తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసిఆర్ కొడుకు కేటిఆర్, బిడ్డ కవిత పై పద్మశాలి సంఘం సీరియస్ అయింది. వారిద్దరూ టిడిపి తెలంగాణ అధ్యక్షులు ఎల్.రమణ గురించి పరుషమైన పదజాలంతో విమర్శలు చేయడాన్ని పద్మశాలి సంఘం తప్పుపట్టింది. ఎల్ రమణ చంద్రబాబు ఏజెంటు అని, ఆంధ్రా తొత్తు అని కేటిఆర్, కవిత పదే పదే విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ వ్యతిరేకి అని కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో రమణ సామాజికవర్గానికి చెందిన నాయకులు సీరియస్ అయ్యారు.
ఎల్. రమణ నిబద్ధత ఏంటో కేసిఆర్ ను అడిగి తెలుసుకోవాలని తెలంగాణ పద్మశాలి సంఘం సూచించింది. పద్మశాలీ సంఘం హెచ్చరికల నేపథ్యంలో రమణ లాంటి తెలంగాణ టిడిపి లీడర్లు ఎలా రూపాంతరం చెందారు? వారి గమ్యం, గమనంలో ఎలా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయో ఒకసారి చదవండి. (చివర్లో పద్మశాలి సంఘం పోస్టు ఉంది)
ఇటీవల కాలంలో టిఆర్ఎస్ నేతలు ఎన్నికల ముందుకొస్తున్నకొద్దీ నోటికి పని చెప్పుతున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేసి పరుషమైన భాషలో మాట్లాడుతున్నారు. వారి భాష పదే పదే వివాదాలు రేపుతున్నది. అయినా వారి భాషలో మార్పులు వస్తున్నట్లు లేదు. గత కొంతకాలంగా కేసిఆర్ తిట్ల భాషలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే కేసిఆర్ చంద్రబాబును, రాహుల్, సోనియా లాంటి పెద్ద లీడర్లను తిడుతున్నారు. కేసిఆర్ చూపిన బాటలోనే కేటిఆర్, ఇతర నేతలూ నడుస్తున్నారు. అదే భాషను కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా కవిత కూడా తీవ్రమైన భాషలో విమర్శలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.ఇదంతా చూస్తే తిట్టు తెరాస అధికార భాష అయిందా అనే అనుమానం వస్తుంది.
తెలంగాణలో పద్మశాలి కులానికి చెందిన వ్యక్తి ఎల్.రమణ. ఆయన నిబద్ధత మెచ్చి ఆయనను కేసిఆర్ ఎప్పటినుంచో టిఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తూ వచ్చారు. అయితే రమణ మొదటినుంచి ఫ్యూడల్ విధానానికి వ్యతిరేకిగా ముద్ర పడ్డారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నాటినుంచి అనేక సందర్భాల్లో అగ్రవర్ణాల (దొరల) వెక్కిరింపులను చవిచూశారు. అవహేళనలను భరించారు. అవమానాలను ఎదుర్కొన్నారు. అయినా తన నిబద్ధతను వీడకుండా రాజకీయాల్లో కొనసాగారు.
ఒకవైపు ‘బంగారు తెలంగాణ’ నిర్మాణానికి రాళ్లు మోస్తాం, ఇసుకమోస్తాం అంటూ వందల కొద్ది లీడర్లు తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీ లోకి పరుగులు పెట్టారు. కానీ టిఆర్ఎస్ పెద్ద నేతలు ఎంతగా రమ్మన్నా రమణ మాత్రం టిఆర్ఎస్ లోకి రాలేదు. అక్కడ పోయి బిటి బ్యాచ్ గా బతికే కంటే తనకు రాజకీయ భిక్ష పెట్టిన టిడిపిలోనే గౌరవంగా ఉండడం బెటర్ అన్నట్లు రమణ వ్యవహరించారు. అడ్డగోలు దందాలు చేసి అక్రమ సంపాదన కూడబెట్టినట్లు రమణపై పెద్దగా ఆరోపణలు లేవు.
తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో అనేక మంది బలమైన టిడిపి లీడర్లందరినీ టిఆర్ఎస్ లోకి చేర్చుకునేందుకు తీవ్రమైన వత్తిడి ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఎంత వత్తిడి వచ్చినా రమణ మాత్రం టిఆర్ఎస్ లో చేరాలన్న ఆలోచన మాత్రం చేయలేదు. అదే సమమయంలో టిడిపి సీనియర్ నేతలు చాలా మంది గులాబీ గూటికి చేరిపోయారు.
వారిలో ఒకరు అయిన పోచారం శ్రీనివాసరెడ్డి టిఆర్ఎస్ వత్తిళ్లకు తట్టుకోలేక ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరారు. తర్వాత ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి గెలిచారు. అన్నీ కలిసొచ్చి తెలంగాణ తొలి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా నియమితులయ్యారు.
అలాగే కామారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ కూడా వత్తిడి కారణంగానే టిఆర్ఎస్ లో చేరారు. అప్పట్లో గంప గోవర్దన్ ఇంటి ముందు ఉద్యమ కారులు టెంట్ వేసి నెలల తరబడి తీయకుండా ధర్నాలు చేశారు. వారి డిమాండ్ ఏమంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనేదే. చివరకు గంప గోవర్దన్ టిడిపి ఎమ్మెల్యే సీటుకు గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరిపోయారు. కామారెడ్డిలో గంప గోవర్దన్ రికార్డు మెజార్టీతో గెలిచారు అప్పట్లో.
అదే సమయంలో ఆదిలాబాద్ జోగు రామన్న కూడా ఉద్యమ సమయంలోనే టిఆర్ఎస్ గూటికి చేరారు. తర్వాత ఆయన కూడా తెలంగాణ తొలి ప్రభుత్వంలో మంత్రిగా నియమితులయ్యారు. వీరే కాకుండా ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఉద్యమ కాలంలో టిఆర్ఎస్ లో చేరాలంటూ వత్తిళ్లు వచ్చాయి. అయితే ఆయన ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ గూటికి చేరిపోయారు.
టిడిపి పెద్ద లీడర్లుగా ఉన్న వారిలో తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, ఉమామాధవరెడ్డి, కొప్పుల హరీశ్వర్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, హన్మంత్ షిండే, తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కెపి వివేకానంద గౌడ్ ప్రకాశ్ గౌడ్, కేఎస్ రత్నం లాంటి నేతలంతా వత్తిడితోపాటు బంగారు తెలంగాణ అనే మహాత్తర పేరుతో టిఆర్ఎస్ లోకి చేరిపోయారు.
అయితే ఎంత వత్తిళ్లు వచ్చినా, బెదిరింపులు వచ్చినా కొందరు నేతలు మాత్రం టిడిపిలోనే కంటిన్యూ అయ్యారు. వారిలో రమణతోపాటు ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క, వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి, కొత్తకోట దయాకర్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డి, ఏలేటి అన్నపూర్ణమ్మ, సండ్ర వెంకట వీరయ్య, పెద్దపల్లి విజయరమణారావు, మండవ వెంకటేశ్వరరావు లాంటి వారు మాత్రం టిఆర్ఎస్ ‘బంగారు తెలంగాణ’మోజులో పడలేదు.
తర్వాత కాలంలో ములుగు సీతక్క, పెద్ద పల్లి విజయరమణారావు తమ రాజకీయ భవిష్యత్తు కోసం టిడిపిని వీడి కాంగ్రెస్ లో చేరారు. అలాగే టిడిపిలో ఒక వెలుగు వెలిగిన రేవంత్ రెడ్డి సైతం కాంగ్రెస్ గూటికి చేరారు. రేవంత్ బ్యాచ్ గా కాంగ్రెస్ లో చేరిన టిడిపి నేతలంతా టిడిపి పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారు. ఇక అంతకుముందు టిడిపిని వీడి టిఆర్ఎస్ లో చేరిన వారంతా టిడిపిని, బాబును బండబూతులు తిట్టిన చరిత్ర ఉంది.
