగులకు హామీ ఇవ్వటంతో వారు ఆందోళన విరమించారు. ఎన్నికలు ఉన్నందున విక్టోరియా మాల్ లో కూడా పోలింగ్ బూత్ లు మరియు, కౌంటింగ్ కేంద్రాలు కావడంతో ఎన్నికల అధికారులు వారి పరిధిలోకి తీసుకున్నారని తెలుస్తోంది. తమకు ఈవెంట్స్ ఉన్నందున ఉదయం, సాయంత్రం రిలిఫ్ ఇవ్వాల్సిందేనని నిరుద్యోగ అభ్యర్దులు డిమాండ్ చేస్తున్నారు. 

వేలాది మందిమి దిల్ సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ లు తీసుకుంటూ వీఎం హోంలో సాధన చేస్తున్నామని ఈవెంట్స్ దగ్గర పడుతున్న సమయంలో తాళాలు వేస్తే తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం కూడా ఎన్నికల అధికారులు తమ పరిధిలోకి తీసుకోనున్నారని తెలుస్తోందన్నారు. ఎన్నికల విధులకు తాము ఆటంకం కల్పించమని నిరుద్యోగ అభ్యర్దులు తెలిపారు. ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు తమకు అనుమతివ్వాలని వారు కోరుతున్నారు. తాము వచ్చి తమ సాధన చేసుకోని పోతామని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల అధికారులకు తమ వల్ల ఇబ్బంది కలగదని వారు స్పష్టం చేశారు. 

డిసెంబర్ 17 నుంచి ఈవెంట్స్ ఉండడంతో చివరి దశ ప్రాక్టిస్ చాలా ముఖ్యమని అధికారులకు వారు గుర్తు చేశారు. వేలాది మంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అధికారులు స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు.