తెలంగాణలో పోలీసు ఫిజికల్ ఈవెంట్స్ తేదిలను పోలీసు బోర్డు ఖరారు చేసింది. డిసెంబర్ 17 నుంచి ఫిజికల్ మెజర్ మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ లను నిర్వహించనున్నట్టు పోలీస్ బోర్డు చైర్మన్ వివి. శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సై, కానిస్టేబుల్, ఎఎస్సై వివిధ క్యాటగిరిల్లో అన్ని పోస్టులకు 3,77,770 మంది ఈవెంట్లకు ఎంపికైనట్టు తెలిపారు.
ప్రిలిమ్స్ లో ఎంపికైన అభ్యర్దులు పిఎంటి, పీఈటి కోసం పార్ట్ దరఖాస్తులను పూర్తి చేయాలన్నారు. అక్టోబర్ 29 ఉదయం 10 గంటల నుంచి నవంబర్ 18 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఈవెంట్లను 13 చోట్ల నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే ఈవెంట్స్ 35 నుంచి 40 రోజుల్లో పూర్తి అయ్యేలా చూస్తామన్నారు.
ప్రిలిమ్స్ లో ఎంపికైన వారు తమ యూజర్ ఐడి, పాస్ వర్డ్ ఉపయోగించి పోలీసు బోర్డు అధికారిక వెబ్ సైట్ www.tsprb.in లో లాగినయ్యి పార్ట్ 2 దరఖాస్తులను పూర్తి చేయాలని తెలిపారు. సంబందిత సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు జతచేసి ఫాం నింపాలి. పార్ట్ 2 దరఖాస్తు కోసం దాదాపు 3 లక్షల మంది అప్లై చేయనున్నారు. 21 రోజుల సమయం ఉన్నందును రోజుకు 15 వేల మంది చొప్పును దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
పీఎంటి, పీఈటి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్దులు పార్ట్ 2 దరఖాస్తును నింపే సమయంలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీనివాసరావు తెలిపారు. చాలా జాగ్రత్తలతో ఫాం పిల్ చేయాలన్నారు. అభ్యర్దులకు ముందుగానే ఏయే తేదిల్లో ఎవరేవరికి ఈవెంట్లు ఉన్నాయో తెలియజేస్తామన్నారు. అభ్యర్దులు అడ్మిట్ కార్డు తీసుకురావాలని బయోమెట్రిక్ లో వేలిముద్రలు సరిపోతేనే ఈవెంట్లకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు 4 గ్రౌండ్లలో, మిగిలిన జిల్లాలకు ఉమ్మడి జిల్లా కేంద్రాలలో ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఎస్సౌ, కానిస్టేబుల్ పోస్టులకు కలిపి ఒకే దగ్గర ఈవెంట్స్ నిర్వహిస్తారు. ఒక సారి అర్హత సాధిస్తే అన్ని విభాగాలకు వర్తిస్తుంది.
3,77,770 మంది రెండో దశకు ఎంపికయ్యారు. అందులో ఎస్సై సివిల్ 1,10,635 మంది, ఎస్సై ఐటి అండ్ సీ 4684 మంది, ఎఎస్సై ఫింగర్ ప్రింట్ 3276 మంది, కానిస్టేబుల్ సివిల్ 2,28,865 మంది, కానిస్టేబుల్ ఐటి అండ్ సీ 14,981 మంది కానిస్టేబుల్ డ్రైవర్ 13,458 మంది, కానిస్టేబుల్ మెకానిక్ 1871 మంది శరీర ధారుఢ్య పరీక్షలకు ఎంపికయ్యారు.
ఎస్సై, కానిస్టేబుల్ దరఖాస్తులు నింపే సమయంలో తప్పుగా ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా అనే ఆప్షన్ దగ్గర అవును అని పెట్టామని, మరికొందరు కులం తప్పుగా ఇచ్చామని, సరిచేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. వాటిని సరిచేసుకోవచ్చని శ్రీనివాసరావు తెలిపారు. ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా కింద ఉన్న కనీస అర్హత మార్కులతో (ఓపెన్ క్యాటగిరి, బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాటగిరీలో అర్హత సాధించాల్సినన్ని మార్కులు రానట్లయితే) ఫిజికల్ ఈవెంట్స్ కు ఎంపికైన అభ్యర్థులు ఆటోమెటిక్‌గా అనర్హులు అవుతారని స్పష్టంచేశారు.