అయితే పాలమూరు మరో నేత నాగం జనార్దన్ రెడ్డిది మరో చరిత్ర. ఆయన టిడిపిలో సస్పెన్షన్ కు గురయ్యారు. తర్వాత టిఆర్ఎస్ లో చేరాలంటూ ఆహ్వానం వచ్చినా చేరలేదు. తెలంగాణ నగారా సమితి అనే సంస్థను నెలకొల్పారు. తర్వాత బిజెపిలోకి వెళ్లారు. అక్కడ ఇమడలేక తుదకు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు.
ఇలా తెలంగాణ పచ్చి టిఆర్ ఎస్ వ్యతిరేకులున్నారు. వాళ్లంతా కెసియార్ దొరతనాన్ని వ్యతిరేకించే వారు. అందుకే వారు కాంగ్రెస్ లోకైనా వెళ్లేందుకు సిద్ధపడ్డారు గాని, కెసియార్ తో చేతులు కలిపేందుకు ఎపుడూ సొంగకార్చుకోలేదు. ఇలాంటి దొర తనానికి వ్యతిరేకంగా నిటారు గా నిలబడ్డ వాళ్లలో రమణ ఒకరు. ఇలాంటి రమణ మీద కేటిఆర్, కవిత హద్దు మీరి చేసిన కామెంట్స్ తెలంగాణ పద్మశాలీయులను బాధించాయని పద్మశాలీ నేతలు చెబుతున్నారు. పద్మశాలీయుల్లో లీడర్లే కరువు. ఉన్నవాళ్లలో నిఖార్సయిన వాడు రమణ. ఇలాంటి రమణ ఇమేజ్ దెబ్బతీసే విధంగా కెటియార్, కవిత మాట్లాడటాన్ని తెలంగాణ పద్మశాలీ సంఘం ఖండించింది.
ఈ విషయమై తెలంగాణ పద్మశాలి సంఘం పేరుతో ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్టును కింద యదాతదంగా ప్రచురిస్తున్నాం :
తెలంగాణలో అతి సామన్య కుటుంబం నుండి మరియు వెనకబడిన వర్గంగా గుర్తించబడే పద్మశాలి కుటుంబం నుండి వచ్చిన రమణ గారికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గుర్తింపుతో ఈరోజు రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుడిగా గౌరవం, తలెత్తుకుని గర్వంగా నిలబడే ధైర్యం వచ్చింది అంటే అది రమణ అన్న గారి నిబద్ధత నిజాయితి ప్రజలకోసం కష్టపడిపనిచేసేతత్వం
అటువంటి రమణ అన్న గారిని వయస్సుతో సంబంధం లేకుండ అత్యంత నీచంగా అవమానిస్తు మాట్లాడుతున్న కేటిఆర్, కవిత గారు మీకు నిజంగా దోరల పోకడ అణువనునా పెరుకుపోయింది
మీ నాన్న కేసిఆర్ గారిని అడగండి రమణ అన్న నిబద్ధత. మీ నాన్న రమణ అన్న ఇంటికి పార్టీలోకి ఆహ్వానించడానికి పంపిన కెప్టెన్ లక్షీకాంతరావు, వినోద్ రావులను అడగండి రమణ అన్న నైతికత గురించి ..
ఇంకోసారి చిన్న పెద్ద తేడాలేకుండా మీ ఇష్ఠం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు..
ఇట్లు,
తెలంగాణ పద్మశాలి సంఘం.
వివిధ కారణాలతో టిడిపిని వీడి టిఆర్ఎస్ లో చేరిన లీడర్లు వీరే…
ఒకప్పటి టిడిపి నేత పట్నం మహేందర్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ మంత్రి