కంచ గచ్చిబౌలి భూముల వివాదం రోజు రోజుకు ఊహించని మలుపులు తిరుగుతోంది. మొదట భూముల స్థితి, నిర్వాసితుల పరిస్థితులపై చర్చ జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ వివాదం సోషల్ మీడియా వైపు తిరిగింది. ఫేక్ ఫోటోలు, ఏఐ వీడియోలతో సోషల్ మీడియాలో ఒక వర్గం తప్పుడు ప్రచారానికి పాల్పడినట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో ప్రముఖుల పాలుపంచుకున్న విషయమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
వన్యప్రాణులు తిరిగిపోతున్నాయంటూ, నెమళ్లు ఆర్తనాదాలు చేస్తుండటం, జింకలు పరుగులు తీయడం వంటి వీడియోలు, ఆడియోలు వైరల్ అయ్యాయి. వీటిలో నిజం ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ ఏఐతో క్రియేట్ చేసిన ఫేక్ వీడియోలేనని పోలీసులు తేల్చారు. అంతేకాదు, ఇలాంటి తప్పుడు సమాచారం పోస్ట్ చేసిన వారిపై కేసులు నమోదు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించి, ముందస్తు అనుమతుల కోసం పిటిషన్ దాఖలు చేశారు.
ఇక ఈ ఫేక్ వీడియోల పర్యవసానం వల్ల కొందరు సెలబ్రెటీలు ఇబ్బందుల్లో పడ్డారు. నిజంగా ఏం జరుగుతుందో తెలియకుండానే పబ్లిక్ లో స్పందించినవారు ఇప్పుడు తమ సోషల్ మీడియా ఖాతాలనుంచి పోస్టులను తొలగిస్తున్నారు. సమంత, రష్మిక మందన్న, రేణు దేశాయ్ వంటి సెలబ్రిటీలు ఇప్పటికే తమ పోస్ట్‌లను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. వీరంతా ఏఐ టూల్స్ ఉపయోగించి తయారు చేసిన ఫోటోలు, వీడియోల ప్రభావానికి లోనయ్యారని చెప్పవచ్చు.
తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీనిపై తీవ్ర స్థాయిలో స్పందిస్తోంది. శాంతిభద్రతలతో పాటు ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చతగిలే విధంగా తప్పుడు సమాచారం విస్తరణ జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. ఎవరైనా సరే, సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా చర్యలు తప్పవని సంకేతాలిస్తోంది. ఫేక్ ప్రచారానికి తావివ్వకుండా వ్యవహరించాలని కోరుతోంది. ఇక హైకోర్టు కూడా ఈ అంశంపై విచారణ జరుపుతోంది. వచ్చే 24వ తేదీన ఈ కేసుపై వాదనలు విననుంది. ఆ రోజు తరువాత ఎవరు టార్గెట్ అవుతారో, ఎవరిపై చర్యలు తీసుకుంటారో స్పష్టత రానుంది. ఏది ఏమైనా, ఫేక్ కంటెంట్ వల్ల సెలబ్రిటీలు కూడా నిబంధనల వలలో పడే అవకాశాలు ఉన్నాయని ఇది చూపిస్తోంది.


