Telangana MLC Elections: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు: కేసీఆర్ వ్యూహానికి కాంగ్రెస్ చిక్కుందా?

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికర మలుపులు తీసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీ నాలుగు స్థానాలను గెలుచుకునేందుకు ప్రయత్నిస్తుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్‌కు గెలిచే అవకాశమున్న ఒక్క స్థానానికి బదులుగా, కేసీఆర్ ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ వైపు నిలబడతారు అనే అంశం చర్చనీయాంశంగా మారింది.

2023 ఎన్నికల అనంతరం బీఆర్ఎస్‌కు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, వారిలో 10 మంది కాంగ్రెస్‌లో చేరిపోయారు. దీంతో సభలో వారి బలం 24కి తగ్గింది. ఎమ్మెల్సీ గెలుపుకు 21 ఓట్లు అవసరం కాగా, ఒక స్థానాన్ని కైవసం చేసుకోవడం బీఆర్ఎస్‌కు పెద్ద సమస్య కాదు. కానీ, రెండో అభ్యర్థిని బరిలోకి దించడమే కీలక మలుపుగా మారింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ఓటు వేస్తారా లేదా అనేదే ప్రధాన ప్రశ్న.

కాంగ్రెస్ తన అభ్యర్థులతో పాటు మిత్రపక్షమైన సీపీఐకి కూడా ఓ సీటు కేటాయించింది. నాలుగు స్థానాలను గెలవాలంటే మొత్తం 84 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఫిరాయింపు ఎమ్మెల్యేల మద్దతుతో బలం 79కి పెరిగినప్పటికీ, మజ్లిస్ మద్దతుతో గట్టెక్కే అవకాశముంది. కానీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఓటు వేయకపోతే కాంగ్రెస్ వ్యూహానికి ఇబ్బంది తప్పదు.

ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యూహం ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఒత్తిడిలో పెట్టేందుకు, కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు చేస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫిరాయింపుల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉండటంతో, ఈ ఎన్నికల ఫలితం రాష్ట్ర రాజకీయాలకు ప్రభావం చూపే అవకాశం ఉంది.