కొడంగల్ బ్రేకింగ్ : రేవంత్ రెడ్డి శిబిరంలో కొత్త టెన్షన్

తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కొడంగల్ టిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి నివాసం ఉంటున్న ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన కేసు కొత్త మలుపులు తిరుగుతున్నది. ఈ కేసును నీరుగార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలోని కీలక అధికారులు రంగంలోకి దిగినట్లు కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు గుప్పించారు. 

గురువారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తన మీద ఏ క్షణమైనా దాడి చేసేందుకు టిఆర్ఎస్ సర్కారు ప్రత్యేక ప్రణాళిక రచించిందని ఆరోపించారు. తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తోందని భయాందోళన వ్యక్తం  చేశారు. కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డితో కలిసి రేవంత్ ఇంకా ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే చదవండి. 

కొడంగల్ టిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి

కేసిఆర్ సర్కారు నన్ను చంపాలని చూస్తోంది. కొడంగల్ టిఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఇంట్లో నగదు దొరికింది. ఆయన నివాసం ఉంటున్న ఇంట్లో 17.51 కోట్ల రూపాయలు దొరికితే దాన్ని 51 లక్ష దొరికినట్లు ఎన్నికల సంఘం అధికారులు చెప్పడం ఆశ్చర్యం కలుగుతున్నది. 

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఎన్ని రకాలుగా చెరబట్టాలో, ఎన్ని రకాలుగా వెక్కిరించాలో, ఎన్ని రకాలుగా నియమ నిబంధనలు ఉల్లంఘించాల్నో కేసిఆర్ అన్ని రకాలుగా ఉల్లంఘించే ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న కొడంగల్ లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నివశిస్తున్న ఇంట్లో ఐటి అధికారులు దాడి చేసిర్రు. రహస్య నివేదిక ఇచ్చినట్లు చెప్పిర్రు. 51 లక్షలు మాత్రమే దొరికిందని కొన్ని పత్రికలు, టివిలకు సమాచారం చేరవేశిర్రు. 

టిఆర్ఎస్ అభ్యర్థి గత నాలుగు నెలలుగా నివాసం ఉంటున్న ఇంట్లో 17.51 లక్షల నగదు దొరికింది. అంతేకాదు ఇప్పటికే వివిధ గ్రామాల్లో ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేసినందుకు కోట్లాది రూపాయలు కొడంగల్ లో కుమ్మరించారు. ఈ డబ్బు పంపిణీపై ఐటి అధికారులకు సమాచారం అందించాము. ఐటి అధికారులకు 17.51 కోట్ల రూపాయలు దొరికితే దాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారు.

టిఆర్ఎస్ అభ్యర్థి నివాసంలో ఇలా డబ్బు దొరకగానే టిఆర్ఎస్ సర్కారు, నరేంద్ర మోదీ కార్యాయలంలో ఉండే కీలక అధికారులంతా రంగంలోకి దిగిర్రు. ఇన్ కం ట్యాక్స్ అధికారులపై  వత్తిడి చేస్తున్నారు. ఎన్నికల అధికారులపై వత్తిడి చేస్తున్నరు. 

కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో  కేంద్ర బలగాలతో నాకు భద్రత ఇవ్వాలని హైకోర్టు చెప్పింది. నా మీద దాడులు జరగడానికి హైకోర్టు ఆదేశాలను తొక్కి పెడుతున్నారు. హైకోర్టు ఆదేశాలను ఎందుకు తొక్కి పెట్టారు? మఫ్టీలో ఉండే పోలీసు అధికారులు నామీద దాడి చేసే చాన్స్ ఉంది. ఆనాడు గద్దర్ మీద దాడి జరినట్లే ఇయ్యాల నామీద దాడులు చేయాలని కేసిఆర్ ప్రభుత్వం ప్రణాళిక రచించింది.

తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి

నేను గతంలో పార్టీ ఫిరాయింపుల గురించి చెప్పిన. నిజమైంది. ఐటి, ఈడి దాడుల గురించి చెప్పిన.. అది నిజమైంది. ఇప్పుడు నామీద దాడులు జరుగుతాయని చెబుతున్నాను. ఇప్పుడు నేను రోడ్ల మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.  నేను నా నియోజకవర్గం పోతున్నాను. ఏ క్షణమైనా దాడి జరగడానికి అవకాశం ఉంది. 

అవసరమైతే నన్ను అంతమొందించేందుకు నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించిర్రు కేసిఆర్. ఈ  ప్రణాళికను డిజిపి మహేందర్ రెడ్డి అమలు చేస్తున్నడు. నామీద దాడి జరిగితే పూర్తి బాధ్యత కేసిఆర్, డిజిపి మహేందర్ రెడ్డిదే.