తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలోనే అంతంతమాత్రంగా ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్లిపోతుండటంతో ఏం చేయాలో తెలియక చంద్రబాబు తలపట్టుకుని కూర్చుని ఉన్నారు. ఆంధ్రాలో పార్టీని సేవ్ చేసే మార్గం ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించట్లేదు ఆయనకు. వయసు మీద పడటం, యువ నాయకత్వ లోపంతో ఎవరి మీద పార్టీ భారం పెట్టాలో తెలియని డైలమాలో ఉన్నారు బాబు. ఇలాంటి పరిస్థితిలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మరో కష్టం చంద్రబాబుకు మరో కష్టం వచ్చి పడింది.
అయితే ఈసారి వచ్చిన కష్టం ఏదో సర్దుబాట్లతో పోయేది కాదు. ఏకంగా తెలుగుదేశం పార్టీనే మూసేయాల్సిన కష్టం. రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో టీడీపీ మనుగడే కష్టమైంది. ఏదో జాతీయ పార్టీ అనే హోదా ఉండాలంటే ఒకటి ఎక్కువ రాష్ట్రాల్లో పార్టీ ఇండాలి కాబట్టి తెలంగాణలో పార్టీ ఉందని చెప్పుకుంటుంటారు చంద్రబాబు. అంతకుమించి అక్కడ పెద్దగా జరుగుతున్నది ఏమీ లేదు. పార్టీలోని ముఖ్య నేతలంతా ఎప్పుడో పార్టీని వీడిపోయారు. చెప్పగానే గుర్తుపట్టగలిగే స్థాయి నేత ఒక్కరూ లేరు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో బాబుగారు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడంతో ఉన్న కాస్త పరువు పోయి పూర్తిగా నిర్వీర్యమైంది పార్టీ.
ప్రజెంట్ అక్కడ పార్టీ అధ్యక్షడుగా ఎల్. రమణ ఉన్నారు. ఆయనతో ఉన్న కొద్దిమంది నేతలకు, కార్యకర్తలకు అస్సలు పొసగడం లేదు. గత ఏడేళ్లుగా ఎల్. రమణ ఒక్కరే పార్టీ అధ్యక్షుడిగా ఉండటంతో అభివృద్ధి పూర్తిగా దెబ్బతిందని, ఇలాగే ఉంటే తాము అన్యాయమైపోతామని, త్వరగా ఏదో ఒకటి చేసి అధ్యక్షుడిని మార్చాలని బాబుగారికి లేఖ ద్వారా మొరపెట్టుకున్నారట. ట్రీట్మెంట్ ఇస్తే పార్టీ బ్రతికే అవకాశం ఉంటే ఏదో ఒకటి చేసి సర్దుబాటు చేయవచ్చు. కానీ అధ్యక్షుడిని మార్చినా, స్వయంగా తానే వెళ్లి కూర్చున్నా తెలంగాణాలో పార్టీ కోలుకునే అవకాశమే కనిపించట్లేదు. దీంతో తెలంగాణలో పార్టీని ఉంచాలా, మూసేయాలా అనే మీమాంసలో ఉన్నారట బాబు. కొందరు తెలుగు తమ్ముళ్లు అయితే ఏపీలోనే సిట్యుయేషన్ అంతంతమాత్రంగా ఉంటే తెలంగాణలో పార్టీ బ్రతికి బట్టకట్టడం అయ్యే పనేనా, పార్టీని మూసేసి ఆ కష్టమేదో ఏపీ లోనే పడితే ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కదా అంటున్నారు.