తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యేతో కొన ఊపిరి మీద కొట్టుకుంటోంది. రాష్ట్రంలో పార్టీ దాదాపు కనుమరుగయ్యే సిట్యుయేషన్. దానికి తోడు ఉన్న కొద్దిమంది నాయకుల్లో తీవ్ర విబేధాలు నెలకొని ఉన్నాయి. వెరసి పార్టీ భవిష్యత్తు దాదాపు అంధకారమైంది. ఇలాంటి సమయంలో కూడ చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం అనేక విమర్శలకు తావిస్తోంది. తాజాగా బాబుగారు ఇరు రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల పేర్లను ప్రకటించారు. ఏపీకి ముందు నుండి అనుకుంటున్నట్టు అచ్చెన్నాయుడును అధ్యక్షుడిగా ప్రకటించగా తెలంగాణకు ఎల్. రమణనే ప్రెసిడెంట్ పదవిలో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఎల్. రమణతో పార్టీలో ఉన్న కొద్దిమంది నేతలకు, కార్యకర్తలకు అస్సలు పొసగడం లేదు. గత ఏడేళ్లుగా ఎల్. రమణ ఒక్కరే పార్టీ అధ్యక్షుడిగా ఉండటంతో అభివృద్ధి పూర్తిగా దెబ్బతిందని, ఇలాగే ఉంటే తాము అన్యాయమైపోతామని, త్వరగా ఏదో ఒకటి చేసి అధ్యక్షుడిని మార్చాలని బాబుగారికి లేఖ ద్వారా తెలియజేశారు. లేకపోతే పార్టీ బ్రతకడం కష్టమని, అసలు రమణ నాయకత్వంలో పనిచేయడానికి తాము సిద్దంగా లేమని చెప్పేశారు. కానీ అవేవీ బాబుగారికి పట్టలేదు. ఎల్. రమణతో ఉన్న సాన్నిహిత్యమో, ఆయన్ను మించిన నమ్మకస్తుడు దొరకరమే ఉద్దేశ్యమో తేలీదు కానీ పదవికి ఆయన్నే ఎంపిక చేశారు.
దీంతో తెలంగాణ టీడీపీ నేతల్లో ఆగ్రహం తారా స్థాయికి చేరింది. తాము నెత్తీనోరూ బాదుకుని చెప్పినా బాబుగారు పట్టించుకోలేదని వాపోతున్నారు. ఇన్నేళ్లు అధ్యక్షుడిగా ఉన్న రమణ చేసిందేముంది, ఒకసారి కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా అంటున్నారు. అసలు లోకల్ లీడర్ల తీరు చూస్తే టీడీపీలోనే ఉంటే తమకు భవిష్యత్తు ఉండదని గట్టిగా నిర్ణయించుకున్నట్టు ఉన్నారు. దానికి తోడు చంద్రబాబు తాజా నిర్ణయం వారిని మరింత కుంగుబాటుకు గురిచేస్తోంది. ఈ పరిణామంతో వారిలో కొందరు చెప్పాపెట్టకుండా పార్టీని వీడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.